మణిపూర్లో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరోవైపు.. ఆ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కాస్తంత ఇమేజ్ పెంచినట్లే అనిపించినా.. సీఎం రాజీనామా చేసినంత మాత్రాన తాము సైలెంట్‌గా ఉండబోమని ప్రకటిస్తున్నారు. బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఓ దశలో అల్లర్లు తీవ్రరూపం కూడా దాల్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న రెండు తెగలకు చెందిన వాళ్లు పరస్పరం దాడులు, ప్రతి దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తొలుత ఈ పరిణామం ఆ రాష్ట్రానికే పరిమితం కాగా.. దాడులు, హత్యల తీవ్రత పెరగడంతో.. క్రమంగా జాతీయ సమస్యగా మారింది. ఆ తర్వాత అంతర్జాతీయ సమస్యగా కూడా పరిణమించింది. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తలనొప్పిగా మారాయి. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. ఓ దశలో రాజ్యసభను మణిపూర్ అంశం స్తంభింపజేసింది. పార్లమెంటులో ఈ అంశంపై రోజుల తరబడి చర్చ జరిగింది. ఈ రచ్చతో బీజేపీకి సరైన సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే, మణిపూర్‌లో అల్లర్లకు చెక్ పెట్టడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తూనే ఉంది. చివరికి ఇంటర్నెట్ సేవలను కూడా మణిపూర్‌లో బ్యాన్ చేసింది. మణిపూర్ మరకను తుడిచి వేసేందుకు బీజేపీ అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
మణిపూర్‌లో ఇప్పటికీ అల్లర్లు జరుగుతుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఇదే అదునుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఎత్తు వేసింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌పై రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని శనివారం ప్రకటించింది. అవిశ్వాసం ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో.. ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. అంతకుముందు బీరేన్ సింగ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు పంపించారు. కాగా, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఒక్కరోజులోనే బీజేపీ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం కలిగించింది. అయితే బీరెన్ సింగ్ రాజీనామా చేసినంతమాత్రాన మణిపూర్ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోమని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉందని.. అప్పటిదాకా ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సోమవారం తాము అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన వెంటనే.. మణిపూర్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారని, ఇది నైతికంగా తాము సాధించిన విజయం అని కాంగ్రెస్‌పార్టీ అంటోంది. కాకపోతే ఇందులో రాజకీయాలు చూసుకోవడం లేదని, మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామని, బీజేపీ అధినాయకత్వం ఆదిశగా అడుగులు వేయకపోతే ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తామని, కచ్చితంగా ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.