తెలంగాణలో కారు దుకాణం బంద్ అయ్యిందన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఫాం హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హొటల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాం హౌస్ లో కేసీఆర్ సేద తీరుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో 8 మంది బిజెపి ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని అన్నారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీ అని చెప్పారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని, బిఆర్ఎస్ లో కేటీఆర్, కవిత , హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందన్నారు. బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ , ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.