కటక్‌లో రోహిత్ శర్మ తనేంటో అందరికి మరోసారి చూపించాడు. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తూ తనపై వచ్చిన వస్తున్న విమర్శలన్నింటిని కొట్టుకుపోయేలా చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడిస్తూ.. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. కెరీర్‌లో 32వ సెంచరీ చేయడమే కాదు.. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని.. మీ రిటైర్‌మెంట్ ప్రచారాన్ని తీసి ఆటకెక్కించండని తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట రోహిత్ శర్మ చేసిన ఈ సెంచరీ.. తనకు మాత్రమే కాదు.. కోట్లాది మంది టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
90 బంతుల్లో 119.. ఇది రెండో వన్డేలో రోహిత్ శర్మ చేసిన పరుగులు. నిజానికి చాలా రోజులుగా రోహిత్ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆడింది చాలు ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే మంచిదని చాలా మంది మాజీ ప్లేయర్లు కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ వీటన్నింటిని పటా పంచలు చేశాడు రోహిత్.
నిజానికి రోహిత్‌కు సెచంరీ చేయడానికి చాలా కాలం పట్టింది. వన్డేల్లో చివరి సెంచరీ 2023 అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్థాన్‌పై చేశాడు. ఈ లెక్కన వన్డేల్లో చివరి సారిగా 487 రోజుల ముందు సెంచరీ చేశాడు రోహిత్. ఇక అన్ని ఫార్మాట్ల లెక్కన చూస్తే 338 రోజుల తర్వాత సెంచరీ చేశాడు. టెస్టుల్లో గతేడాది మార్చిలో సెంచరీ చేశాడు రోహిత్.
హిట్‌మ్యాన్ అంటేనే సిక్స్‌లు. ఈ మ్యాచ్‌లో కూడా సిక్స్ బాదే తన సెంచరీని కంప్లీట్ చేశాడు రోహిత్. ఇప్పటి వరకు 338 సిక్స్‌లు బాదాడు రోహిత్. దీంతో వన్డెల్లో 331 సిక్స్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్న క్రిస్ గేల్‌ను దాటేశాడు. గేల్ 301 మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్ 267 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించేశాడు. ఈ విషయంలో 351 సిక్స్‌లతో షాహిద్ అఫ్రిది ఉన్నాడు. త్వరలోనే ఈ రికార్డ్ కూడా బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్టులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా ఇండియన్ క్రికెటర్ రోహిత్ నిలిచాడు. ఓపెనర్‌గా సచిన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు.