అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అమ్ములపొదిలోని కీలకమైన టారీఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని దేశాలపై ఈ టారీఫ్‌లను విధించారు. కాకపోతే సెలెక్టెడ్‌గా కొన్ని దిగుమతులపైనే టారీఫ్‌లు విధించారు ట్రంప్. కేవలం అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఉక్కు, అల్యూమినియంపై టారిఫ్‌లను విధించడం ఇది తొలిసారి కాదు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీటిపై టారిఫ్‌లను విధించారు ట్రంప్. కానీ అప్పుడు కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో మరికొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేశారు. కానీ తాజాగా మాత్రం అన్ని దేశాలపై ఈ టారిఫ్‌లు ఉంటాయని తెలిపారు ట్రంప్. దీంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కెనడా, మెక్సికోలు అని చెప్పాలి.
ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కులో ఎక్కువభాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచే ఉంటాయి. అమెరికాపై ఆర్థికభారం పడకూడదని మొదట వాటికి మినహాయింపు ఇచ్చారు. ఇక అల్యూమినియం కోసం కెనడాపైనే ఎక్కువగా ఆధారపడుతుంది అమెరికా. కెనడా ఈ ఎగుమతుల వల్ల భారీగానే లబ్ధి పొందుతుంది. కానీ ఇప్పుడీ టారిఫ్‌ల వల్ల కెనడాకు భారీగానే నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.
తమ నుంచి ఎవరైనా వసూలు చేస్తే.. మేం కూడా వారి నుంచి తిరిగి వసూలు చేస్తాం.. టారీఫ్‌లను పెంచుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వీటిని చూస్తుంటే కెనడా, మెక్సికోనే ట్రంప్ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి దీనికి ఆ దేశాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ట్రంప్ చేసే ట్రేడ్ వార్‌కు మేం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి ఈ దేశాలు. ఇప్పటికే అమెరికాకు కౌంటర్‌గా బరిలోకి దిగింది కెనడా. తాము ఎంత నష్టపోతామో మాకు అంచనా ఉంది.. కానీ తమకంటే ఎక్కువగా నష్టపోయేది అమెరికన్లే అని కెనడా తేల్చి చెబుతోంది. మరీ ఈ ట్రేడ్ వార్‌లో నెక్ట్స్ ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? అనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.