ఈనెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈనెల 24వ తేదీన ఉదయం పది గంటలకు ఉభయ సభలు సమావేశం అవుతాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈమేరకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అదేరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. ఇక, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల 28వ తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
కాగా, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదిహేను రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందంటున్నారు. మొదటిరోజు బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీని ఎన్నిరోజులు నిర్వహఙంచాలనే అంశపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఈనెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు.. 20వ తేదీ ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా కీలక చర్చ జరగనుంది. ఇక, కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను ఈనెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపించాలని సీఎస్ కార్యాలయం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.