26.2 C
Hyderabad
Sunday, October 19, 2025

Live Video

spot_img
Home Blog

నేడు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు

భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడో రోజు బుధవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం…అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి.

బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలిరావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. అన్నపూర్ణ దేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతో పాటు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి కూడా చదువుకుంటే శుభఫలితాలు పొందుతారని పురాణేతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో…తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం.
ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందిస్తుంది అన్నపూర్ణమ్మ. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది.

బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఏది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని చెబుతారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం.

రహదారుల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతం చెయ్యండి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీయం రేవంత్‌రెడ్డి

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణం విషయంలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పలు జాతీయ రహదారుల పురోగతిపై సీయం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులు, జిల్లా కలెకర్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి బందరు పోర్టు వరకూ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం విషయమై అధికారులతో సీయం సమీక్షించారు. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా రూట్‌ మ్యాప్‌ పై తుది నిర్ణయం తీసుకోవాలని సీయం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్‌, శ్రీశైలం హైవే ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులు కేంద్ర నుంచి వెంటనే తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లతో సీయం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.  భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందిచాలని సీయం ఆదేశించారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి భూసేకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా భూ సేకరణ విషయంలో న్యాయ పరమైన సమస్యలు ఉత్పన్నమైతే ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

  • పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్
  • సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ
  • విశాఖలో జరిగిన 28 వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో సీఎం చంద్రబాబు

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.   కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సివిల్ సర్సీసెస్ -డిజిటల్ ట్రాన్సఫర్మేషన్  థీమ్ తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ – గవర్నెన్సు అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం అన్నారు. ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చు కోగలుగుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం అన్నారు.

సంజీవని ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అమలుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్  సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం సూచించారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని సీఎం తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాలన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందిస్తున్నామని త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశానికీ అమలు చేసేందుకు అస్కారం ఉందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏమేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో బీపీఓ విధానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఇప్పుడు కొన్ని యాప్ ల ద్వారా వచ్చే ఆర్ధిక ప్రయోజనాలు విదేశాలకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్నాలజీలో మరో కీలకమైన అంశంగా సెమికండక్టర్ల పరిశ్రమ పైనా దృష్టి పెట్టాలని అన్నారు. ఓ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించటంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో  భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌ ప్రకటించిన సీయం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌ సచివాలయంలో జరిగిన సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో సియం మాట్లాడుతూ రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు.  సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీయం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా భవిష్యత్తులో సింగరేణి సంస్ధని తీర్చిదిద్దుతామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు కాగా అందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని నికర లాభాంలో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించామని సీయం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది రూ.5000 బోనస్ అందించామని ఈ సారి వారికి  రూ.5500 బోనస్ అందిస్తున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ లైబ్రరీ

  • కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు
  • 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటుచేస్తాం
  • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సోమవారం శాసనసభా సమావేశంలో సమాధానం ఇచ్చారు. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ సభ్యులకు తెలియజేశారు. రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతోపాటు మ్యాన్యువల్‌ స్క్రిప్ట్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో  గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలో రూ.20కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లల్లో పఠనాసక్తి పెంచే అంశాన్ని సీరియస్ గా తీసుకొని రాబోయే ఆరునెలల్లో మార్పులు తెచ్చేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకోసం కార్టూనిస్టులతో కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం చివరిదశలో ఉందని, ఈ లైబ్రరీని అక్టోబర్ నెలలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల నిర్మాణాలను చేపడతామని మంత్రి లోకేష్‌ అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త జిల్లాల ప్రాతిపాదికన 26 జిల్లా గ్రంథాలయాలను ఏర్పాటుచేస్తామన్నారు. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులను సంప్రదించి గ్రంధాలయ సెస్సు బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల్లో కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని. ముఖ్యమంత్రి  సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించామని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

మోడీ రిటైర్మెంట్‌ ఎప్పుడంటే…

రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

2047లో వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించిన తరువాత మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ ఆ పదవి నుంచి విరమణ తీసుకుంటారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈసందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ పలు ఆసక్తిక ర వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఇంకా ఎంత కాలం ఆ పదవిలో కొనసాగుతారని ఇంటర్వ్యూయర్‌ అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానం చెపుతూ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2034, 2039, 2044లో జరిగే ఎన్నికల్లో సైతం మోడీనే ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. వికసిత్‌ భారత్‌ను ప్రధాని మోడీ తన వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారని ఈ సందర్భంగా రాజనాథ్‌ వెల్లడించారు. అది సాధించేంత వరకూ మోడీ విశ్రమించరని రాజనాథ్‌ తెలిపారు. 2047వ సంవత్సరానికి భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చి శతాబ్ది కాలం పూర్తవుతుందని అప్పటికి మేము వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి చేరుకుంటామని రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశం ఈ లక్ష్యానికి చేరుకున్న తరువాతే నరేంద్ర మోడీ పదవీ విరమణ చేస్తారని రాజనాథ్‌ వ్యాఖ్యానించారు.

రాశిఫలాలు…25.05.25 నుండి 31.05.25 వరకు

ఈవారం పండగలు–పర్వదినాలు…

25, ఆదివారం, మాసశివరాత్రి, రోహిణి కార్తి ప్రారంభం.

28, బుధవారం, నిజకర్తరి త్యాగం

–––––––––––––––––—————-

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ముఖ్యమైన పనుల్లో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలోని అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఉన్నతస్థితి దక్కవచ్చు. అయితే బాధ్యతలపై దృష్టి సారించండి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. 29,30 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. వాహన, గృహయోగాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణాలు సైతం తీరుస్తారు. కుటుంబంలో అందరి ఆదరణ పొందుతారు. మీరంటే అంతా ఇష్టపడతారు. కుటుంబసమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభిస్తాయి.కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న హోదాలు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 27,28 తేదీల్లో ఆదాయం నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. గాయత్రీ ధ్యానం చేయండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. మీ అంచనాలు నిజమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రావలసిన సొమ్ము అందుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా డబ్బు సమకూరుతుంది. అందరితోనూ ఆదరణతో మసలుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది.  ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలో అనుకున్న రీతిలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. కొన్ని సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతమైన కాలం. 30,31 తేదీల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆకస్మిక ప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రావలసిన సొమ్ము అందినా రుణాలు సైతం చేస్తారు. ఆస్తుల విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలోని అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు అందుతాయి. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి కొన్ని సమస్యలు తీరతాయి. 28,29 తేదీల్లో ఇంటాబయటా ఒత్తిడులు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకోకుండా సొమ్ము సమకూరుతుంది. కుటుంబంలో మీపై అంతా అభిమానం చూపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని రుగ్మతలు తీరి ఉపశమం పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.  పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని అవకాశాలు. 30,31 తేదీల్లో కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు.కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పదిమందిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత అనుకూల సమయం. రాజకీయ, కళారంగాల వారికి యోగవంతంగా ఉంటుంది. 25,26 తేదీల్లో మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

కార్యక్రమాలను అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం మెరుగుపడి రుణాలు సైతం తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సభ్యులతో వివాదాలు తీరతాయి. కొద్దిపాటి అనారోగ్య సూచనలున్నాయి, తగు వైద్యసలహాలు పాటించండి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో రావలసిన హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి మరింత అనుకూల సమయం. 28,29 తేదీల్లో పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబసభ్యులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు.ఆకస్మిక ధనలాభం. సోదరుల నుంచి కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు. పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి.కళాకారులకు ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. 30,31 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని విషయాలలో అంచనాలు నిజమవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొంత సొమ్ము అనూహ్యంగా అందుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరతాయి. శారీరక రుగ్మతలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులతో మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని రీతిలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి అనుకూల సమయం. 26,27 తేదీల్లో దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విరోధాలు. ఆలోచనలు కలిసిరావు. విష్ణుధ్యానం చేయండి.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి.కుటుంబంలో వివాదాలు తీరతాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందుతారు. విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి అరుదైన ఆహ్వానాలు రాగలవు. 25,26 తేదీల్లో ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు. మీ అంచనాలు తప్పుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పఠించండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సొమ్ముకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కుటుంబంలోని అందరి ప్రేమను చూరగొంటారు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు. అనుకూల బదిలీలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మొత్తంమీద కలసివచ్చే కాలం. 28,29 తేదీల్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).

కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. రుణాలు చేస్తారు. కుటుంబంలో ఏది మాట్లాడినా విరోధాలు నెలకొనవచ్చు. శారీరక రుగ్మతలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలు అంది నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరుత్సాహం. 26,27 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శివపంచాక్షరి పఠించండి.

–––––––––––––––––––––––––

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్నాటక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, కుంకీ ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖా మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు. కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్ లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పవన్ కళ్యాణ్ కి అందజేశారు.

శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు. ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి అప్పగించారు. కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మరోసారి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంత్రి పర్యటన లో భాగంగా హెలికాప్టర్ హుజూర్‌ నగర్ మండలం మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, వాతావరణ శాఖ సూచన మేరకు, అకస్మాత్తుగా కమ్ముకున్న మబ్బులు, బలమైన గాలి వాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమై కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేమంగా హెలికాప్టర్ నుంచి దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హుజూర్‌ నగర్‌కు బయలుదేరి వెళ్లారు. గతంలోనూ పలు మార్లు మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లు అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇలా జరగడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అయితే, పైలట్‌ క్షేమంగా ల్యాండ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వచ్చేనెల 3 నెలల రేషన్‌ ఒకేసారి పంపిణీ

  • ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం

  • సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర సర్కార్‌ కసరత్తు

  • 5.25 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమని అంచనా

  • మిల్లింగ్‌ స్పీడప్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మూడు నెలల రేషన్‌ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్‌ సప్లైస్‌ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. వర్షాకాలంలో వరదలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్‌ సప్లై ఆఫీసర్లకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌సింగ్‌ లెటర్‌ రాశారు.

మే 31వ తేదీ లోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని, ఇందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో ఎఫ్‌సీఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే, తెలంగాణలో మే నెల కోటా రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్‌లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు మూడు నెలలకు కావాల్సిన సన్నబియ్యాన్ని సమకూర్చుకునేందుకు సివిల్‌ సప్లై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్‌ -1, స్టేజ్2 గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు.

వీటి ఆధారంగా జూన్, జులై, ఆగస్ట్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ కోటాను జూన్‌లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతినెలా 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్నబియ్యం నిల్వలను సమీకరించనున్నారు. ఈ క్రమంలోనే సన్న వడ్ల మిల్లింగ్‌ స్పీడప్‌ చేయాలని మిల్లర్లకు సివిల్‌ సప్లై ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com