- దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
- బలపడుతున్న డిమాండ్…
- ఇన్నాళ్లు వాదనలే తప్ప కార్యాచరణ లేదు
- వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదం వెనక ఉద్దేశాలవేనా?
- దక్షిణాది రాష్ట్రాల ఐక్య ఉద్యమానికి రేవంత్ పిలుపు
కారణాలివే…
- కేంద్రానికి అందించేది ఎక్కువ.. పొందేది తక్కువ
- అనాదిగా ఇదే తీరు.. దక్షిణాది కష్టం ఉత్తరాది పాలు
- కష్టం ఒకరిది..దక్కేది మరొకరికి..
- అన్ని బడ్జెట్లలోనూ అరకొర కేటాయింపులే
- కట్టే కప్పానికి తిరిగి తీసుకునే పైకానికి పొంతనే లేదు
- దక్షిణాదిపై జాతీయ పార్టీల సవతి తల్లి ప్రేమ
- మోడీ హయాంలో మరింత సుస్పష్టం
- బీజేపి పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
దక్షిణ భారతంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనపరుస్తోందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరోసారి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపైనా, కేటాయింపులపైనా చర్చకు తెర లేచింది. తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి పత్రిక ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు కలసి కట్టుగా నడుం బిగించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన(డీలిమిటేషన్) చేయాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల లోక్ సభ నియోజక వర్గాలు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల నియోజక వర్గాలు పెరుగుతాయని బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంటుందని దాంతో ముందు ముందు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యమే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలకు కారణం ఇక్కడ కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడమేనని, జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తున్న తమకు ప్రోత్సాహకాలు లేకపోగా అధిక జనాభా ఉండి అల్పాదాయాన్ని అందించే ఉత్తరాది రాష్ట్రాలపైనే కేంద్రం ప్రేమ, కేటాయింపులు కురిపిస్తోందని విమర్శించారు.అసలు మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదమే పెద్ద కుట్రని రేవంత్ అన్నారు. స్థానిక సంస్థలనుంచి, కేంద్ర ఎన్నికల వరకూ తమ పెత్తనమే సాగాలన్న ఆరాటం తప్పితే అందులో మరేం లేదని, రాజ్యాంగం, కేంద్ర రాష్ట్రాలకు కొన్ని హక్కులు, విధులు కల్పిస్తే సర్వహక్కులను హరించాలని కేంద్రం చూస్తోందని అన్నారు. మోడీ అజెండాను అమలు జరిపితే భవిష్యత్తులో ఏక పార్టీ పాలన అవుతుందని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదమని రేవంత్ అభిప్రాయపడ్డారు.
గతంలోనూ.. ఇదే భావన
బహుశా ఇంత పెద్ద ఎత్తున ఈ అంశంపై ఇటీవల కాలంలో ఇంత గట్టిగా మాట్లాడింది రేవంత్ అనే చెప్పాలి. గతంలో కేసీఆర్ హయాంలో కూడా దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేసీఆర్ మాట్లాడారు.కానీ ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా గతంలో ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ఈ నినాదాన్ని గట్టిగా ఎత్తుకున్నారు. బీజేపి నిర్ణయాలను తీవ్రాతి తీవ్రంగా అప్పట్లో ఆయన విమర్శించారు. కానీ పదేపదే పార్టీ ఓటమి తర్వాత ఆయన పంథా మారి బీజేపితో దోస్తీ వైపు తిరిగిపోయింది. ఇప్పుడు మోడీ ఏం చేసినా అది రైటేననే స్టేజిలో పవన్ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉద్యమించాలని, తలసరి ఆదాయంలో మెరుగ్గా ఉన్నా మనకు చేస్తున్న కేటాయింపులు అధ్వాన్నంగా ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల తరపున ఉద్యమానికి తాను శ్రీకారం చుడతానని అప్పట్లో పవన్ అన్నారు. కానీ ఇప్పుడు బహుశా ఆ ఊసే ఎత్తరు. ఇలా నేతలంతా ఉత్తర, దక్షిణ తారతమ్యాలపై చాలా సార్లు గళమెత్తినా ఎవరూ ఆ వేడిని కొనసాగించలేదు. అది ఉద్యమ పంథా తీసుకోలేదు.
గణాంకాలే నిదర్శనం..
కేంద్రం ఉత్తరాది,దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడా చూపిస్తోందనడానికి గణాంకాలే సాక్ష్యం.. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల ద్వారా ఇతర ఆదాయ మార్గాల ద్వారా అందిస్తున్న ధనంతో పోలిస్తే ఈ రాష్ట్రాలకు దక్కే కేటాయింపులు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి.వాస్తవానికి అక్కడ జనాభా ఎక్కువ.. మన జనాభా తక్కువ. అయినా మనం కేంద్రానికి ఇస్తున్న నిధుల వాటా ఎక్కువ.. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నా వారు కేంద్రానికి అందిస్తున్న పన్నుల వాటా చాలా తక్కువ.. అయినా కేంద్రం వారికి కేటాయింపులు మాత్రం చేతికి ఎముక లేకుండా చేసేస్తోంది.
జనభా వ్యత్యాసం..
ఉత్తరాదిన యూపీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మొత్తం జనాభా 2011 లెక్కల ప్రకారం చూస్తే 912,030,836 కోట్లు.. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ,గోవా, పాండిచ్చేరి ల మొత్తం జనాబా 2011 లెక్కల ప్రకారమే 25,13,22,872 కోట్లు.. ఇదంతా జనాభా నియంత్రణకు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేందుకు, స్వయంసమృద్ధిని సాధించేందుకు అమలు జరిపిన కుటుంబ నియంత్రణ పథకాల ఫలితమే.. ఫలితంగానే దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా ప్రొడక్టివిటీ పెరిగింది. అందుకే పన్నుల వసూళ్లు అవీ క్రమబద్ధంగా జరిగాయి. ఆమొత్తం కేంద్రానికి మన వాటాకింద సమర్పిస్తే.. కేంద్రం మనకు తిరిగి చేసే కేటాయింపులు మాత్రం దారుణాతి దారుణంగా ఉంటున్నాయి.అదెలాగంటే ఉదాహరణకి ఏపీ కేంద్రానికి పన్నుల ద్వారా వంద రూపాయలు అందిస్తే తిరిగొచ్చేది కేవలం రూ.46.అదే తెలంగాణ కేంద్రానికి వంద రూపాయలు అందించిందంటే దానికి తిరిగొచ్చేది రూ.49. ఇది దక్షిణాది రాష్ట్రాల దుస్థితి.. అదే ఉత్తరాది రాష్ట్రం యూపీ కేంద్రానికి వంద రూపాయలు అందిస్తే దానికి తిరిగి వచ్చేది రూ.333. ఇక మధ్య ప్రదేశ్ వంద రూపాయలు ఇచ్చి రూ.279 వెనక్కి తీసుకుంటోంది.ఇక బీమారు రాష్ట్రమైన బీహార్ గురించి వినాలంటే గుండె చిక్కబట్టుకోవాలి.బీహార్ కేంద్రానికి అందించే పన్నులే చాలా చాలా తక్కువ. ఆ రాష్ట్రం వంద రూపాయలు కేంద్రానికి ఇస్తే తిరిగి తీసుకునేది రూ.922. ఈత కాయ ఇచ్చి తాటికాయ లాక్కోవడం అంటే ఇదే.. అలాగే మరో రాష్ట్రం ఒడిషా.. అది కూడా అంతే.. ఆ రాష్ట్రం ఇచ్చేది తక్కువ.. తీసుకునేది ఎక్కువ.
ఇక తాజా లెక్కలను తీసుకుంటే 2025 జనవరి నెలలో కేంద్ర రాష్ట్ర కేటాయింపులు ఒక సారి పరిశీలిస్తే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలోంచి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి కేంద్రం విదిల్చిన సొమ్మెంతో తెలుసా? కేవలం రూ.27,336 కోట్లు. ఈ మొత్తంలో ఏపీ ఏడు వేల కోట్లు, కర్ణాటక ఆరువేల కోట్లు, తెలంగాణ మూడువేల కోట్లు, తమిళనాడు ఏడు వేల కోట్లు, కేరళ మూడు వేల కోట్ల చిల్లర చొప్పున అందుకున్నాయి. మరి యూపీకి ఎంత మొత్తం కేటాయింపు జరిపిందో తెలుసా? యూపీ ఒక్క రాష్ట్రానికీ అక్షరాలా రూ.31,039 కోట్లు.. మోడీ ప్రభుత్వం దక్షిణాదిని పిండి ఉత్తరాదికి దోచి పెడుతోందనడానికి ఇంత కన్నా నిదర్శనం యేం కావాలి. మోడీ ప్రభుత్వం అధిక కేటాయింపులు జరిపిన రాష్ట్రాలన్నీ బీజేపి పాలిత రాష్ట్రాలే.. బీహార్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే ఆ రాష్ట్రానికి కేటాయింపుల వరద పారించిందనేది సుస్పష్టం.
అనాదిగా ఇదే తీరు….
ఇక ఇప్పుడంటే బీజేపి అధికారంలోకి వచ్చింది కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కూడా ఇదే తీరు.. ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని స్పష్టం గా చూపిస్తోంది.పార్టీ నాయకత్వ బాధ్యతలు, పదవుల కేటాయింపులు కూడా అంతే.. కీలక పదవులన్నీఉత్తరాదివే.. అటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ.. మనకి మాత్రం ఎప్పుడూ సామంత రాజు పరిస్థితే..ఉత్తర దక్షిణ తారతమ్యాలు చాలా కాలం నుంచే ఉన్నా.. బీజేపి అధికారంలోకి వచ్చాక ఇది మరీ ఎక్కువైపోయిందనే వాదనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోంది.