రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని ప్రఖ్యాత వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై 20 మంది దాడి చేశారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని,. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయని, ఇంతకు మించి దీనిపై మాట్లాడబోనని రంగరాజన్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ ఇంటికి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై బెదిరింపులను టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ ఖండించారు. ఫిబ్రవరి 7వ తేదీన తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు సౌందర్‌రాజన్. చిలుకూరి బాలాజీ ఆశీస్సులతోనే తన కుమారుడు క్షేమంగా బయటపడ్డాడని – సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.
అయితే, రామరాజ్యం పేరుతో వచ్చిన వాళ్లు దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను మీడియాకు అందజేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలను కింద చూడొచ్చు.