35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 226

తెలంగాణలో కారు దుకాణం బంద్‌ – పీసీసీ చీఫ్‌

తెలంగాణలో కారు దుకాణం బంద్‌ అయ్యిందన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఫాం హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హొటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాం హౌస్ లో కేసీఆర్ సేద తీరుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో 8 మంది బిజెపి ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని అన్నారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీ అని చెప్పారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని, బిఆర్ఎస్ లో కేటీఆర్, కవిత , హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందన్నారు. బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ , ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జాబిలమ్మ నీకు అంతా కోపమా ట్రైలర్ రిలీజ్

ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ట్రైలర్ రిలీజ్.. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఫిబ్రవరి 21న చిత్రం విడుదల

పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలో.. ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఓ ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. మాజీ ప్రేయసి పెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు, ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గ స్టోరీతో ధనుష్ రాబోతోన్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఇలా అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ అప్పియరెన్స్, ఆ పాటకు సంబంధించిన బిట్ కూడా ట్రైలర్‌లో పొందు పర్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న పని చేశారు.

అసలారోజు ఏం జరిగిందంటే?

  • ఆగంతకుడి దాడిపై సైఫ్‌ వివరణ
  • సకాలంలో ట్రీట్‌ మెంట్ కోసమే…
  • కరీనా తనను ముందు పంపిందన్న సైఫ్‌
  • రెండో కొడుకు పసివాడు కావడమే కారణం
  • తైమూర్ ను అక్క ఇంట్లో ఉంచి ఆస్పత్రికి కరీనా
  • పక్షవాతం ప్రమాదం నుంచి బయటపడ్డానన్నసైఫ్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ ఆలీఖాన్‌ కత్తిపోట్ల వ్యవహారంపై రకరకాల కథనాలు వెలుగుచూశాయి. ఆయన వెంట భార్య కరీనా ఆస్పత్రికి వెళ్లకపోవడం, ఆ తర్వాత వెళ్లడంపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మరికొందరు ఇంకొంచెం దూరం వెళ్లి సైఫ్‌ పై దాడి కరీనా ప్లానే అని, ఆమె చేయించిందని కూడా ఆరోపించారు. సైఫ్‌, కరీనా మధ్య వారసుల ఆస్తుల విషయంలో కాస్త బేధాభిప్రాయాలు ఉండటం, సైఫ్‌ తీరుపై కరీనా సంతృప్తిగా లేదన్న వార్తలు విన్నవారు కూడా ఆమే ఇది చేయించి ఉంటుందని ఊహించారు. అయితే ఈ ఆరోపణలన్నింటికీ సైప్‌ ఫుల్‌ స్టాప్ పెట్టాడు.

చిన్నవాడి క్షేమం కోరి…

ఆగంతకుడు తనపై దాడి చేసినప్పుడు ఇంటిల్లి పాదీ హడలి పోయారని, ఇంట్లో మరో చిన్న కొడుకు ఉండటం వాడికి ఆగంతకుడు ప్రాణహాని తలపెడతాడేమోనన్న భయంతో కరీనా తనను తన పెద్ద కొడుకును ముందు ఆస్పత్రికి పంపిందని, ఆపై తాను ఆదరాబాదరా రెండో కొడుకుని అక్క కరిష్మా ఇంట్లో దిగబెట్టి ఆ వెంటనే ఆస్పత్రికి వచ్చిందని సైఫ్‌ వివరించాడు. తనకు అప్పటికే రక్తం బాగా పోవడం, ఇల్లంతా రక్తం మడుగులా మారడంతో కరీనా తన ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చి పెద్ద కొడుకు జహంగీర్ ను తీసుకుని ముందు ఆస్పత్రికి వెళ్లమని గొడవ చేసిందని రెండో కొడుకు తైమూర్ ను తీసుకుని తాను మరో వాహనంలో బయటపడిందని సైఫ్‌ చెప్పాడు. ఆగంతకుడుని రెండో కొడుకు బెడ్ రూమ్‌ లో బంధించామని అయితే అందులోని బాత్ రూమ్ లో పైప్ లైన్ నుంచి వచ్చిన దోవనే అతగాడు పారిపోయాడని అన్నాడు.

కొంచెముంటే పక్షవాతం వచ్చేది…

తనకు తీవ్ర రక్త స్రావంతో కంగారు పడినట్లు అందుకే ఆటోలో జహంగీర్ తో కలసి వెళ్లినట్లు తెలిపాడు. దారిలో తన ప్రాణాలే పోతాయన్నంత బాధని అనుభవించానని సైఫ్‌ తెలిపాడు. ఆస్పత్రిలో డాక్టర్లు తన వెనక దిగబడిన కత్తిని తీసి ప్రాణాపాయం నుంచి తప్పించి మూడు సర్జరీలు చేశారని వెన్నులోనుంచి ద్రవం లీక్ కాకుండా సకాలంలో చికిత్స చేశారని సైఫ్ అన్నాడు. కత్తి కాస్త వెన్ను పాముని తాకి ఉంటే తాను శాశ్వతంగా పక్షవాతంతో మంచం పట్టేవాడినని సైఫ్‌ చెప్పుకొచ్చాడు. తనపై దాడిపై రకరకాల కథనాలు వెలుగు చూడటంతో తాను వేదన చెందానని, కరీనా తన క్షేమం కోరే ముందు పంపిందని సైఫ్‌ తెలిపాడు.సైఫ్‌ వివరణతో ఈ మిస్టరీ వీడిందనే అనుకోవాలి.

36 సంవత్సరాల తర్వాత కలుసుకున్న క్లాస్‌మేట్స్‌

వాళ్లంతా 36 సంవత్సరాల క్రితం ఒకే కాలేజీలో చదువుకున్న క్లాస్‌మేట్స్‌. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇంకొందరు స్టార్టప్స్‌తో దూసుకెళ్తున్నారు. అయితే, వాళ్లంతా ఇప్పుడు కలుసుకున్నారు. తమ గురువులను కూడా ఆహ్వానించారు. వాళ్లను గౌరవించుకుంటూనే.. తమ ఆత్మీయతను ఆ క్లాస్‌మేట్స్‌ చాటుకున్నారు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్న రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో 1987 -88 సంవత్సరంలో వాళ్లంతా వ్యాయామ విద్యను అభ్యసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచి విద్యార్థులు ఆ కాలేజీలో చేరి చదువుకున్నారు. రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీని డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి స్థాపించారు. ఆ కాలేజీలో చదివిన క్లాస్‌మేట్స్‌ అందరూ కలిసి 36 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌ శివారులోని ఆరా క్రేసిట్ రిసార్ట్స్‌లో ఆత్మీయ సమ్మేళనం పేరిట కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పుడు ఈ విద్యార్థులుగా ఉన్నవాళ్లకు పాఠాలు బోధించిన గురువులు కూడా విచ్చేశారు. గురువులందరినీ అప్పటి విద్యార్థులు, ఇప్పటి ప్రముఖులు ఘనంగా సన్మానించారు. మరోసారి వాళ్ల ఆశీస్సులు అందుకున్నారు. తమ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులందరికీ.. 1987-88 బ్యాచ్‌ విద్యార్ధుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం ప్లాన్‌ చేసి, విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజింగ్‌ కమిటీలో ప్రభుత్వ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ కె.రాంరెడ్డి కీకల పాత్ర పోషించారు. ఆయనతో పాటు.. ఆర్‌. జనార్ధనరెడ్డి, వి.ఎ.భాస్కరరావు, బీ.వి.స్.నరసింహారావు. జీకెఎన్‌వి రమణమూర్తి, ఎ.రవీంద్రారెడ్డి, బీ.సురేంద్ర రెడ్డి, సీహెచ్‌ అరుణారెడ్డి ఆర్గనైజింగ్‌ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. వీరికి టి.వెంకటరావు, ఐ.శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి. ఎన్‌. అప్పారావు. ఎ.మల్లికార్జున తదితరులు సహకారం అందించారు. ఈ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు సహకరించిన వీరందరికీ ఆర్‌సీపీఈ మిత్రబృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికపై జడుసుకుంటోన్న బీఆర్ఎస్‌.. కారణమేంటి?

దాదాపు గడిచిన పదిహేనేళ్లుగా తెలంగాణ అంతటా గులాబీ గుభాళింపు కనిపించేది. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా? ఎప్పుడు ఉప ఎన్నిక ఎదురైనా అప్పటి టీఆర్‌ఎస్‌.. ఇప్పటి బీఆర్‌ఎస్‌కు ఎదురే ఉండేది కాదన్నది అప్పటి వాస్తవం. అయితే గెలవడమా? లేదంటే ప్రత్యర్థికి చెమటలు పట్టించడమా? అన్నట్టు ఉండేది బీఆర్‌ఎస్‌ హవా. కానీ.. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు మొత్తం తారుమారై పోయింది. ఎన్నికలు వస్తే భయపడే పరిస్థితికి బీఆర్‌ఎస్‌ చేరుకుంది. మొన్నటికి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎదురులేని విధంగా పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ దుస్థితి రావడంపై ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ దాదాపు అదే స్థితిలో ఉంది. అందుకే ఈ ఎన్నిక విషయంలో బీఆర్‌ఎస్‌ వణికిపోతోంది.

పార్టీ ఓటమి తర్వాత.. పార్లమెంటు ఎన్నికల్లో ఓసారి జనంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఆ తర్వాత చాలా కాలం పాటు బయటకు రాలేదు. ఇటీవలే తన ఫామ్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశంలో క్యాడర్‌ను ఉత్తేజ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని కేసీఆర్‌ తనదైన శైలిలో విమర్శలు చేశారు. అంతేకాదు.. తాను కొడితే మామూలుగా ఉండదంటూ ఓరకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినంత పని చేశారు. మరి.. ఇదే సమయంలో మొదటినుంచీ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి త్వరలోనే ఎన్నికలు వస్తాయని శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయం పట్టించుకోకుండా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి. స్థానిక ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి అంటూ క్యాడర్‌కు బోధిస్తున్నారు కేటీఆర్‌. ప్రత్యర్ధులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడెత్తేసే విధంగా మాటలు చెప్పడం వెనక దాగిఉన్న మర్మమేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు వేదికల మీద చెబుతున్న దానికి, గ్రౌండ్‌లో ఉన్న రియాల్టీకి సరిపోవడం లేదని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. లేకపోతే పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎన్నికలను గులాబీ పార్టీ ఎందుకు వదిలేస్తుంది? ..? టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట పెద్ద లీడర్లు లైట్ అన్నట్టుగా ఎందుకు ఉంటున్నారు? అనేది అర్దం కాక పార్టీ క్యాడర్ బుర్రలు హీటెక్కుతున్నాయంటున్నారు. ఎన్నికలు వచ్చాయంటే కారు పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉండేది. ఆ పార్టీకి స్ట్రాంగ్ జోన్‌గా పరిగణించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే అదే పదివేలు అన్నట్టుగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్యే పోటీ అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గత రెండు దశాబ్దాలుగా చాంపియన్ గా ఉన్న గులాబీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయాలంటే గుబులు మొదలయిందట. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగకపోవడంపై పలు రకాల చర్చలు జోరందుకున్నాయి.

నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అగ్రనేత కేసీఆర్‌ సహా హరీష్, కేటీఆర్, కవితలు ఈ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. సమకాలీన రాజకీయాల్లో సమర్దవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్‌కు పేరుంది. సర్వేలు, ఒపినీయన్స్‌ ఆధారంగా పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతాడనే పేరున్న వ్యూహకర్త, ఎన్నికల్లో పోటీకి వెనుకంజ ఎందుకు వేస్తున్నారనేదీ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడిందట. అదీగాక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తిగా ఉండటానికి ఓ కారణమంటున్నారు నేతలు. గత మూడు నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ తరపున కూడా పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గులాబీ పార్టీ నుంచి పోటీ విషయంలో ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దాం అనుకున్నవారు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ తన ఆనవాయితికి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట. అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు కేటీఆర్, హరీష్‌లను కన్వీన్స్ చేసే ప్రయత్నాలు చేశారట. ఇదే విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పోటీ గురించి ఆయనకు వివరించే ప్రయత్నం చేయగా ఆయన మౌనమే ఆయన సమాధానం కావడంతో మిన్నకుండిపోయారట ఆ ఇద్దరు నేతలు. దీంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకోవాలని ఉమ్మడి కరీంనగర్ నేతలకు సంకేతాలిచ్చేశారని చెబుతున్నారు.

మరోవైపు నియోకవర్గ స్థాయిలో పట్టించుకోవాల్సిన ఇంచార్జీలు నేతలు తమకేం పట్టనట్టు ఉండటం… ఇప్పుడు పార్టీ కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నవ్వే వారి ముందు బొక్కా బోర్లా పడ్డట్టుగా మారిందట గులాబీ పార్టీ చోటా మోటా నేతల పరిస్థితి. పైగా అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో ఉంటే తమను మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని లీడర్లు పిలుపు నివ్వడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మారిందట.అయితే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయడం వెనక వేరే వ్యూహాలు ఉన్నాయట ఆ పార్టీకి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడి వ్యవహారం కావడం.. నాలుగు ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరక్కపోవడం ఓ కారణమంటున్నారు. అదీగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారనే నిర్దారణకు వచ్చారట గులాబీ బాస్. మూడు నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిజల్ట్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బరిలోకి దిగడం లేదనే ప్రచారం సాగుతుంది.

టాటా వారసుడు ఆయనేనా?

  • రతన్ టాటా ఆస్తుల విలువ రూ. 500 కోట్లు
  • వందల కోట్లలో ఆస్తులున్నా జన్మతః వారసులు లేరు
  • మెజారిటీ ఆస్తులను సేవారంగానికే కేటాయింపు
  • హైకోర్టు మొత్తం ఆస్తులను క్రోడీకరించాకే కేటాయింపు
  • కనీసం ఆరునెలలు పట్టే అవకాశం
  • మోహినీ మోహన్ దత్తా తో టాటా అనుబంధం
  • ఆస్తుల్లో పెట్‌ డాగ్‌ టిటోకు కూడా సేవింగ్స్
  • సోదరుడు, వదినలు, ఇతర డిపెండెంట్లకూ వాటా
  • తన ఇంటి సిబ్బందికి, కార్యాలయాల సిబ్బందికి కూడా
  • శంతను నాయుడుకి కూడా కొంత వాటా

ఇటీవల దివంగతులైన ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా వారసులెవరు? దీనిపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఏవేవో పేర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఆయన అసలు వారసులెవరన్నది మొన్న మొన్నటి వరకూ సందిగ్ధం గానే ఉండేది. అయితే ఈ సందిగ్థతకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రతన్ టాటా విల్లులో ఆయన ఆస్తులకు వారసుడిని ప్రకటించే కన్నుమూశారు. ఇన్నాళ్లకు లాయర్లు వెలికి తీసిన డాక్యుమెంట్లలో  వారసుడి పేరు బయటకొచ్చింది. ఆయనెవరో కాదు  ఆయనతో పాటు వ్యాపార భాగస్వామిగా ఉన్న మోహినీ మోహన్ దత్తాను  వారసుడిగా విల్లులో పేర్కొన్నారు. రతన్ టాటా వారసత్వం కింద పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని జమచేసి వెళ్లారు. ఆయనకున్న స్థిర, చర ఆస్తుల విలువ మొత్తంగా రూ.500 కోట్లు.అందులో మూడో వంతు వాటాను మోహన్ దత్తాకు చెందాలని కోరుతూ ఆయన విల్లు రాశారు. అయితే మోహన్ దత్తా గురించి రతన టాటా బంధుగణానికి గానీ, టాటా అంతర్గత సన్నిహితుల సర్కిల్‌ కి కానీ తెలియదు. తన ఆస్తులకు వారసులుగా టాటా ప్రకటించిన జాబితాలో ఉన్న మోహన్ దత్తాకు ఈఆస్తి ఇప్పట్లో రాదు. ఎందుకంటే ఆ ఆస్తులన్నింటినీ హైకోర్టు సమక్షంలో లెక్కించి వాటిని జాబితాగా రూపొందించి కోర్టు సర్టిఫై చేశాక మాత్రమే అందుతాయి. ఈ ప్రక్రియ జరగడానికి కనీసంఆరు నెలలు పట్టొచ్చు.

ఎవరీ మోహినీ మోహన్ దత్తా?

జెంషెడ్‌ పూర్ కు చెందిన వ్యాపార వేత్త అయిన మోహినీ దత్తా స్టాలియన్ కంపెనీ కో ఓనర్.ఆ కంపెనీ తదనంతర కాలంలో టాటాగ్రూప్ లో విలీనమైంది.అయితే కంపెనీ కలిసిపోయే నాటికి  మోహన్ దత్తాకు అందులో 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ కు చెందినది.

అరవయ్యేళ్ల అనుబంధం ఇది…

రతన్ టాటా అంత్యక్రియలకు వచ్చినప్పుడు దత్తా తనకు టాటా తో పరిచయం ఈనాటిది కాదని, తాను 24 ఏళ్ల వయసునుంచే టాటాతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నానని చెప్పారు.ఇద్దరూ తరచుగా జెంషెడ్‌ పూర్లోని డీలర్స్ హాస్టల్ లో కలిసేవారమని గుర్తు చేసుకున్నారు.విల్లులో ఆయన పేరు కనపడేందుకు ముందు వరకూ ఆయనెవరో ఎవరికీ తెలీదు. అయితే టాటా కుటుంబంతో ఆయన సన్నిహిత సంబంధాలు మాత్రం కలిగి ఉన్నారు.టాటా తనకు చాలా రకాలుగా సాయపడ్డారని, సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించారనీ దత్తా అన్నారు.రతన్ టాటాతో మోహినీమోహన్ దత్తాకు ఏకంగా ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. టాటా చివరి పుట్టిన రోజు వేడుకలు 2024 డిసెంబర్ ముంబైలోని ఎన్సీపిఏ హాలులో జరిగాయి. ఆ వేడుకలకు దత్తా కూడా అటెండ్‌ అయ్యారు.

దత్తా కుమార్తె కూడా ఇందులోనే…

మోహన్ దత్తా కుమార్తె కూడా టాటా అనుబంధ పరిశ్రమల రంగంలోనే ఉన్నారు ఆమె 2015 వరకూ తాజ్ హోటల్స్ లో పనిచేశారు, ఆ తర్వాత టాటా ట్రస్ట్ కు బదిలీ అయ్యారు.అక్కడ 2024 వరకూ కొనసాగారు.

విల్లులో ఏముంది?

ఇంతకీ రతన్ టాటా విల్లులో ఏముంది? ఎవరెవరి పేర్లున్నాయ్‌ అన్నది అందరికీ ఉత్కంఠే. ఆయన మరణానంతరం రెండు వారాల తర్వాత అది వెల్లడైంది.టాటా తన ఆస్తులను ఏడు భాగాలుగా విభజించారు. సోదరుడు, వదినలు, ఆయన ఇంటిసిబ్బంది, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ శంతను నాయుడులకు తన ఆస్తులను పంచాలని టాటా కోరుకున్నారు.ఆయన పెట్‌ డాగ్‌ టిటో అంటే ఆయనకు పంచ ప్రాణాలు. తన ఆస్తులలో అది బతికి ఉన్నన్నాళ్లు దాని తిండి ఖర్చు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చుల కోసం  ఆయన కొంత సొమ్మును కేటాయించారు.అలాగే తన షేర్ల వాటాను రతన్ టాటా ఎండోమెంట్‌ ట్రస్ట్ కు బదిలీ చేయాలని కోరారు. ఆయన స్థిరాస్థుల్లో ఆలీబాగ్‌ లో ఉన్న బీచ్ ఫేస్ బంగ్లా,జుహూలోని మూడంతస్తుల భవనం, అలాగే రూ.350 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు, టాటా సన్స్ గ్రూప్ లో ఒకశాతం వాటా ఉన్నాయి.

24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈనెల 24వ తేదీన ఉదయం పది గంటలకు ఉభయ సభలు సమావేశం అవుతాయి. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈమేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అదేరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం ఉంటుంది. ఇక, బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల 28వ తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదిహేను రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందంటున్నారు. మొదటిరోజు బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీని ఎన్నిరోజులు నిర్వహఙంచాలనే అంశపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక, ఈనెల 20వ తేదీన ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు.. 20వ తేదీ ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపైనా కీలక చర్చ జరగనుంది. ఇక, కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను ఈనెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపించాలని సీఎస్‌ కార్యాలయం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

రామరాజ్యం పేరుతో అరాచకాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం

చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడిపై దాడిని ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు

రామరాజ్యం పేరుతో చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు నిర్వహాకులు అయిన రంగరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. ఇలాంటి చర్యలు చాలా హేయమైనవని, రామరాజ్యం పేరు చెప్పి రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రాముఇ పేరును బద్నామ్‌ చేస్తూ అరాచక, అనాగరిక కార్యకలాపాలకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించరాని నేరమని అంతే కాకుండా ఇది రామ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే చర్య అని శ్రీధర్‌ బాబు అభిప్రాయపడ్డారు. కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్న ఆరాచక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తెలిపారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం

శ్రీవారి సేవలో ప్రధాన న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చిన చీఫ్‌ జస్టిస్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు అదనపు ఈవో సీ.హెచ్‌.వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు.

చీఫ్ జస్టిస్‌ కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగ నాయకుల మండపం వద్ద వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. చీఫ్ జస్టిస్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్‌ను బహూకరించారు.

మరో మేడారం.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర

  • ఈనెల 16 నుంచి లింగమంతుల స్వామి జాతర

మేడారం జాతర తరహాలోనే రెండేళ్లకోసారి నిర్వహించే మరో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. యాదవుల కుల దైవంగా పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్దదిగా పిలువబడే గొల్లగట్టు జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పెద్దగట్టు జాత‌రను విజ‌యంతంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

ఈ నెల 16న జాతర ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీతో ముగియనుంది. జాతర ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్దగట్టు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దురాజ్ పల్లి గ్రామం ప్రక్కనే ‘పాలశేర్లయ్యగట్టు’ అని పిలుచుకునే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. సుమారు 1000 ఏళ్లుగా ఈ జాతర జరగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. శివుడినే లింగమంతుల స్వామిగా, చౌడమ్మను శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. వాస్తవానికి ఎదురుగా ఉన్న ఉండ్రుకొండ పైన రెండు గుడులను కట్టి శివునికి నైవేద్యంతోను, చౌడమ్మకు జంతు బలులతోను ఈ జాతరను నిర్వహిస్తారు. ఇప్పటికీ పెద్దగట్టు గిరిదుర్గంపై ఈ గుడులున్నాయి. అందుకే దీనిని ‘పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. అయితే, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం జాతరను నేటి పాలశేర్లయ్య గట్టుకు మార్చారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థానిక పురాణాల ప్రకారం, రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ధ్రువుడు తన పేరు మీద ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించాడని, అది తరువాత దురాజ్‌పల్లిగా మారిందని చెబుతారు. కాకతీయుల కాలంలో ఉండ్రు కొండపై శివ కేశవ ఆలయాలు ఉండేవి. ఇక్కడ వార్షిక ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. ఈ ఉత్సవాల సమయంలో తన పూజ కోసం కొండపైకి వచ్చిన ఒక గర్భిణీ స్త్రీ జారిపడి మరణించింది. ఈ సంఘటనతో చలించిన ప్రభువు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి పాలశేర్లయ్య గట్టు పై లింగమంతులస్వామిగా కనిపించాడని స్థానిక ప్రజలు చెబుతారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టిపూజ ఉత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత రెండవ ఆదివారం నాడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చీకటిపాలెం నుండి దిష్టిపూజ కుంభాన్ని దేవరపేటకు తీసుకువస్తారు. మకర తోరణం, ఇతర ఆభరణాలను సూర్యాపేట నుండి పెద్దగట్టుకు తీసుకువచ్చి అలంకరిస్తారు. ప్రతి ఆదివారం, సోమవారం పూజలు జరుగుతాయి. ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. యాదవుల వంశ దేవత అయిన చౌడమ్మ ఆలయాలు సూర్యాపేట, దురాజ్‌పల్లి, పెన్‌పహాడ్ గ్రామాలలో తప్ప మరెక్కడా కనిపించకపోవడం గమనార్హం. పండుగలో భాగంగా ఒక పొట్టేలును తీసుకువచ్చి, పువ్వులు, పసుపు, కుంకుమలతో పూలమాలలు వేసి దేవుడు దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జడ్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. అయితే, లింగమంతుల స్వామి శాఖాహారి కాబట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇతర దేవతలకు జంతుబలులు ఇస్తారు. భక్తులు పండుగకు ఒక రోజు ముందు వస్తారు. పురుషులు ఎర్రటి బట్టలు ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. దిలేం బల్లెం శబ్దాల మధ్య నడుస్తారు. “ఓ లింగా.. ఓ లింగా” అని అరుస్తారు. మహిళలు తడి బట్టలు ధరించి, పసుపు, కుంకుమ, పూల దండలు, ధూపం కర్రలతో అలంకరించబడిన మండ గంపను తలపై పెట్టుకుని నడుస్తారు. పిల్లలు లేని స్త్రీలు బోనం కుండను తీసుకు వెళతారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే, భగవంతుని దయతో వారికి పిల్లలు కలుగుతారని నమ్ముతారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com