ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరుడి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. పంచారామ క్షేత్రంలో ఒకటైన కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో స్వామి వారి కల్యాణోత్సవాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. భీమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు.. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వైభవంగా స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రమణీయంగా అలంకరించిన కళ్యాణమూర్తులకు సుముహూర్తంలో ఆలయ వేద పండితులు, అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా కల్యా ణం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం కుటుంబ సమేతంగా కల్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కళ్యాణ మండపంలో భీమేశ్వర స్వామి వారికి, మాణిక్యమ్మ అమ్మవారికి వివాహం జరిపించారు. ఈ వేడుకలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
మహా కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ధిచెందిన మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాలో.. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటనలో ఆమె వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ఉన్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత.. అక్కడే ఉన్న పక్షులకు ఆహారం కూడా అందించారు రాష్ట్రపతి.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటన సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.సోమవారం ఉదయమే ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి రాష్ట్రపతితో పాటు.. యూపీ సీఎం, గవర్నర్ కూడా త్రివేణీ సంగమానికి బోటులో వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న పక్షులకు రాష్ట్రపతి ముర్ము.. ఆహారం అందించారు. త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. అక్కడే గంగమ్మ తల్లికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి పరర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎనిమిది గంటల పాటు అక్కడే ఉండబోతున్నారు. బడే హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్ష యవత్ వృక్షాన్ని కూడా రాష్ట్రపతి దర్శించుకుంటారు. అనంతరం మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను రాష్ట్రపతి పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్తారు.
(వీడియో : ANI సౌజన్యం)
గత నెల 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 26వ తేదీన మహా కుంభమేళా ముగుస్తుంది. మహా కుంభమేళా ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటి వరకు 44 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసే నాటికి మరో ఆరు కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా నిత్యం కిక్కిరిసిపోతోంది. ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రతి దారిలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి గంటలు, పూటలు, రోజుల సమయం పడుతోంది.
సముద్ర తీర ప్రాంతాల్లో తండేల్ ఫీవర్
తండేల్ సినిమా టాకీసుల్లో మారుమోగిపోతోంది. థియేటర్లలో, బయటా.. హిట్ టాక్ అందుకుంది. అటు.. సముద్ర తీర ప్రాంతాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పేరు మారుమోగిపోతోంది. నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సమస్యలే సబ్జెక్ట్‌గా రూపొందించిన తండేల్ సినిమా అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల బాధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. 2018లో తెలియకుండా సరిహద్దులు దాటి పాకిస్తాన్ చేతిలో బందీలుగా మారిన శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత గాథను తండేల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే సిక్కోలు జిల్లాలో మత్స్యకారులు స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో ఉపాధి దొరక్కపోవడంతో పాటు.. వేట గిట్టుబాటు కాక పోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో చాటి చెప్పింది ఈ సినిమా.
శ్రీకాకుళం జిల్లా పూర్తిగా సముద్ర తీరంలోనే ఉంటుంది. మొత్తంగా 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా చూస్తే.. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే.. అందులో ఎక్కువభాగం అంటే.. దాదాపు 20శాతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. రణస్థలం మండలం ధోనిపేట నుంచి సముద్రతీరప్రాంతం.. ఇచ్చాపురం మండలం డుంకూరు దాకా విస్తరించింది. జిల్లాలోని 11 మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండగా.. శ్రీకాకుళం జిల్లా పరిదిలోనే సముద్ర తీరంలో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది దాకా మత్స్యకార జనాభా ఉన్నారు. అయినప్పటికీ.. మత్స్యకారులు తాము నివసిస్తున్న ప్రాంతంలో వేట కొన సాగించలేని పరిస్థితిలో వలస బాట పట్టడం అనివార్యమవుతోంది. కేవలం 50 సంవత్సరాలు పైబడిన వాళ్లు మాత్రమే జిల్లాలో తాము నివసిస్తున్న ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు. అయితే, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ మత్స్యకారులకు సంబంధించిన కుటంబాలకు చెందిన యువకులు ఉపాధి బాట పట్టడం నిత్యకృత్యంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లానుంచి ఉపాధి కోసం వలస వెళ్తున్నవాళ్లు.. గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ప్రతి యేటా ఆగస్ నెలలో తమ గ్రామం నుంచి ఉపాధి వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తారు. తర్వాత తదుపరి యేడు మార్చి నెలలో స్వగ్రామాలకు తిరిగి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టర్ల వద్ద పనిలో చేరతారు. ఈ క్రమంలోనే ప్రమాదకరస్థాయిలో వేట కొనసాగిస్తుంటారు. ఈ వేట సాగించే క్రమంలో సరైన భద్రతా చర్యలు లేక.. ప్రమాదాల్లో మృత్యువాత కూడా పడుతుంటారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి సరిహద్దు జలాల్లోకి ప్రవేశించి విదేశీ బందీలుగా కూడా మారుతుంటారు. వాస్తవానికి శ్రీకాకుళంజిల్లా మత్స్యకారులు ఒక్క బంగాళాఖాతంలోనే కాదు. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో కూడా చేపల వేటకు వెళ్తారు. సిక్కోలు జిల్లాలో సుదూర సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. సరైన హార్బర్ కానీ, పోర్టు కానీ, కనీసం జెట్టి కానీ అందుబాటులో లేవు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే.. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టి ఉంటుంది. కానీ, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఏవీ లేవు. అందుకే ఇక్కడ మత్స్యకార యువకులు అనివార్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి గ్రామంలో తండేల్ కథ రిపీట్ అవుతూనే ఉంటుందన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కుంభ మేళాలో కిట కిట…
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్యస్నానాలాచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్‌లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయని అంచనా. 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ను కొంత మేర అయినా నియంత్రించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వేస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పదిహేను రోజులో మహాకుంభమేళా ముగియనున్న నేపధ్యంలో భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 41 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
ప్రెసిడెంట్ మస్క్… ట్రంప్ రియాక్షన్ అదుర్స్…
ప్రెసిడెంట్ మస్క్… అదేంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా. మరి బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను ప్రెసిడెంట్ అనడం ఏంటనే కదా మీ ప్రశ్న. కానీ మస్క్‌ను ప్రెసిడెంట్ మస్క్ అనే పిలుస్తున్నారు అమెరికాలోని డెమొక్రాట్లు. అయితే ఇదే విషయాన్ని తమ మ్యాగజైన్ కవర్ స్టోరీగా పబ్లిష్ చేసింది టైమ్స్ మ్యాగజైన్. దీంతో ఇప్పుడు అమెరికాలో సరికొత్త వివాదం మొదలైంది.
టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీలో ఓ విషయం ప్రచురితమైంది అంటే దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాంటి మ్యాగజైన్ ఈసారి మస్క్‌పై చాలా సంచలన విషయాలను అందులో చెప్పింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ రకంగా అమెరికాలో సమూళ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టారు. కొనసాగుతున్నవాటిని రద్దు చేశారు. అయితే వీటన్నింటిని వెనక మస్క్ ఉన్నారని చెబుతోంది టైమ్ మ్యాగజైన్. దీనికి సింబాలిక్‌గా అధ్యక్షుడి కార్యాలయంలోని టేబుల్, దాని వెనకున్న కుర్చిలో మస్క్ కాఫీ కప్పు పట్టుకున్నట్టు పేజీని డిజైన్ చేసింది.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల పీకలపై కత్తులు వేలాడుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌ఎయిడ్‌ను పూర్తగా రద్దు చేశారు. 9,700 మందిని ఇంటికి పంపించి వేస్తున్నారు. డీప్ స్టేట్‌పై వేటు పేరుతో అనేక రంగాల్లో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెడీగా ఉన్నారు. ఇందులో ఇంటెలిజెన్స్, రక్షణ రంగ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీటన్నింటిని వెనక మస్క్ ఉన్నారంటోంది టైమ్స్ మ్యాగజైన్. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఇప్పుడు మస్క్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని చెబుతోంది.
అంతేకాదు మస్క్ ఎవరికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడటం లేదని చెబుతోంది ఈ కవర్ స్టోరి. ట్రంప్‌కు తప్ప ఆయన ఇంకెవరికి జవాబుదారీ కాదని చెబుతోంది. ఈ కథనాన్ని రాసింది సైమన్ షుస్టర్, బ్రియాన్ బెన్నేట్. డోజ్ పనితీరుకు సంబంధించి వీరు పంపిన ప్రశ్నలకు వైట్‌హౌజ్ అస్సలు పట్టించుకోలేదంటున్నారు. అంతేకాదు మస్క్ తనకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వ విధానాలను మార్చుకుంటున్నారని ఆరోపించారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా ట్రంప్‌పై కవర్ పేజీ ప్రచురించింది. అప్పుడు మస్క్‌ను కింగ్ మేకర్‌గా అభిర్ణిస్తూ దీనిని ప్రచురించింది. అయితే ఇదే విషయాన్ని జర్నలిస్ట్‌లు ట్రంప్ ముందు లెవనెత్తగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా? అంటూ సెటైర్లు వేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ కొనసాగుతుందన్న విషయమే తనకు తెలియదంటూ తన వెటకారాన్ని కొనసాగించారు.
మరి నిజంగానే మస్క్ అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నను గతంలో ట్రంప్‌ను అడిగారు జర్నలిస్ట్‌లు. మస్క్ అమెరికాలో జన్మించలేదు కాబట్టి.. మస్క్ అధ్యక్షుడయ్యే చాన్స్ లేదు.. ఇది ట్రంప్ ఇచ్చిన సమాధానం.
మాలి కులస్తుల సమస్యలపై ఉపముఖ్యమంత్రికి విన్నపం
పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీయం భట్టి విక్రమార్కని కలసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని వారు విజ్ఞప్తి చేశారు. 2008లో వైయస్సార్ సీఎం గా ఉన్నప్పుడు జ్యోతిబాపూలే జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించారని, ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చి ప్రజాపాలనను అందించడం శుభ పరిణామం అని తెలిపారు. మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు కేటాయించాలని, హైదరాబాదులో మాలి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని కోరారు. గత అనేక సంవత్సరాలుగా మాలి కులస్తులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణ యూనివర్సిటీకి సావిత్రి బాయి పూలే తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయాలని, ట్యాంక్ బండ్ పై పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. సావిత్రి బాయి పూలే జన్మదినమైన జనవరి 3ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం అని అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాలి కులస్తుల జాతీయ అధ్యక్షుడు విలాసరావు పాటిల్, సావిత్రి బాయ్ పూలే వంశీయులు డాక్టర్ దిలీప్ గణపతి పాటిల్ బృందం ఈసందర్భంగా డిప్యూటీ సీఎంను ఘనంగా సన్మానించారు.
బీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట జరుగుతోంది
బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్
భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో ఆధిపత్యం కోసం మూడు ముక్కలాట నడుస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ వ్యవహార సరళిపై మహేష్‌గౌడ్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో కేటీఆర్, హారీష్, కవితల మద్య మూడు ముక్కలాట నడుస్తోందని చెప్పారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఫామ్ హౌస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విపక్ష హోదా ఎందుకని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్ధులే లేరని అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవ్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మిత్రుత్వం ఉందని మహేష్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే రాష్ట్రానికి బడ్జెట్‌లో తెచ్చిన నిధులు గాడిద గుడ్డులా ఉన్నాయని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
కటక్‌లో రోహిత్ కథాకళి.. బ్యాట్‌తోనే అందరికి సమాధానం
కటక్‌లో రోహిత్ శర్మ తనేంటో అందరికి మరోసారి చూపించాడు. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తూ తనపై వచ్చిన వస్తున్న విమర్శలన్నింటిని కొట్టుకుపోయేలా చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడిస్తూ.. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. కెరీర్‌లో 32వ సెంచరీ చేయడమే కాదు.. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని.. మీ రిటైర్‌మెంట్ ప్రచారాన్ని తీసి ఆటకెక్కించండని తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట రోహిత్ శర్మ చేసిన ఈ సెంచరీ.. తనకు మాత్రమే కాదు.. కోట్లాది మంది టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
90 బంతుల్లో 119.. ఇది రెండో వన్డేలో రోహిత్ శర్మ చేసిన పరుగులు. నిజానికి చాలా రోజులుగా రోహిత్ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆడింది చాలు ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే మంచిదని చాలా మంది మాజీ ప్లేయర్లు కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ వీటన్నింటిని పటా పంచలు చేశాడు రోహిత్.
నిజానికి రోహిత్‌కు సెచంరీ చేయడానికి చాలా కాలం పట్టింది. వన్డేల్లో చివరి సెంచరీ 2023 అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్థాన్‌పై చేశాడు. ఈ లెక్కన వన్డేల్లో చివరి సారిగా 487 రోజుల ముందు సెంచరీ చేశాడు రోహిత్. ఇక అన్ని ఫార్మాట్ల లెక్కన చూస్తే 338 రోజుల తర్వాత సెంచరీ చేశాడు. టెస్టుల్లో గతేడాది మార్చిలో సెంచరీ చేశాడు రోహిత్.
హిట్‌మ్యాన్ అంటేనే సిక్స్‌లు. ఈ మ్యాచ్‌లో కూడా సిక్స్ బాదే తన సెంచరీని కంప్లీట్ చేశాడు రోహిత్. ఇప్పటి వరకు 338 సిక్స్‌లు బాదాడు రోహిత్. దీంతో వన్డెల్లో 331 సిక్స్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్న క్రిస్ గేల్‌ను దాటేశాడు. గేల్ 301 మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్ 267 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించేశాడు. ఈ విషయంలో 351 సిక్స్‌లతో షాహిద్ అఫ్రిది ఉన్నాడు. త్వరలోనే ఈ రికార్డ్ కూడా బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్టులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా ఇండియన్ క్రికెటర్ రోహిత్ నిలిచాడు. ఓపెనర్‌గా సచిన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు.
గెలుపు మనదే.. సిరీస్ మనదే..
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో మ్యాచ్‌లో గెలుపుతో పాటు 2-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. నిజానికి టీమిండియా ముందు 305 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది ఇంగ్లండ్. నిజానికి ఇంగ్లండ్ టాపార్డర్ అదరగొట్టింది. డకెట్, సాల్ట్ మొదటి నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. హర్షిత్, షమీ, హార్దిక్ బౌలింగ్‌లో పరుగుల వరద పారించాడు. అయితే తన కెరీర్‌లో ఫస్ట్ వన్ డే మ్యాచ్ ఆడుతున్న వరుణ్ చక్రవర్తి ఈ జోడిని బ్రేక్ చేవాడు. 11వ ఓవర్‌లో సాల్ట్ 26 పరుగల వద్ద ఔటయ్యాడు. ఇక 16వ ఓవర్‌లో డకెట్‌ను 65 పరుగుల వద్ద జడేజా కూడా ఔట్ చేయడంతో మ్యాచ్ స్కోర్ స్లో అయిపోయింది. ఆ తర్వాత రూట్, బ్రూక్ మరో వికెట్‌కు ఏకంగా 62 పరుగులు చేశారు. ఆ తర్వాత బట్లర్ కూడా కాస్త దూకుడుగా ఆడటం.. చివర్లో లివింగ్ స్టన్ మెరుపులతో ఇంగ్లండ్ స్కోర్ 300 దాటింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు హిట్‌మ్యాన్ నేనున్నానుగా అన్నట్టుగా చెలరేగిపోయాడు. తాను క్రీజులో ఒక్కసారి కుదురుకుంటే ఎలా ఉంటుందో చాలా రోజుల తర్వాత అందరికి చూపించాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రోహిత్. మరో ఎండ్‌లో గిల్ కూడా తానేం తక్కువ కాదంటూ దూకుడుగా ఆడాడు. దీంతో 16 ఓవర్లకే ఒక్క వికెట్ నష్టపోయకుండా 167 పరుగులు చేసింది టీమిండియా. అయితే ఆ తర్వాత ఓవర్టన్ గిల్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడం.. ఆ వెంటనే పరుగుల వరద పారిస్తాడనుకున్న కోహ్లీ 5 పరుగులకే వెనుదిరగడంతో మ్యాచ్ కాస్త స్లో అయిపోయింది.
గిల్, కోహ్లీ వెనుదిరిగినా రోహిత్ మాత్రం అస్సలు ఆగలేదు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్ కంటిన్యూ చేశాడు. 26 ఓవర్‌లో లాంగాఫ్‌లో సిక్స్ బాది తన కెరీర్‌లో 32వ సెంచరీ చేశాడు. కేవలం 72 బంతుల్లోనే రోహిత్ శతకం బాదేసి తానేంటో చూపించాడు. నిజానికి రోహిత్ వెనుదిరిగే సమయానికి టీమిండియా గెలుపు దాదాపు ఖరారైంది. చివర్లో అక్షర్ పటేల్, జడేజా మ్యాచ్‌ను గెలిపించేశారు.
మూడు వన్డేల సిరీస్‌లో రెండు గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది టీమ్ ఇండియా. ఇక మూడో వన్డే ఈ నెల 12న జరగనుంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా క్లీన్ స్వీప్ చేయనుంది.
రాజమండ్రిలో రామ్ పోతినేనికి రాయల్ వెల్కమ్
ఉస్తాద్ రామ్ పోతినేని అందరివాడు. అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ అజాత శత్రువుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన మీద అభిమానం చూపించే ప్రేక్షకులు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. అందుకు ఇవాళ రాజమండ్రిలో చోటు చేసుకున్న దృశ్యం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
రాజమండ్రిలో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరి జిల్లాలలో సంప్రదాయం ప్రతిబింబించేలా అరటి పళ్ళతో చేసిన భారీ దండతో వెల్కమ్ చెప్పారు. RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్తే… ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇప్పటివరకు ఏ హీరోకి ఇటువంటి ఘన స్వాగతం రాజమండ్రిలో దక్కలేదు. అరటిపళ్ల దండ అందుకున్న మొదటి హీరో రామ్.
మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. లేటెస్ట్ షెడ్యూల్ సోమవారం రాజమండ్రిలో ప్రారంభం అవుతుంది. దీనికోసం సుమారు 15 ఏళ్ల తర్వాత గోదావరి జిల్లాలలో అడుగుపెట్టారు రామ్. ఇంతకుముందు ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమా చిత్రీకరణ గోదావరి జిల్లాలలో చేశారు. అప్పటికి ఇప్పటికీ గోదావరి ప్రజలలో రామ్ మీద అభిమానం బాగా పెరిగింది. ఈ సినిమాలో రామ్ పోతినేని జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు.