35.2 C
Hyderabad
Thursday, May 21, 2026

Live Video

spot_img
Home Blog Page 229

లైలా ఫన్ రైడ్ లా ఉంటుంది… నిర్మాత సాహు గారపాటి

‘లైలా’ ఫన్ రైడ్ లా ఉంటుంది. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకొవాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. డెఫినెట్ గా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు: నిర్మాత సాహు గారపాటి

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

లైలా సినిమా నిర్మించడానికి మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-మెయిన్ కామెడీ. దీంతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు కొందరు హీరోలని సంప్రదించాం. లేడి గెటప్ చేయడం అంత ఈజీ కాదు. విశ్వక్ చేస్తానని చెప్పడంతో నాకూ ఇంట్రస్ట్ కలిగి ముందుకు తీసుకెళ్ళాం.

-ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమైయింది. డెఫినెట్ గా బావుంటుదని నమ్మి ముందుకు వెళ్లాం. విశ్వక్ చాలా జీల్ వున్న యాక్టర్. ఈ కథ విన్నవెంటనే ‘అన్న ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్ ‘ అని చెప్పారు. ఇందులో లవ్ స్టొరీ తో పాటు ఫన్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.

లైలా, సోను క్యారెక్టర్స్ బ్యాలెన్స్ ఎలా వుంటుంది ?
-ఫస్ట్ హాఫ్ అంతా సోను వుంటాడు. తన లవ్ స్టొరీ ఫస్ట్ హాఫ్ లో వుంటుంది. అనుకోని కారణంగా తనని లైలా గా మార్చుకొని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ రీజన్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.

-విశ్వక్ లైలా గెటప్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని అంటున్నారు. నా వరకూ లైలాకే ఎక్కువ మార్కులు వేస్తాను.

ట్రైలర్ చూస్తుంటే అడల్ట్ కామెడీ అనిపిస్తోంది. ఇలాంటివి బాలీవుడ్ లో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా ?
-అడల్ట్ కామెడీ అన్ని చోట్ల వుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే కదా. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్, కొందరికి అర్ధం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వలన ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ సినిమాలో ఆడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది.

-యూత్ ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది ?
యూత్ ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం.

మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ కి వచ్చారు కదా.. అంతకు ముందే ఆయన ట్రైలర్ చూశారా ?
-ట్రైలర్ చూశారు. కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్ ని మెచ్చుకున్నారు. ఆయనకి ట్రైలర్ చాలా నచ్చింది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన రావడం మా అదృష్టం.

చిరంజీవితో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ?
-మే, జూన్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్ లో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలా వుంటుంది. వింటేజ్ చిరంజీవి గారిలా ఆయన రోల్ ఉంటుంది.

డైరెక్టర్ రామ్ నారాయణ్ గురించి ?
-తన కథకు తగ్గట్టుగా విశ్వక్ ని చూపించడంలో డైరెక్టర్ వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. లైలా అనే టైటిల్ దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు. తను అనుకున్నది పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.

ఇందులో మిగతా పాత్రల గురించి ?
-ఇందులో అభిమన్యు సింగ్ పాత్ర త్రూ అవుట్ వుంటుంది. ఆయన్ని విలన్ గా చూశాం. అందులో ఆయన పాత్ర అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో వుంటుంది. ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

లైలాలో ఎమోషనల్ పాయింట్ ఏమిటి ?
-లైలా కంప్లీట్ ఎంటర్ టైనర్. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అందులో మదర్ ఎమోషన్ కూడా హత్తుకునేలా వుంటుంది. సినిమా అంతా ఫన్ రైడ్ లా వుంటుంది. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుందామని తీసిన సినిమా లైలా.

ఒక నిర్మాత కావాలని వచ్చిన వారికి మీరు ఏం చెప్తారు ?
-ఫ్రాంక్ గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇబ్బంది గానే వుంది. మనం అనుకున్న బడ్జెట్ లో చూసుకుంటే హ్యాపీ. పెరిగితే ఎవరికైనా ఇబ్బందే.

కథలో మీ ఇన్వాల్మెంట్ ఎలా వుంటుంది ?
-కథ నచ్చిన తర్వాతే ముందుకు వెళ్తాం. ప్రాసెస్ లో మార్పులు అనేవి జరుగుతునే వుంటాయి. నాకు ఏదైనా అనిపిస్తే చెప్తాను. లాస్ట్ ఎడిట్ లాక్ చేసేదాక అన్నిట్లో ఇన్వాల్ అవుతాం.

బెల్లంకొండతో తీస్తున్న సినిమా గురించి ?
-డెబ్బై శాతం షూటింగ్ ఫినిష్ అయ్యింది. అది హారర్ థ్రిల్లర్. జూన్ లో రిలీజ్ చేస్తాం. ఈ సినిమాతో పాటు మరిన్ని కొన్ని అనౌన్స్ చేయబోయే మూవీస్ వున్నాయి. స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది.

కోళ్ల వ్యాధిపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కోళ్లకు వింత వ్యాధి సోకుతోంది. అంతుచిక్కని వైరస్‌ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో కోళ్లకు వింత వైరస్‌ సోకింది. వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.

ఈ పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. కోళ్లకు సోకుతున్న అంతుచిక్కిన వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ పశు సంవర్థక శాఖ అలర్ట్‌ అయ్యింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని.. పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్ళను దూరంగా పూడ్చిపెట్టాలని సూచించారు. వైరస్ సోకిన కోళ్ళ తరలింపులో కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది.

ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు హతం – అమిత్‌ షా ఏమన్నారంటే..?

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల ఎదరు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. మరికొంత మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసుల బృందాలు గాలింపు చేపట్టాయి. అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది.

ఈ ఏడాది బీజాపూర్‌లో ఇప్పటివరకు 56 మంది నక్సలైట్లు చని పోయారు. మొదటి ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు, రెండవ ఎదురు కాల్పుల్లో 12 మంది, మూడో ఎన్‌కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు.

కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం దేశంలో 2004-14 దశాబ్దంతో పోలిస్తే 2014 నుంచి 2023 మధ్య వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం తగ్గింది. అలాగే, మరణాల సంఖ్య కూడా 69 శాతం తగ్గింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్‌లు చేపట్టాలని గత యేడాది కేంద్రమంత్రి అమిత్‌ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తిమంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీలో డీజీపీలు, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ల డైరెక్టర్‌ జనరల్‌లు, ఇండో-టిబెటియన్‌ బార్డర్‌ పోలీసులు, ఇంటెలిజన్స్‌ బ్యూరో అధికారులు ఉన్నారు.

ఇప్పుడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించడంపై అమిత్‌ షా ఎక్స్‌ లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్‌ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.

‘ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లోనే పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

కొండగట్టులో హనుమాన్‌ను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

కొండగ‌ట్టు ఆంజ‌నేయ స్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, వేద పండితులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమంయలో వెయ్యి కోట్ల రూపాయలతో కొండ‌గ‌ట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్ర‌ణాళిక రూపొందించారని కవిత చెప్పారు. అదే ప్ర‌ణాళిక‌తో.. లేదంటే మ‌రింత మెరుగైన ప్ర‌ణాళిక‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొండ‌గ‌ట్టును అభివృద్ధి చేయాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల ఇలవేల్పు, భక్తులు పెద్ద ఎత్తున వ‌చ్చే కొండగట్టు క్షేత్రంపై రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌భుత్వం దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కొండ‌గట్టు ఆల‌య అభివృద్ధిని ఆప‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నానని కవిత చెప్పారు. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని కోరారు. కొండ‌గ‌ట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాల‌ని, కొండగట్టులోని రోడ్డును డెవలప్‌ చేయాలని స్థానికులు కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌రమన్నారు కల్వకుంట్ల కవిత. కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి వారి దేవాల‌య అభివృద్ధికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. రూ.25 కోట్లు ఖ‌ర్చు చేసి కొండపై నీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించామని ఆమె చెప్పారు. దేవుడి భూముల‌ను కాపాడ‌డానికి ప్ర‌ణాళిక రూపొందించామని తెలిపారు.

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై చంద్రబాబు విచారం

పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధి మాదల మేజర్ కాలువ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో మధిర సామ్రాజ్యం (50 ) మధిర గంగమ్మ (55 ), చక్కెర మాధవి( 30) తేనెపల్లి పద్మావతి (45 )అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

భాస్కర న్యూస్‌ ఎఫెక్ట్‌ : కిరణ్‌ రాయల్‌పై విచారణకు జనసేన ఆదేశం

జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం నాయకుడు కిరణ్‌రాయల్‌పై భాస్కర న్యూస్‌లో వెలువడిన కథనానికి జనసేన అధిష్టానం స్పందించింది. కిరణ్‌ రాయల్‌ ఓ మహిళను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని, అన్ని రకాలుగా వాడుకొని ముఖం చాటేశాడని తనకు అత్మహత్యే శరణ్యమంటూ బాధితురాలు రిలీజ్‌ చేసిన వీడియోపై భాస్కర న్యూస్‌ మొట్టమొదటగా కథనాన్ని అందించింది. బాధితురాలి వెర్షన్‌ను ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్‌ చేసింది. తన పిల్లలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానని, కిరణ్ రాయల్‌ వల్ల అప్పుల్లో కూరుకు పోయానని, అప్పుల వాళ్లకు కూడా సమాధానం చెప్పలేక పోతున్నానని బాధితురాలు సెల్పీ వీడియోలో పేర్కొంది. అంతేకాదు.. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, కేవలం కిరణ్ రాయల్‌ వల్లే చనిపోతున్నానని వీడియోలో వివరించింది.

కిరణ్ రాయల్‌పై వచ్చిన ఆరోపణలు, బయటకు వచ్చిన వీడియోలు, భాస్కర న్యూస్‌లో వచ్చిన కథనం నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీలో కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీ కిరణ్‌రాయల్‌ ఇష్యూపై విచారణ చేపడుతోంది.

జనసేన పార్టీ అంతర్గత విచారణ పూర్తయ్యేదాకా కిరన్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించినట్లు హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

అంతేకాదు.. కిరణ్‌రాయల్‌ ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో మరొకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడిపై దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులోని ప్రఖ్యాత వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రంగరాజన్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై 20 మంది దాడి చేశారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని,. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయని, ఇంతకు మించి దీనిపై మాట్లాడబోనని రంగరాజన్‌ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్‌ ఇంటికి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్‌ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై బెదిరింపులను టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందర్‌ రాజన్ ఖండించారు. ఫిబ్రవరి 7వ తేదీన తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై రంగరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు సౌందర్‌రాజన్. చిలుకూరి బాలాజీ ఆశీస్సులతోనే తన కుమారుడు క్షేమంగా బయటపడ్డాడని – సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.

అయితే, రామరాజ్యం పేరుతో వచ్చిన వాళ్లు దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను మీడియాకు అందజేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఆ వీడియోలను కింద చూడొచ్చు.

కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ఘాటు కౌంటర్‌

తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే పాద‌ర్శ‌కంగా జ‌రిగిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ . కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పుల తడక అంటున్నారని విమర్శించారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకుపైగా సిబ్బందిని నియమించి ఇంటింటికీ తిరిగి స్వయంగా పరిశీలించి కులగణన చేపట్టడం జరిగిందన్నారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆదేశాను సారం కుల‌గ‌ణ‌న స‌ర్వేను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక‌ల్పంతో పూర్తి చేసిందని పీసీసీ చీఫ్ చెప్పారు.

కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్య‌లను బీసీ స‌మాజం క్ష‌మించ‌దన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. 1931 తర్వాత తెలంగాణలో మాత్రమే కులగణన జరిగిందన్నారు. దీంతో, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పక్కాగా పకడ్బందీగా కులగణనను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు.

2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు పారదర్శకంగా చేసిన సర్వే గురించి మాట్లాడడం అవివేకమన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారని చెప్పారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – స‌ర్వే గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందన్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం హ‌స్యాస్పదమని ఎద్దేవా చేశారు.

ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్‌- బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటిచేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్య‌ర్థులు క‌రువయ్యారని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా బీఆర్‌ఎస్‌ ప‌రోక్షంగా బీజేపీకి మద్ద‌తిస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ చెప్పారు.

మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌ రాజీనామా

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌ సింగ్‌ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇంఫాల్‌లో గవర్నర్ అజయ్‌ కుమార్ భల్లాకు అందజేశారు. తొలిసారి 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరేన్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి 2022లో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి ముందు బీరెన్‌ సింగ్‌.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో బీరేన్‌ సింగ్‌ సమావేశమయ్యారు. మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేండ్లుగా మణిపూర్‌లోని మీటి, కుకి జాతుల మధ్య హింస కొనసాగుతోంది. దీంతో, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. అయితే, ఈ పరిణామాలతో బీరెన్‌సింగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు త్వరలో సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయడం గమనార్హం. ఆరుగురు ఎమ్మెల్యేలు గల నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నేతలతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కొందరు అధికార బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది.

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు… ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ… : రేవంత్‌రెడ్డి ధ్వజం

  • మోదీ ర‌హ‌స్య అజెండా అది
  • హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
  • తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం
  • సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహర‌ణ‌
  • మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే నినాదం.. నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ అనే విధాన‌మ‌ని.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ర‌హ‌స్య అజెండా అదే అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మ‌రో అంశ‌మ‌ని.. కుటుంబ నియంత్ర‌ణ విధానంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోల్చితే ద‌క్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాజ్యాంగం ప్ర‌సాదించిన గ్యారంటీల‌ను, మ‌న హక్కుల‌ను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు చేతులు క‌ల‌పాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్ర‌మే కాద‌ని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌ప్న‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ను భార‌త దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే అత్యుత్తుమంగా నిల‌పాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్‌.. విజ‌న్ -2050, ద‌క్షిణాది రాష్ట్రాలు ఎందుకు క‌లిసి ప‌ని చేయాల‌నే దానిపై ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందిని, 60 ఏళ్ల క‌లను నెర‌వేర్చినందున తెలంగాణ ప్ర‌జ‌లు సోనియా గాంధీని ఎంత‌గానో ప్రేమిస్తున్నారని రేవంత్ చెప్పారు. త‌న ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదన్నారు. ఆ పార్టీ నాయ‌కులు ఎన్నో వాగ్దానాలు చేశారే త‌ప్ప వాటిని నెర‌వేర్చ‌లేదని దుయ్యబట్టారు. తెలంగాణ జీడీపీ సుమారు 200 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉందని, 2035 నాటికి దానిని ఒక మిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా మార్చాల‌నుకుంటున్నామన్నారు. తెలంగాణ‌ను హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ అనే మూడు జోన్లుగా విభ‌జించామన్నారు. 160 కిలోమీట‌ర్ల పొడ‌వైన అవుట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని కోర్ అర్బ‌న్ ఏరియాలో 1.2 కోట్ల ప్ర‌జ‌లు నివసిస్తున్నారని, ఈ ప్రాంతం సాఫ్ట్‌ వేర్‌, ఫార్మా రంగాల‌కు కేంద్రంగా ఉందన్నారు. చార్మినార్‌, హైద‌రాబాద్ బిర్యానీ, ముత్యాల‌కు హైద‌రాబాద్ ప్ర‌సిద్ధి అని గుర్తు చేశారు.ఓఆర్ఆర్ ప‌రిధిలోని ఈ కోర్ అర్బ‌న్ ఏరియాను స‌ర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయ‌నున్నామన్నారు తెలంగాణ సీఎం. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామన్నారు. దేశంలోని ముంబ‌యి, ఢిల్లీ, బెంగ‌ళూర్‌, చెన్నై వంటి న‌గ‌రాల‌తో కాకుండా ప్ర‌పంచంలోని ముఖ్య న‌గ‌రాలైన న్యూయార్క్‌, లండ‌న్‌, సింగ‌పూర్‌, టోక్యో, సియోల్ వంటి న‌గ‌రాల‌తో పోటీప‌డేలా హైద‌రాబాద్ ఉండాల‌నుకుంటున్నామని చెప్పారు.

30 వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీ నిర్మిస్తున్నామని, ఇది భార‌త‌దేశంలోని పూర్తి హ‌రిత‌, ప‌రిశుభ్ర‌మైన‌, అత్యుత్త‌మ‌మైన న‌గ‌రంగా ఉండ‌నుందన్నారు. ప్ర‌పంచంలోని మ‌రే న‌గ‌రంతో పోల్చుకున్నా ఇది స‌రైన ప్ర‌ణాళిక‌, జోన్లు ఉన్న న‌గ‌రంగా ఉండ‌నుందన్నారు. అలాగే ఇది మొట్ట‌మొద‌టి నెట్ జీరో సిటీ అని చెప్పారు. ఫ్యూచ‌ర్ సిటీలో తాము ఏఐ సిటీని కూడా నిర్మిస్తున్నామని.. యువ‌త కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో తాను పాల్గొన్నానని, ఒక లక్షా 82వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌కు తీసుకురాగ‌లిగామని చెప్పారు. గ‌తేడాది రూ.40 వేల పెట్టుబ‌డులు వ‌చ్చాయని, బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌నా కాలంలో మొత్తం రూ.25 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను కూడా సాధించ‌లేక‌పోయిందని విమర్శించారు. హైద‌రాబాద్ ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌కుగానూ మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు చేప‌ట్టామని.. మూసా… ఈసా న‌దుల క‌ల‌యికే మూసీ… గ‌త యాభై ఏళ్లుగా కాలుష్యం కోర‌ల్లో చిక్కి మూసీ క‌నుమ‌రుగయ్యే స్థితికి చేరిందన్నారు. తమ ప్ర‌భుత్వం మూసీకి పూర్వ వైభ‌వం తేవాల‌నుకుంటోందని చెప్పారు. గోదావ‌రి నీటిని మూసీలో క‌ల‌ప‌డం ద్వారా త్రివేణి సంగమంగా మార్చ‌నున్నామని చెప్పారు. అక్క‌డే 200 ఎక‌రాల్లో గాంధీ స‌రోవ‌ర్‌ను నిర్మిస్తున్నామన్నారు.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న రేవంత్‌రెడ్డి.. అందుకే తాము డ్రై పోర్ట్ నిర్మించ‌నున్నామని చెప్పారు. దానిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సీ పోర్ట్‌కు ప్ర‌త్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా క‌లుపుతామన్నారు. హైద‌రాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్య‌మ‌వుతుందన్నారు. అభివృద్ధి మొద‌ట నగ‌రాలతోనే మొద‌ల‌వుతుంద‌నేది నా భావ‌నగా చెప్పారు. హైద‌రాబాద్ రైజింగ్ కావాలంటే అది వేగ‌వంత‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన‌, అవ‌కాశాలు క‌ల్పించే న‌గ‌రంగా ఉండాలన్నారు. తాము రీజిన‌ల్ రింగు రోడ్డును, రీజిన‌ల్ రింగు రైల్వే లైను నిర్మించ‌బోతున్నామని.. ఈ రెండింటిని రేడియ‌ల్ రోడ్ల ద్వారా క‌ల‌ప‌నున్నామని రేవంత్‌ చెప్పారు. తాము ఇటీవ‌ల ఎన‌ర్జీ పాల‌సీని విడుదల చేశామని, ఈవీల‌పై ఉన్న అన్ని ప‌న్నుల‌ను తొల‌గించామన్నారు. ఈవీల అమ్మ‌కాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని 3 వేల ఆర్టీసీ బ‌స్సులను ద‌శ‌ల‌వారీగా ఈవీలుగా మార్చ‌నున్నామన్నారు. ఓఆర్ఆర్‌-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య ఉన్న సెమీ అర్బ‌న్ ఏరియాను ఉత్ప‌త్తి జోన్‌గా మార్చ‌బోతున్నామని.. ఇది చైనా+1 అనే మా వ్యూహానికి ప్ర‌పంచానికి స‌మాధానంగా నిల‌వ‌నుందన్నారు. ఔష‌ధాలు, విత్త‌నాల ఉత్ప‌త్తిలో తెలంగాణ ముందువ‌రుస‌లో ఉందన్నారు. వాటికి అద‌నంగా ఎఫ్ఎంసీజీ, ర‌క్ష‌ణ‌, రాకెట్స్‌, స్పేస్‌, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, గ్రీన్ ఎన‌ర్జీ రంగాల్లో ముందు వ‌రుస‌లో నిల‌వాల‌నుకుంటున్నామని చెప్పారు. భార‌త‌దేశానికి డాటా సెంట‌ర్ హ‌బ్ గా, పంప్ స్టోరేజీ హ‌బ్‌గా తెలంగాణ నిల‌వ‌నుంది. దేశంలోని ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌కు అనుసంధానమై, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంట‌ర్‌గా ఉండాల‌ని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ వెలుప‌ల నుంచి రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న గ్రామాల‌ను మార్చాల‌నుకుంటున్నామని.. గ్రామాల్లోనూ అత్యుత్త‌మ వ‌స‌తులు క‌ల్పిస్తామని చెప్పారు. రైతుల‌కు 24 గంట‌లు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇస్తున్నామని, రైతుల‌కు ఎక‌రాకు రూ.12 వేలు రైతు భ‌రోసా ఇస్తున్నామని, భూమి లేని కుటుంబాల‌కు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామని, పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు క్వింటాకు రూ.500 బోన‌స్ ఇస్తున్నామని రేవంత్‌ చెప్పారు. దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ అని గర్వంగా చెప్పారు. 25 లక్ష‌ల రైతు కుటుంబాల‌కు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశామన్నారు. కేవ‌లం మౌలిక వ‌స‌తుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదని, రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, పిల్ల‌లు, వ‌యోధికుల అంద‌రి విష‌యంలోనూ మేం దృష్టి పెడుతున్నామన్నారు. తెలంగాణ రైజింగ్‌లో వారూ భాగ‌మే అన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లో రూ.10 ల‌క్ష‌ల మేర హెల్త్ క‌వ‌రేజీ ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ‌లో ఎవ‌రైనా ఏ ఆసుప‌త్రికి వెళ్లినా మేం చూసుకుంటున్నామన్నారు. విద్యా, నైపుణ్యాలు నా ప్ర‌థ‌మ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, అన్ని గురుకులాల్లో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల‌ను రెట్టింపు చేశామన్నారు. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ‌లో మ‌హిళ‌లంద‌రికీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించామని, అక్కాచెల్లెళ్లు ఇప్ప‌టికే కోట్లాది బ‌స్సు ప్ర‌యాణాలు ఉచితంగా చేశారని చెప్పారు. ఎంతో డ‌బ్బును ఆదా చేసుకున్నారని, అక్కా చెల్లెళ్ల‌కు రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తున్నామని, ఇళ్ల‌కు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రేవంత్‌ సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామని, ప్ర‌తి సంవ‌త్స‌రం నాలుగు ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించ‌నున్నామని చెప్పారు. 20 ల‌క్ష‌ల పేద కుటుంబాలు సొంత ఇళ్ల క‌ల నెర‌వేరుతుంద‌ని నేను హామీ ఇస్తున్నానన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానమని… ద‌ళితులు, ఓబీసీలు, గిరిజ‌నులు, మైనారిటీల‌కు సామాజిక న్యాయం చేస్తామ‌ని తమ నాయ‌కుడు రాహుల్ గాంధీ అభ‌య‌మిచ్చారన్నారు.

స‌మ‌గ్ర కుల స‌ర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌.. దానిని అసెంబ్లీలోనూ ప్ర‌వేశ‌పెట్టామన్నారు. జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక‌న వ‌న‌రులు స‌మ‌కూర్చుతామన్నారు. వ‌ర్గీక‌ర‌ణ కోసం 30 ఏళ్లుగా మాదిగ సోద‌ర సోద‌రీ మ‌ణులు పోరాడుతున్నారని, వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని తాము 2024, ఫిబ్ర‌వ‌రి 4న నిర్ణ‌యం తీసుకున్నామని చెప్పారు. 2025, ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌త్యేక శాస‌న‌స‌భ స‌మావేశం ఏర్పాటు చేసి దాని అమ‌లుకు తీర్మానం చేశామన్నారు. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్స‌వంగా జ‌రుపుకోనున్నామని చెప్పారు. సుప‌రిపాల‌న ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఆర్థిక స‌ర్వే నివేదిక ప్ర‌కారం అతి త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌ అని చెప్పారు. అలాగే, గ్లోబ‌ల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్ర‌కారం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో వినియోగంలో తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలోనూ తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందన్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com