35.2 C
Hyderabad
Thursday, May 21, 2026

Live Video

spot_img
Home Blog Page 227

స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రెడీ!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడొస్తుందా? అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదురుచూస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బందికి శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. మరోవైపు.. షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి. ప్రత్యే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఉండే నేతలు కూడా.. పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా పావులు కదుపుతున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్‌గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా చూస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశావాహులు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే.. మరింత దూసుకెళ్లాలని సర్వ సన్నద్ధంగా ఉన్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే.. పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణలోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం గతేడాది జనవరి 31వ తేదీన ముగిసి పోయింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. 2024 జూన్ నెలలలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. దీంతో, ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా..? లేక పంచాయతీ ఎన్నికలు ఉంటాయా..? అనే దానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల ప్రకటన ఉండనుంది. మరోవైపు.. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను ఈసీ గుర్తించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం రెడీగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముసాయిదాలను కూడా దిశానిర్దేశం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తులపై ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష నిజమేనా?

  • దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
  • బలపడుతున్న డిమాండ్…
  • ఇన్నాళ్లు వాదనలే తప్ప కార్యాచరణ లేదు
  • వన్ నేషన్ – వన్‌ ఎలక్షన్ నినాదం వెనక ఉద్దేశాలవేనా?
  • దక్షిణాది రాష్ట్రాల ఐక్య ఉద్యమానికి రేవంత్‌ పిలుపు

కారణాలివే…

  • కేంద్రానికి అందించేది ఎక్కువ.. పొందేది తక్కువ
  • అనాదిగా ఇదే తీరు.. దక్షిణాది కష్టం ఉత్తరాది పాలు
  • కష్టం ఒకరిది..దక్కేది మరొకరికి..
  • అన్ని బడ్జెట్లలోనూ అరకొర కేటాయింపులే
  • కట్టే కప్పానికి తిరిగి తీసుకునే పైకానికి పొంతనే లేదు
  • దక్షిణాదిపై జాతీయ పార్టీల సవతి తల్లి ప్రేమ
  • మోడీ హయాంలో మరింత సుస్పష్టం
  • బీజేపి పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే భారీ కేటాయింపులు

దక్షిణ భారతంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనపరుస్తోందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపైనా, కేటాయింపులపైనా చర్చకు తెర లేచింది. తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి పత్రిక ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్ ఆఫ్‌ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు కలసి కట్టుగా నడుం బిగించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన(డీలిమిటేషన్) చేయాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల లోక్ సభ నియోజక వర్గాలు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల నియోజక వర్గాలు పెరుగుతాయని బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంటుందని దాంతో ముందు ముందు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యమే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలకు కారణం ఇక్కడ కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడమేనని, జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తున్న తమకు ప్రోత్సాహకాలు లేకపోగా అధిక జనాభా ఉండి అల్పాదాయాన్ని అందించే ఉత్తరాది రాష్ట్రాలపైనే కేంద్రం ప్రేమ, కేటాయింపులు కురిపిస్తోందని విమర్శించారు.అసలు మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదమే పెద్ద కుట్రని రేవంత్‌ అన్నారు. స్థానిక సంస్థలనుంచి, కేంద్ర ఎన్నికల వరకూ తమ పెత్తనమే సాగాలన్న ఆరాటం తప్పితే అందులో మరేం లేదని, రాజ్యాంగం, కేంద్ర రాష్ట్రాలకు కొన్ని హక్కులు, విధులు కల్పిస్తే సర్వహక్కులను హరించాలని కేంద్రం చూస్తోందని అన్నారు. మోడీ అజెండాను అమలు జరిపితే భవిష్యత్తులో ఏక పార్టీ పాలన అవుతుందని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదమని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.
గతంలోనూ.. ఇదే భావన
బహుశా ఇంత పెద్ద ఎత్తున ఈ అంశంపై ఇటీవల కాలంలో ఇంత గట్టిగా మాట్లాడింది రేవంత్‌ అనే చెప్పాలి. గతంలో కేసీఆర్ హయాంలో కూడా దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేసీఆర్ మాట్లాడారు.కానీ ఆ తర్వాత ఎందుకో సైలెంట్‌ అయిపోయారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా గతంలో ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జనసేన ఆవిర్భావ సభలో ఈ నినాదాన్ని గట్టిగా ఎత్తుకున్నారు. బీజేపి నిర్ణయాలను తీవ్రాతి తీవ్రంగా అప్పట్లో ఆయన విమర్శించారు. కానీ పదేపదే పార్టీ ఓటమి తర్వాత ఆయన పంథా మారి బీజేపితో దోస్తీ వైపు తిరిగిపోయింది. ఇప్పుడు మోడీ ఏం చేసినా అది రైటేననే స్టేజిలో పవన్ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉద్యమించాలని, తలసరి ఆదాయంలో మెరుగ్గా ఉన్నా మనకు చేస్తున్న కేటాయింపులు అధ్వాన్నంగా ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల తరపున ఉద్యమానికి తాను శ్రీకారం చుడతానని అప్పట్లో పవన్ అన్నారు. కానీ ఇప్పుడు బహుశా ఆ ఊసే ఎత్తరు. ఇలా నేతలంతా ఉత్తర, దక్షిణ తారతమ్యాలపై చాలా సార్లు గళమెత్తినా ఎవరూ ఆ వేడిని కొనసాగించలేదు. అది ఉద్యమ పంథా తీసుకోలేదు.
గణాంకాలే నిదర్శనం..
కేంద్రం ఉత్తరాది,దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడా చూపిస్తోందనడానికి గణాంకాలే సాక్ష్యం.. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల ద్వారా ఇతర ఆదాయ మార్గాల ద్వారా అందిస్తున్న ధనంతో పోలిస్తే ఈ రాష్ట్రాలకు దక్కే కేటాయింపులు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి.వాస్తవానికి అక్కడ జనాభా ఎక్కువ.. మన జనాభా తక్కువ. అయినా మనం కేంద్రానికి ఇస్తున్న నిధుల వాటా ఎక్కువ.. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నా వారు కేంద్రానికి అందిస్తున్న పన్నుల వాటా చాలా తక్కువ.. అయినా కేంద్రం వారికి కేటాయింపులు మాత్రం చేతికి ఎముక లేకుండా చేసేస్తోంది.
జనభా వ్యత్యాసం..
ఉత్తరాదిన యూపీ, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మొత్తం జనాభా 2011 లెక్కల ప్రకారం చూస్తే 912,030,836 కోట్లు.. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ,గోవా, పాండిచ్చేరి ల మొత్తం జనాబా 2011 లెక్కల ప్రకారమే 25,13,22,872 కోట్లు.. ఇదంతా జనాభా నియంత్రణకు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేందుకు, స్వయంసమృద్ధిని సాధించేందుకు అమలు జరిపిన కుటుంబ నియంత్రణ పథకాల ఫలితమే.. ఫలితంగానే దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా ప్రొడక్టివిటీ పెరిగింది. అందుకే పన్నుల వసూళ్లు అవీ క్రమబద్ధంగా జరిగాయి. ఆమొత్తం కేంద్రానికి మన వాటాకింద సమర్పిస్తే.. కేంద్రం మనకు తిరిగి చేసే కేటాయింపులు మాత్రం దారుణాతి దారుణంగా ఉంటున్నాయి.అదెలాగంటే ఉదాహరణకి ఏపీ కేంద్రానికి పన్నుల ద్వారా వంద రూపాయలు అందిస్తే తిరిగొచ్చేది కేవలం రూ.46.అదే తెలంగాణ కేంద్రానికి వంద రూపాయలు అందించిందంటే దానికి తిరిగొచ్చేది రూ.49. ఇది దక్షిణాది రాష్ట్రాల దుస్థితి.. అదే ఉత్తరాది రాష్ట్రం యూపీ కేంద్రానికి వంద రూపాయలు అందిస్తే దానికి తిరిగి వచ్చేది రూ.333. ఇక మధ్య ప్రదేశ్ వంద రూపాయలు ఇచ్చి రూ.279 వెనక్కి తీసుకుంటోంది.ఇక బీమారు రాష్ట్రమైన బీహార్ గురించి వినాలంటే గుండె చిక్కబట్టుకోవాలి.బీహార్ కేంద్రానికి అందించే పన్నులే చాలా చాలా తక్కువ. ఆ రాష్ట్రం వంద రూపాయలు కేంద్రానికి ఇస్తే తిరిగి తీసుకునేది రూ.922. ఈత కాయ ఇచ్చి తాటికాయ లాక్కోవడం అంటే ఇదే.. అలాగే మరో రాష్ట్రం ఒడిషా.. అది కూడా అంతే.. ఆ రాష్ట్రం ఇచ్చేది తక్కువ.. తీసుకునేది ఎక్కువ.
ఇక తాజా లెక్కలను తీసుకుంటే 2025 జనవరి నెలలో కేంద్ర రాష్ట్ర కేటాయింపులు ఒక సారి పరిశీలిస్తే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలోంచి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి కేంద్రం విదిల్చిన సొమ్మెంతో తెలుసా? కేవలం రూ.27,336 కోట్లు. ఈ మొత్తంలో ఏపీ ఏడు వేల కోట్లు, కర్ణాటక ఆరువేల కోట్లు, తెలంగాణ మూడువేల కోట్లు, తమిళనాడు ఏడు వేల కోట్లు, కేరళ మూడు వేల కోట్ల చిల్లర చొప్పున అందుకున్నాయి. మరి యూపీకి ఎంత మొత్తం కేటాయింపు జరిపిందో తెలుసా? యూపీ ఒక్క రాష్ట్రానికీ అక్షరాలా రూ.31,039 కోట్లు.. మోడీ ప్రభుత్వం దక్షిణాదిని పిండి ఉత్తరాదికి దోచి పెడుతోందనడానికి ఇంత కన్నా నిదర్శనం యేం కావాలి. మోడీ ప్రభుత్వం అధిక కేటాయింపులు జరిపిన రాష్ట్రాలన్నీ బీజేపి పాలిత రాష్ట్రాలే.. బీహార్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే ఆ రాష్ట్రానికి కేటాయింపుల వరద పారించిందనేది సుస్పష్టం.
అనాదిగా ఇదే తీరు….
ఇక ఇప్పుడంటే బీజేపి అధికారంలోకి వచ్చింది కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కూడా ఇదే తీరు.. ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని స్పష్టం గా చూపిస్తోంది.పార్టీ నాయకత్వ బాధ్యతలు, పదవుల కేటాయింపులు కూడా అంతే.. కీలక పదవులన్నీఉత్తరాదివే.. అటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ.. మనకి మాత్రం ఎప్పుడూ సామంత రాజు పరిస్థితే..ఉత్తర దక్షిణ తారతమ్యాలు చాలా కాలం నుంచే ఉన్నా.. బీజేపి అధికారంలోకి వచ్చాక ఇది మరీ ఎక్కువైపోయిందనే వాదనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోంది.

మణిపూర్‌లో ఏం జరుగుతోంది?

మణిపూర్‌లో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మరోవైపు.. ఆ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్ రాజీనామా చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీకి కాస్తంత ఇమేజ్‌ పెంచినట్లే అనిపించినా.. సీఎం రాజీనామా చేసినంత మాత్రాన తాము సైలెంట్‌గా ఉండబోమని ప్రకటిస్తున్నారు. బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

గడిచిన కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఓ దశలో అల్లర్లు తీవ్రరూపం కూడా దాల్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న రెండు తెగలకు చెందిన వాళ్లు పరస్పరం దాడులు, ప్రతి దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తొలుత ఈ పరిణామం ఆ రాష్ట్రానికే పరిమితం కాగా.. దాడులు, హత్యల తీవ్రత పెరగడంతో.. క్రమంగా జాతీయ సమస్యగా మారింది. ఆ తర్వాత అంతర్జాతీయ సమస్యగా కూడా పరిణమించింది. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తలనొప్పిగా మారాయి. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. ఓ దశలో రాజ్యసభను మణిపూర్‌ అంశం స్తంభింపజేసింది. పార్లమెంటులో ఈ అంశంపై రోజుల తరబడి చర్చ జరిగింది. ఈ రచ్చతో బీజేపీకి సరైన సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే, మణిపూర్‌లో అల్లర్లకు చెక్‌ పెట్టడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తూనే ఉంది. చివరికి ఇంటర్నెట్ సేవలను కూడా మణిపూర్‌లో బ్యాన్‌ చేసింది. మణిపూర్ మరకను తుడిచి వేసేందుకు బీజేపీ అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

మణిపూర్‌లో ఇప్పటికీ అల్లర్లు జరుగుతుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఇదే అదునుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఎత్తు వేసింది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌పై రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని శనివారం ప్రకటించింది. అవిశ్వాసం ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో.. ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. అంతకుముందు బీరేన్‌ సింగ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు పంపించారు. కాగా, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఒక్కరోజులోనే బీజేపీ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం కలిగించింది. అయితే బీరెన్ సింగ్ రాజీనామా చేసినంతమాత్రాన మణిపూర్ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోమని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉందని.. అప్పటిదాకా ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సోమవారం తాము అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన వెంటనే.. మణిపూర్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారని, ఇది నైతికంగా తాము సాధించిన విజయం అని కాంగ్రెస్‌పార్టీ అంటోంది. కాకపోతే ఇందులో రాజకీయాలు చూసుకోవడం లేదని, మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామని, బీజేపీ అధినాయకత్వం ఆదిశగా అడుగులు వేయకపోతే ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తామని, కచ్చితంగా ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

ఢిల్లీ సీఎం రేసులో టాప్‌ 6 లీడర్స్‌ వీళ్లే…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాస్‌ విక్టరీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఇక.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేయాలన్న అంశంపై తర్జన భర్జనలు పడుతోంది. ఆశావహుల చరిత్ర, సామర్థ్యం, దేశ రాజధాని ఢిల్లీలో పాలన సాగించగల సత్తా ఉన్న నాయకుడిని ఎంపిక చేసే పనిలో పడింది.

పర్వేష్‌ సింగ్‌ వర్మ :

ఢిల్లీ సీఎం రేసులో ముందున్నారు పర్వేష్‌ సింగ్‌ వర్మ. రిజల్ట్ రిలీజ్‌ అయిన నాటి నుంచీ పర్వేష్‌ పేరు మారుమోగి పోతోంది. పర్వేష్‌ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు పర్వేష్‌ వర్మ. 2019 ఎన్నికల్లో 5.78 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యంత భారీ మెజారిటీ. ఇక, ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. కేజ్రీవాల్‌ను 4,099 ఓట్ల తేడాతో ఓడించారు పర్వేష్‌ వర్మ. పర్వేష్‌ వర్మకు చిన్నప్పటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ పర్వేష్‌ వర్మ విజయం సాధించారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్‌ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. పశ్చిమ యూపీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అత్యంత బలమైన జాట్‌ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పర్వేష్‌. పర్వేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయా రాష్ట్రాల్లోని జాట్‌ సామాజిక వర్గాన్ని బీజేపీ తనవైపునకు తిప్పుకునే చాన్స్‌ ఉంటుంది. ఇక, తాను గెలిచిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు పర్వేష్‌. ఇది కూడా ఆయనకు కలిసివచ్చే అంశమే.

సతీష్‌ ఉపాధ్యాయ్‌ :

ఢిల్లీ ముఖ్యమంత్రి పోటీలో వినిపిస్తున్న రెండో పేరు సతీష్‌ ఉపాధ్యాయ్‌. ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం సతీష్‌ ఉపాధ్యాయ్‌కు ఉంది. సతీష్‌ ఉపాధ్యాయ్‌ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం ఎన్‌డీఎంసీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పరిపాలనా అనుభవం కూడా ఉంది. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. అంతేకాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా సతీష్‌ ఉపాధ్యాయ్‌కు బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీలో 12 నుంచి 14 శాతం బ్రాహ్మణుల జనాభా ఉంది. దీంతో, సతీష్‌ ఉపాధ్యాయ్‌ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తోంది.

అశీష్‌ సూద్‌ :

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న మూడో పేరు ఆశీష్‌ సూద్‌. ఢిల్లీలో భారతీయ జనతాపార్టీకి ఇప్పుడు ఈయన పంజాబీ ఫేస్‌గా ఉన్నారు. పార్టీలో పంజాబీలకు అశీష్‌ సూద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశారు. ప్రస్తుతం గోవా ఇన్‌చార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర నాయకులతో ఆశీష్‌ సూద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన రికార్డ్‌ ఆయనకు ఉంది.

జితేంద్ర మహాజన్‌ :

ఢిల్లీ సీఎం పోటీలో నెంబర్‌ ఫోర్‌ వినిపిస్తోన్న పేరు జితేంద్ర మహాజన్‌. వైశ్య సామాజికవర్గానికి చెందిన నాయకుడాయన. ఈయనకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న సంబంధాలు ఈయనకు అనుకూలించవచ్చని చెబుతున్నారు.

విజేందర్‌ గుప్తా :

ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న ఐదో పేరు విజేందర్‌ గుప్తా. ఈయన కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హవా ఉన్నప్పటికీ, విజేందర్‌ గుప్తా విజయం సాధించారు. ఢిల్లీ సీఎం ఆశావహుల జాబితాలో, పరిశీలన జాబితాలో ఈయన పేరు కూడా ఉంది.

మంజీందర్‌ సింగ్‌ సిర్సా :

ఇప్పటిదాకా చెప్పుకున్న నేతలే కాదు.. మరికొంత మంది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో తాము ఉన్నామంటున్నారు. ఈ జాబితాలో ఆరో పేరు మంజీందర్ సింగ్ సిర్సా. 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్‌పై ఈయన విజయం సాధించారు. ఆ తర్వాత రాజౌరి గార్డెన్ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్‌నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే.. పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుందన్న అంచనాలున్నాయి.

ఛాంపియన్స్ టోర్నీ నిర్వహణ పాక్‌తో అయ్యే పనేనా?

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవడానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ట్రోఫిని సాధించాలన్న కసి ఛాంపియన్ దేశాలన్నింటిలో కనిపిస్తోంది. కానీ టోర్నిని నిర్వహించడంలో పాకిస్థాన్‌ సక్సెస్ అవుతుందా? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది. ఎందుకంటే పాక్‌లో మ్యాచ్‌లు అనగానే చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫికి పాకిస్థాన్‌ సరైన ఏర్పాట్లు చేయగలదా? ప్లేయర్ల సెక్యూరిటీ విషయం ఏంటి? పేరు మోసిన స్టేడియాలు లేవు కదా? ఆటగాళ్లు సౌకర్యంగా ఉంటారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. పాకిస్తాన్‌లో టోర్నీ నిర్వహించడంపై ప్రతి ఒక్క దేశం అసంతృప్తిగానే ఉంది. అయితే ఈ భయాలను నిజం చేసే ఘటన ఒకటి జరిగింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నాం అని చాలా గొప్పగా చెప్పుకుంది. కానీ ఆ స్టేడియం వల్లే ఇప్పుడు న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడేందుకు కారణమైంది.

చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతుంది. నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి రచిన్ నుదుటికి బలంగా తాకడంతో రక్తమోడుతూ గ్రౌండ్‌ను వీడాడు. బంతి తగలగానే నొప్పితో అతడు విలవిల్లాడాడు. మోకాళ్ల మీద అలా కూర్చుండిపోయాడు. రక్తం ఎంతలా కారిందో ప్రపంచం మొత్తం చూసింది. ఫీల్డింగ్‌లో అదరగొట్టే రచిన్‌ స్ట్రెయిట్‌గా తన చేతుల్లోకి వచ్చే ఓ బాల్‌ను ఎందుక అంచనా వేయలేకపోయాడనేది ఓ ప్రశ్నగా మారింది. రచిన్‌కు దెబ్బ తగిలిన విధానంతో స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మెడికల్ టీం రచిన్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ గాయం కారణంగా రచిన్ టోర్నీకి దూరం అయ్యే అవకాశం కూడా ఉంది.

రచిన్‌ క్యాచ్ పట్టుకునే సమయంలో బాల్ కనిపించలేదని, ఫ్లడ్ లైట్ వెలుతురు సరిగా లేదని తేలింది. నాసిరకం ఫ్లడ్ లైట్లు వాడటం వల్లే ఇలా జరిగిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన నాటికి.. గడాఫీ స్టేడియం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. గ్రౌండ్, సీటింగ్, పిచ్ ఇలా ఏదీ రెడీ కాలేదు. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఐసీసీ కమిటీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను హెచ్చరించింది. గడువులోగా నిర్మాణం పూర్తి చేయకపోతే.. వేదికను దుబాయ్‌కి మార్చుతామని తేల్చిచెప్పింది. దీంతో మూడు రోజుల క్రితం స్టేడియం నిర్మాణం పూర్తి చేసి.. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచ్ నిర్వహించింది. దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఐసీసీ స్థాయి టోర్నీకి ఇలాంటి స్టేడియాలను ఎంపిక చేయడం ఏంటని విమర్శలు మొదలయ్యాయి. క్రికెటర్లలో కూడా ఓ రకం భయం మొదలైంది.

మరోసారి ట్రంప్‌ టారీఫ్‌ వేటు.. టార్గెట్ కెనడానేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అమ్ములపొదిలోని కీలకమైన టారీఫ్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని దేశాలపై ఈ టారీఫ్‌లను విధించారు. కాకపోతే సెలెక్టెడ్‌గా కొన్ని దిగుమతులపైనే టారీఫ్‌లు విధించారు ట్రంప్. కేవలం అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఉక్కు, అల్యూమినియంపై టారిఫ్‌లను విధించడం ఇది తొలిసారి కాదు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీటిపై టారిఫ్‌లను విధించారు ట్రంప్. కానీ అప్పుడు కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో మరికొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేశారు. కానీ తాజాగా మాత్రం అన్ని దేశాలపై ఈ టారిఫ్‌లు ఉంటాయని తెలిపారు ట్రంప్. దీంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కెనడా, మెక్సికోలు అని చెప్పాలి.

ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కులో ఎక్కువభాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్‌ నుంచే ఉంటాయి. అమెరికాపై ఆర్థికభారం పడకూడదని మొదట వాటికి మినహాయింపు ఇచ్చారు. ఇక అల్యూమినియం కోసం కెనడాపైనే ఎక్కువగా ఆధారపడుతుంది అమెరికా. కెనడా ఈ ఎగుమతుల వల్ల భారీగానే లబ్ధి పొందుతుంది. కానీ ఇప్పుడీ టారిఫ్‌ల వల్ల కెనడాకు భారీగానే నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

తమ నుంచి ఎవరైనా వసూలు చేస్తే.. మేం కూడా వారి నుంచి తిరిగి వసూలు చేస్తాం.. టారీఫ్‌లను పెంచుతూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. వీటిని చూస్తుంటే కెనడా, మెక్సికోనే ట్రంప్ టార్గెట్‌ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి దీనికి ఆ దేశాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ట్రంప్ చేసే ట్రేడ్ వార్‌కు మేం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి ఈ దేశాలు. ఇప్పటికే అమెరికాకు కౌంటర్‌గా బరిలోకి దిగింది కెనడా. తాము ఎంత నష్టపోతామో మాకు అంచనా ఉంది.. కానీ తమకంటే ఎక్కువగా నష్టపోయేది అమెరికన్లే అని కెనడా తేల్చి చెబుతోంది. మరీ ఈ ట్రేడ్ వార్‌లో నెక్ట్స్‌ ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? అనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.

‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్ ను ఆవిష్కరించిన ఆర్జీవీ

భారతీయ సినీ చరిత్ర లో తొలి సారిగా ‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్ ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ

నా చిత్రాలలో హీరోయిన్స్ గా నటించిన వారందిరిలో మొదటి స్తానం ఆరాధ్య దేవి కే ఇస్తాను ఇది నిజం : రాంగోపాల్ వర్మ

ప్రముఖ స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్ర లో తొలి సారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్ కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్య దేవి ప్రదాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే! ఆ చిత్ర హీరోయిన్ ఆరాధ్య దేవి తో నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేసాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు. ఈ ఫోటో సిరీస్ లోని అంత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సమ్ థింగ్ స్పెషల్ ఫోటో సీరిస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేరిజన్ తో సరికొత్త క్రియేటివిటీ తో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్ గా రూపొందించారు. ఈ వైల్డ్ ఫోటో లలో ఆరాధ్య ని అడివి జంతువులైన మాకావు , ఇగువానా , కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్ మరియు రేస్ గుర్రoల తో కలిసి కళ్యాణ్ ఈ అధ్బుతమైన చిత్రాలను తన కెమెరాలో భందించారు. ఈ ఫోటో షూట్ కు ప్రణతి వర్మ కాస్టుమ్ డిజైనర్ గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.

ఆవిష్కరణ తరువాత దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ -“అడవి మృగలంటేనే అందరు భయపడతారు…ఎందుకంటె అవి మనల్ని ఏం చేస్తాయన్నది మనం ఊహించలేము. అలాంటిది మా హీరోయిన్ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని ఈ ఫోటో సిరీస్ చేసింది. ఇలా అడివి జంతువులతో ఒక అమ్మాయి ఫోటో షూట్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో చిత్రీకరించిన ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నాను. ఇక ఆరాధ్య దేవి గురించి చెప్పాలంటే కేరళకు చెందిన అమ్మాయి – ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది. ఆరాధ్యను ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత శారిలో చూసాను. ఆ తరువాత ఈ అమ్మాయి సైకలాజికల్ థ్రిల్లర్ కథ ‘శారీ’ చిత్రం లో కథానాయకి గా సరిపోతుందని సినిమా పూర్తి చేసాం. ఈ నెల 28న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ శారీ లో వున్నాఅమ్మాయి ఈ విధంగా చుడోచ్చనేది నవీన్ కళ్యాణ్ మదిలో మెదిలిన ఆలోచన. ఈ క్రెడిట్ అంతా అతనిదే!” అన్నారు.

స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “నేను అర్జివి సర్ వద్ద పదేళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి కూడా నన్ను సర్ బాగా సప్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఓ రోజు నన్ను ఆఫీస్ కి పిలిపించి శారీ చిత్రంలోని ఓ పాటను చూపించారు. పాటలు చాల బాగున్నాయి. ఆరాధ్య ఆ పాటల్లో చాలా అందంగా హుందాగా కనిపించింది. అయితే ఆరధ్యను ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ చేద్దామని అడిగాను. దానికి ఆర్జీవి సర్ ఎప్పుడూ రెగ్యులర్ గా వుండే ఫోటోలు కాదు ఏదైనా డిఫరెంట్ చెయ్యి అన్నారు. అప్పడు వైల్డ్ యనిమల్స్ తో ఓ ఫోటో షూట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పా! మరి నీ ఓకేనా అంటే అవి వైల్డ్ యనిమల్స్ కదా మైంటైన్ చేయగలవా అన్నారు. సరే అనుకుని వాటితో షూటింగ్ చేసాము. నాకైతే కెమెరా తో పని కాని ఆ పాము, ఇగువాన వంటి ఒళ్ళు జలదరించే వాటితో ఆరాధ్య ఎంతో ఫ్రెండ్లీ గా ఫోటో షూట్ కి సహకరించింది.” అన్నారు.

ఆరాధ్య దేవి మాట్లాడుతూ – “ఈ ఫోటో షూట్ గురించి ఆర్జీవి సర్ చెప్పినపుడు నేను కాస్త ఆలోచించాను! కొత్తదనం కోసం పరితపించే ఆర్జీవి సర్ ఊరికే చెప్పారు. ఏ మాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాను. ఆర్జీవి సర్, నవీన్ కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈ ఫోటో షూట్ పూర్తి చేశాను. వైల్డ్ యనిమల్స్ అంటే అందరికి భయమే షూట్ జరుగుతున్నపుడు నాకు కూడా అస్త్రిచ్ తో ఓ సారి భయమేసింది.”అన్నారు.

కాస్టుమ్ డిజైనర్ ప్రణతి వర్మ – “నవీన్ కళ్యాణ్, ఆర్జీవి సర్ ఈ కాన్సెప్ట్ చెప్పినపుడు వైల్డ్ యనిమల్స్ తో ఫోటో షూట్ అనగానే ఇదేదో కొత్తగా వుంది అనుకున్నాను ఓ చాలెంజ్ గా తెసుకున్నాను. యం టి వి వంటి పాపులర్ మ్యూజిక్ చానల్ లో ఓ సారి ఓ వీడియో ఆల్బం చూసాను….ఆ రిఫరెన్స్ తీసుకుని ఈ షూట్ కి డిజైన్ చేయడం జరిగింది.”అన్నారు.

ఇట్స్ కాంప్లికేటెడ్’ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ

ఇట్స్ కాంప్లికేటెడ్’ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. ఫిబ్రవరి 14న థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే ఎక్సయిట్మెంట్ వుంది: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమా నాకు చాలా స్పెషల్. పాండమిక్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో అనే ఆసక్తి వుండేది. ఈ మూవీ జర్నీలో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. రవితో కొలాబరేషన్ ఎప్పుడూ కొత్తగా వుంటుంది. థియేటర్లలో విడుదల చేయలేకపోయమన్న బాధ నాకు, రవికాంత్‌కు ఎప్పుడూ ఉండేది. ఈ మూవీ రీ రిలీజ్‌ కోరుతూ అభిమానులు కొందరు రవికాంత్‌కు సోషల్‌ మీడియాలో మెసేజ్‌ చేసేవారు. వాటిని చూశాక.. నాకూ ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. రానాకు చెబితే తక్కువ సమయంలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చుడాలనే ఎక్సయిట్మెంట్ వుంది. అప్పటి కంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రిలవెంట్ అనిపిస్తోంది.’ అన్నారు.

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇట్స్ కాంప్లికేటెడ్‌.. ప్రతి మనిషి జీవితంలో ఎదో కాంప్లికేషన్ వుంటుంది. నా జీవితంలో డైరెక్టర్ రవికాంత్, తర్వాత సిద్దు కాంప్లికేటెడ్‌(నవ్వుతూ). రవికాంత్ చెప్పిన కథ మనసుకు చాలా దగ్గరగా వుంది. అందరి జీవితంలో అది జరుగుతుంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది. నిజానికి సిద్ధు, రవికాంత్‌ తో మరో సినిమా చేయాలని వుంది..ఈ మూవీ థియేటర్లలో రిలీజ్‌ చేస్తేగానీ కొత్త చిత్రం చేయనన్నారు. నాకు మరో ఆప్షన్‌ లేక ఇక్కడున్నా. (నవ్వుతూ). చాలా ప్రేమతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా థీం చాలా ఫ్రెష్ గా వుంటుంది. బిగ్ స్క్రీన్స్ లో ఆడియన్స్ రియాక్షన్ చూడాలనే ఎక్సయిట్మెంట్ వుంది’ అన్నారు.

డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ..ఇట్స్ కాంప్లికేటెడ్‌ థియేటర్స్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. సిద్దు ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. కేవలం రానా గారే ఇలాంటి సినిమాలని నిర్మించగలరు. ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను’అన్నారు

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఇది మాకు బిగ్ మూమెంట్. సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు

హీరోయిన్ సీరత్ కపూర్ మాట్లాడుతూ.. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. యునిక్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే. కరోనా సమయంలో సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోయాం. ఇప్పుడు సినిమా థియేటర్స్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఇది మెమరబుల్ ఎక్సపీరియన్స్. ఇదొక మ్యజికల్ మూవీ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

యాదగిరిగుట్టలో 18నుంచి మహాకుంభ అభిషేకం

ప్రముఖ పుణ్యక్షేత్రం, యాదగిరి గుట్ట దేవాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి మహా కుంభాభిషేక ఉత్సవాలు జరగనున్నాయి. లక్ష్మీ నర్సింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన విమాన రాజగోపురానికి బంగారు తాపడంతో పాటు.. మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

ఈనెల 18వ తేదీన మొదలయ్యే ఈ ప్రత్యేక ఉత్సవాలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. బంగారు శిఖరం ఆకృతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, బంగారు తాపడాలకు కూడా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని మహా గోపురానికి బిగించారు. 18వ తేదీ నుంచి మొదలయ్యే మహా కుంభాభిషేకం ఉత్సవాల్లో శాస్త్రోక్తంగా వీటికి పూజలు నిర్వహించి అమర్చుతారు.వేడుకలకు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ తరపున విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంతాన ప్రాప్తిరస్తు

మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి వెన్నెల కిషోర్ ‘డాక్టర్ భ్రమరం’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”.
ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.

ఈ రోజు “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి వెన్నెల కిషోర్ నటించిన డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నారు. గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారిని ఆయుర్వేద వైద్యాన్ని మోడరన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశారు అనేది హిలేరియస్ గా ఉండబోతోంది. డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని థియేటర్స్ లో నవ్వుల్లో ముంచెత్తనుంది.

ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
పబ్లిసిటీ డిజైన్ – మాయాబజార్ డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Social Media Auto Publish Powered By : XYZScripts.com