తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడొస్తుందా? అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదురుచూస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బందికి శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. మరోవైపు.. షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి. ప్రత్యే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఉండే నేతలు కూడా.. పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా పావులు కదుపుతున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్‌గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా చూస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశావాహులు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే.. మరింత దూసుకెళ్లాలని సర్వ సన్నద్ధంగా ఉన్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే.. పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం గతేడాది జనవరి 31వ తేదీన ముగిసి పోయింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. 2024 జూన్ నెలలలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. దీంతో, ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా..? లేక పంచాయతీ ఎన్నికలు ఉంటాయా..? అనే దానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల ప్రకటన ఉండనుంది. మరోవైపు.. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం రెడీగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా ముసాయిదాలను కూడా దిశానిర్దేశం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తులపై ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.