35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 230

తల్లితో సహజీవనం – కూతుళ్లపై అత్యాచారం – ఆపై ఎయిడ్స్‌

సూర్యాపేట జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సదరు ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ సోకడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను ఆ యువతులు తల్లికి చెప్పారు.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే, సునీల్ భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు. సునీల్‌ సహజీవనం చేస్తున్న మహిళకు 19 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు కూడా తల్లితో పాటే ఉంటున్నారు.

ఈ క్రమంలో.. తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు జాటోత్‌ సునీల్‌కుమార్‌ తల్లి లేని సమయంలో ఆ ఇద్దరు బాలికలపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరిస్తూ.. ఆ బాలికలు ఇద్దరిపైనా పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇటీవల టీచర్‌ జాటోత్‌ సునీల్‌ కుమార్‌ వైద్య పరీక్షలు చేయించు కోవడంతో హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న బాలికలు.. ఆందోళన చెందారు. తమపైనా అఘాయిత్యానికి పాల్పడిన ఆకృత్యాల గురించి తల్లికి వివరించారు. దీంతో తల్లితో పాటు.. ఆమె ఇద్దరు కూతుళ్లు.. తమపై అకృత్యాలకు పాల్పడ్డ సునీల్‌ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోత్‌ సునీల్‌ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాశిఫలాలు… 09.02.25 నుండి 15.02.25 వరకు

ఈవారం ముఖ్యమైన పండుగలు–పర్వదినాలు..

12, బుధవారం, మాఘ పౌర్ణమి

మేషం…(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కొత్త వ్యక్తులు పరిచయాలు మీలో ఉత్తేజాన్నిస్తాయి. ముఖ్య కార్యక్రమాలను స్వయంకృషితోనే పూర్తి చేస్తారు. ఆలోచనలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. కాంట్రాక్టులు కోసం యత్నాలలో కదలికలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దష్టి పెడతారు. చిత్రమైన సంఘటనలు ఎదురై కొంత ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకునే సమయం.. అనూహ్యంగా సొమ్ము అందుతుంది.  కుటుంబంలో మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు.  వివాహయత్నాలు కలసివస్తాయి. ముఖ్య  కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గడుస్తుంది. వ్యాపారాలలో మరిన్ని లాభాలు గడిస్తారు. భాగస్వాములు మీపై మరింత నమ్మకం ఉంచుతారు. ఉద్యోగాలు అనుకున్న విధంగా సాఫీగా సాగిపోతాయి.  రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష ఆదరణ. 12, 13 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది..

వృషభం…(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

కొన్ని ముఖ్య కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మనస్పర్ధలు నెలకొని కొంత కలత చెందుతారు.. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను పంచుకుంటారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పించలేవు.. దేవాలయాల సందర్శనంతో ఊరట చెందుతారు.. ఇంటి నిర్మాణయత్నాలు ఆశించిన స్థాయిలో సాగవు. రావలసిన సొమ్ము అందక మరింత ఇబ్బంది ఏర్పడుతుంది..   బంధువులు మీపట్ల కొంత కఠిన వైఖరి అనుసరిస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడాల్సివస్తుంది.  వ్యాపారాల విస్తృతికి చేసే యత్నాలకు విఘాతం కలుగవచ్చు. సంయమనం పాటించాలి.  ఉద్యోగ  విధి నిర్వహణలో అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వారి అంచనాలు తప్పవచ్చు.. 11,12 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త పరిచయాలు.   శివాష్టకం పఠిస్తే ఉత్తమం.

మిథునం..(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ముఖ్యమైన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు.  మీ సహకారంపై బంధువులు సంతోషం వ్యక్తం చేస్తారు. ఆత్మీయులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తులు కొనుగోలు విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిర్దేశించుకున్న ఆశయాలు సాధించేదిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. అందరికీ ఆదర్శవంతులుగా ఉండేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి.  మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యుల సహాయం ఉంటుంది.  ఆరోగ్యం మీరు తీసుకునే జాగ్రత్తలతో కొంత మెరుగుపడి ఊరట చెందుతారు.  వ్యాపారాలలో వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేసి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయి ప్రోత్సాహంతో దూసుకుపోతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అన్నింటా విజయాలే కనిపిస్తాయి. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. శ్రీశివప్రాతఃస్మరణ స్తోత్రం పఠించండి.

కర్కాటకం..(పునర్వసు 4వ పాదం, పుష్యణి, ఆశ్లేష)

కొత్త విషయాలు తెలుసుకుని మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ఆశయాలు సాధించే విషయంలో రాజీపడరు. పట్టుదల పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడంలో ముందడుగు వేస్తారు.  ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. యుక్తితో కొన్ని వివాదాల  నుంచి గట్టెక్కుతారు. నూతనంగా చేపట్టిన ఇంటి  నిర్మాణాలు వేగవంతంగా సాగుతాయి.. వ్యతిరేక పరిస్థితులు అనుకూలమైన రీతిలో మలచుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలతో ఉత్సాహంతో గడుపుతారు. సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది.  సోదరులు,సోదరీలతో సత్సంబంధాలు నెలకొని వారితో ఆనందంగా గడుపుతారు. స్వల్ప అస్వస్థత, కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఒక భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు వరంగా మారనుంది. ఉద్యోగాలలో  కొత్త ఆశలతో ముందుకు సాగి మంచి గుర్తింపు పొందుతారు.  రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విదేశీ పర్యటన అవకాశాలున్నాయి. ప్రతి నిర్ణయంలోనూ కొంత సంయమనం పాటించాలి. 9,10 తేదీల్లో దూరప్రయాణాలు. లేనిపోని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. విష్ణుధ్యానం చేయండి

సింహం…(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

అన్ని విషయాలలోనూ ముందడుగు వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.మీ మనోబలమే మీకు అండగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఎవరి సాయం తీసుకోరు. శత్రువులను కూడా మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని  ఒప్పందాలు చేసుకుంటారు.. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి.  ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొత్త  వ్యక్తుల పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు..  అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరి ఊరట చెందుతారు. రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో మీరంటే ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. క్షణం తీరికలేకుండా గడుపుతారు.  . దూరపు బంధువుల రాకతో మరింత సందడి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు సమకూరతాయి.భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుపై సహచరులు సైతం ఆశ్చర్యపోతారు. మీలోని పట్టుదల, ఆత్మవిశ్వాసమే గుర్తింపునకు కారణమవుతుంది. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు తమ నేర్పును, నైపుణ్యతను చాటుకుంటారు.  14,15 తేదీల్లో ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు. మానసిక ఆందోళన.. కాలభైరవాష్టకం పఠించండి.

కన్య…(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

అనుకున్న వెంటనే కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆఘమేఘాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యచకితులను చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలను ఒక కొలిక్కి తెస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధించడంలో కృతకృత్యులవుతారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తారు.ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. పుణ్యక్షేత్రాలు కొన్ని సందర్శిస్తారు. కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. వాహనాలు, విలువైన భూములు కొనుగోలు చేసే అవకాశం. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండి అవసరాలకు మాత్రం లోటు ఉండదు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కుటుంబసభ్యులు చేదోడుగా నిలుస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తగిన ముందుస్తు జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలలో మొదట్లో కొంత దిగాలు పడ్డా క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. నూతన పెట్టుబడులకు సమయమిదే. ఉద్యోగాలలో సహచర ఉద్యోగులు సహాయపడి పనిభారం తగ్గిస్తారు. పారిశ్రామికవేత్తలు,  కళాకారులకు అనుకోని విదేశీ పర్యటనలు . 12,13 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. నృసింహస్వామిని స్మరించండి.

తుల…(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆలోచనలు కొలిక్కి వచ్చి కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల శ్రమ ఎట్టకేలకు ఫలించి ఉద్యోగాలు దక్కుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు.. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు, కొన్ని మఠాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.  సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి సైతం బాకీలు అందుకుంటారు.  కుటుంబంలో అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది.  అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు.  మీ నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి.  ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు.సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. నూతన భాగస్వాములు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వైద్యులు,. క్రీడాకారులు,  శాస్త్రవేత్తలు ప్రతిభను చాటుకుంటారు.  13,14 తేదీల్లో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శివాష్టకం పఠించడం మంచిది.

వృశ్చికం…(విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

చిరకాల స్వప్నం నెరవేరి సంతోషంగా గడుపుతారు. అనుకున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులకు ఉత్సాహం కలుగుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు స్వయంగా తీసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.  ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి కొంత లాభం చేకూరుతుంది.   ఇంటి నిర్మాణాలపై కూడా సోదరులతో చర్చిస్తారు.   రావలసిన డబ్బు సమకూరి కొన్ని అవకాశాలు తీరతాయి.  కుటుంబంలో అందరి ప్రేమను చూరగొంటారు.   వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.  పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఊహించని గుర్తింపు లభిస్తుంది. 10,11 తేదీల్లో  వాహనాలు విషయంలో వీరు అప్రమత్తంగా మెలగడం మంచిది. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు…(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

కొత్త కార్యక్రమాలను చేపట్టి ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యం చాటుకుని గుర్తింపు పొందుతారు.  విచిత్ర సంఘటనలు మీలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఆస్తి వివాదాలు చాలావరకూ తీరి లబ్ధి చేకూరుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే సహాయపడం విశేషం.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కేంద్రాలు సందర్శించి మనశ్శాంతి పొందుతారు. ఆశ్చర్యకరంగా సొమ్ము సమకూరుతుంది. మీపట్ల  కుటుంబసభ్యుల వైఖరిలో మార్పు కనిపిస్తుం ి.  ఆస్తుల విషయంలోనూ చికాకులు అధిగమిస్తారు. వ్యాపారాలలో సంస్థల విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు క్రీడాకారులు, శాస్త్రవేత్తలు సంతోషంగా గడుపుతారు. 12,13 తేదీల్లో  కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం. ఖర్చులు మీదపడవచ్చు. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం..(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

 

మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే సంకల్పబలంతో ముందడుగు వేసి విజయాల బాటలో నడుస్తారు.  విద్యార్థులు ప్రతిభను మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్న వారిని సైతం ఆదుకుంటారు.  ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సొమ్ముకు ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు.   రుణదాతలు ఒత్తిడులు తగ్గించడంతో ఊరట చెందుతారు.  పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. శుభకార్యాలకు పెద్దల ద్వారా సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు, తగు జాగ్రత్తలతో గడపండి.  వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు సర్దుబాటై లాభాలు అందుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో రాజీలేకుండా ముందుకు సాగుతారు.  రాజకీయవేత్తలు, వ్యవసాయదారులకు ఆశలు చిగురించి కొంత సంతోషం కలిగిస్తుంది. 14,15 తేదీల్లో మనోనిబ్బరం తగ్గుతుంది. ప్రతి నిర్ణయంలోనూ నిదానం అవసరం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం….(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

పేరుప్రఖ్యాతలు మరింత పెరుగుతాయి.   మీ ఆశయాలు నెరవేర్చుకునేందుకు తగిన సమయం. గతంలో మీ సహాయం పొందిన వారు మీకు వెన్నంటి నిలుస్తార . ఏ కార్యక్రమమైనా స్వయంగానే పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడడం శుభపరిణామం.  కొత్త కాంట్రాక్టులను దక్కించుకోవడంలో సఫలమవుతారు.  సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు.   ఆరోగ్యం మరింత మెరుగుపడే సూచనలు.  వ్యాపారాలు విస్తరణలో ఊహించని పెట్టుబడులు సమకూరతాయి. లాభాలకు కూడా లోటు ఉండదు. ఉద్యోగాలలో సమస్యల నుండి గట్టెక్కుతారు. తోటివారు మీకు సహాయపడడం విశేషం.  క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు గతానుభవాలను దష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తారు. 9,10 తేదీల్లో ఏదో ఒక వివాదంతో సతమతమవుతారు. కుటుంబసభ్యుల అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు.  శివాష్టకం పఠనం మంచిది.

మీనం…(పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరబాద్ర, రేవతి)

ఒక సమాచారం  ఊరటనిస్తుంది.  శత్రువులు కూడా స్నేహితులుగా మారడం విశేషం. కొత్త కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు.  సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. తీర్థయాత్రలలో ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుంటారు.  ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.   రావలసిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.  విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.   వ్యాపారాలలో మీ కృషి ఫలించి అనుకున్న లాభాలు దక్కించుకుంటారు.  ఉద్యోగాలలో పైస్థాయి వారిని ఆకట్టుకుని విధులు చక్కబెడతారు. రాజకీయవేత్తలు, కళాకారులు విజయాలను చేజిక్కించుకుంటారు. 11,12 తేదీల్లో  ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వీరు అదనపు ఖర్చులు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.  శ్రీరాముని ధ్యానించండి. శుభాలు కలుగుతాయి.

 

జైలుకెళితే సీఎం అయినట్టే… కానీ ఢిల్లీలో కుదర్లేదు

క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. ఢిల్లీ లో ఇది వర్క్ అవుట్ కాలేదు.

అవినీతి కేసుల్లో ఇటీవలే అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో సీఎం కాలేకపోయారు. అంతేకాదండోయ్.. జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీ జెడ్పీ నేత పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తెలుగు నేలలో కొనసాగిన సంప్రదాయం ఢిల్లీలో పని చేయలేదు.

ఇదిలా ఉంటే… అధికారంలో ఉంటూ జైలుకు వెళ్లిన కేజ్రీ ఎన్నికల్లో ఓడిపోగా… ఆయనతో పాటుగా.. జైలుకు వెళ్లిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేన్ద్ర జైన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో కేజ్రీ జైలుకు వెళ్లగా,.. ఆయన స్థానంలో సీఎం పదవి చేపట్టిన ఆతిశి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా… చివరి రౌండ్లలో పుంజుకుని ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వెరసి జైలుకు వెళ్లిన నేతలంతా సీఎంలు పీఎంలు అయిపోతారన్న మాటలు ఇకపై చెల్లవని చెప్పాలి.

తాను నిండా మునిగి ఆప్‌ను ముంచిన కాంగ్రెస్..

  • ఏకపక్ష ధోరణితో కూటమికి బీటలు
  • ఆప్‌ ను వెంటాడి విమర్శలు చేసిన రాహుల్
  • ఇక ఇండియా కూటమిలో ఆప్‌ ప్రభావం నిల్‌
  • ముక్కోణపు పోటీతో ముంచేసింది
  • బీజేపి గెలుపుకు హస్తం పరోక్ష సహకారం
  • రొట్టెముక్క కోసం కొట్టుకున్న కోతుల్లా రెండు పార్టీలు
  • ఆప్‌ ను కోలుకోలేని దెబ్బ తీయడమే కాంగ్రెస్ లక్ష్యం?

ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్‌ అధినేతలు కుంభమేళాలో పవిత్రస్నానాలు చేశారో లేదో కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నిండా మునిగారు. తాను నిండా మునగడమే కాక ఒకప్పటి మిత్రపక్షాన్ని కూడా కాంగ్రెస్ కసికొద్దీ ముంచేసింది. తన కన్ను పోయినా పర్లేదు.. ఎదుటివాడివి రెండు కళ్లూ పోవాలని తీవ్ర మనస్తత్వమే కాంగ్రెస్ కొంపముంచింది. వరుస పరాజయాలు వెంటాడి.. పార్టీ అవసాన దశకు చేరుకున్నా..పార్టీ ఇమేజ్ పెంచడానికి,ప్రజల్లో ఓటు బ్యాంకును కాపాడుకోడానికి కాంగ్రెస్ దగ్గర ప్రణాళికలేలేవని అర్ధమైపోయింది. పార్టీలో నిత్య అసమ్మతి,కేడర్ ను కాపాడుకోలేని తనం,నేతలను తయారు చేసుకోలేని తనం కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నాయి. ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కంచుకోట. కానీ ఆ ఢిల్లీ కంచుకోటను బద్దలు కొట్టింది ఆప్‌.. కాలక్రమంలో ఆ రెండుపార్టీలు మారిన అనివార్యతలో మిత్రపక్షాలయ్యాయి. బీజేపి ప్రభ తట్టుకోడానికి ఇండియాకూటమి ఏర్పాటైంది.

కూటమిలో లుకలుకలు :

హర్యానా ఎన్నికలలో ఇండియాకూటమిలో అనైక్యత బాహాటంగా బయటపడింది. ఆప్‌ ను తమ నియంత్రణలో ఉంచుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్.. కానీ కాంగ్రెస్ స్తబ్దత, నైరాశ్యం, మూస ఆలోచనలు, కూటమి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ వచ్చాయి. ఇండియాకూటమి ని ఎవరు లీడ్‌ చేయాలన్నది ఇప్పటికీ ఒక వివాదాస్పద అంశమే.చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు వరుస ఓటమిలు చవిచూసినా 20 ఏళ్లు అధికారానికి దూరమైపోయినా ఆ పార్టీ తీరు మారటం లేదు. హర్యానా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్‌ మధ్య పొత్తు కలసి రాలేదు. అప్పటినుంచి ఎడమొఖం, పెడమొఖంగా ఉన్న రెండు పార్టీలు ఢిల్లీ ఎన్నికల నాటికి పూర్తిగా ఎవరికి వారే యమునా తీరే అయిపోయాయి.కేజ్రీకి కలిసొచ్చే నియోజక వర్గాల్లో ముక్కోణపు పోటీకి తెరలేపింది కాంగ్రెస్. సాక్షాత్తూ కేజ్రీవాల్ను ఓడించి కసి తీర్చుకుంది. ఓపక్క బీజేపి రోడ్‌ మ్యాప్ ఆప్ ను ట్రిమ్ చేసేయడం మొదలు పెడితే మరోవైపు కాంగ్రెస్ సైలెంట్‌ గా ఆప్‌ గాలి తీసేసింది.

పాత పగలు.. వెంటాడాయా? :

గతంలో ఢిల్లీ గద్దె కేరాఫ్‌ కాంగ్రెస్ గా ఉండేది. కానీ కేజ్రీవాల్‌ రాకతో కాంగ్రెస్ ఇమేజ్ క్రమంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఓటు బ్యాంకు అంతా కేజ్రీవాల్‌ కు మళ్లింది.2013లో ఆప్‌ 28 సీట్లు గెలుచుకుని 29 శాతం ఓట్‌ షేర్ సాధిస్తే కాంగ్రెస్ ఖాతాలో 8 సీట్లు జారిపోయాయి. అదికాస్తా 2015 నాటికి 15 శాతం ఓట్ షేర్ నష్టపోయింది. ఈ ఓట్లన్నీ ఆప్‌ ఖాతాలో పడిపోయాయి. బహుశా ఈ అసంతృప్తి కాంగ్రెస్ లో ఉండి ఉండొచ్చు. ఓపక్క కళ్ల ముందు బీజేపి బలపడుతున్నా.. తాను లేనిదే కూటమి ఉండరాదన్న కాంగ్రెస్ స్వార్ధ ఆలోచనలు ఢిల్లీ గద్దెను ఇండియా కూటమికి దూరం చేశాయి..కేజ్రీవాల్‌ పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా రాహుల్ ప్రచార సరళి సాగిపోయింది. ఆప్‌ తన ఏకాగ్రతనంతా బీజేపిపై కేంద్రీకృతం చేస్తే కాంగ్రెస్ ఆప్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చింది. ఈక్రమంలో ప్రధాన శతృవును మరిచిపోయింది.ఎలాగూ ఓడిపోతాం.. బురద జల్లేస్తే పోలా అన్న రీతిలోనే ఆప్ పట్ల వ్యవహరించింది. ఏ ప్రభుత్వమైనా పదేళ్లు అధికారంలో ఉంటే వ్యతిరేకత సహజమే.. ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ కలిసొస్తే కేజ్రీవాల్‌ సునాయాసంగా అధిగమించేవారు. శత్రువును ఓడించాలంటే ఒక్కోసారి మొఖమాటానికైనా స్పర్ధలను పక్కన పెట్టాలి. కానీ తనకు దక్కనిది ఎదుటి వాడికీ దక్కరాదన్న కాంగ్రెస్ ధోరణి ఆప్‌ కు నష్టం కలిగించింది.

కాంగ్రెస్ పగకి కారణముందా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్కసీటు రాకుండా ఆప్‌ వ్యూహం పని చేసింది.ఫలితం ఢిల్లీలో ఏడు ఎంపీ స్థానాలు బీజేపి ఎగరేసుకుపోయింది. ఈకారణాలన్నింటితో ఇద్దరూ ఈగోలకు పోయి వేర్వేరుగా పోటీ చేశారు.

మిత్రధర్మం పాటించి ఉంటే..

శత్రువును తుదముట్టించడం లక్ష్యం కావాల్సి ఉండగా ఒకరినొకరు బాహాటంగానే వేటేసుకున్నారు. కాంగ్రెస్ పరిస్థితులకు తలొగ్గి కనీసం పది సీట్లయినా పొత్తులో పోటీ చేసి ఉంటే ఆప్‌ సునాయాసంగా గట్టెక్కేది. కాంగ్రెస్ ఆప్‌ కుచేసిన డ్యామేజీ ఫలితం రెండు సీట్లలో ఓపెన్ గా కనిపించింది.కౌంటింగ్‌ ట్యాలీ ఫలితాల్లో రెండు సీట్లలో కాంగ్రెస్ దాదాపు గెలుపు అంచుల వరకూ వెళ్లింది. రెండు సీట్లు ఖాయమవుతాయని అంతా భావించారు. కానీ బీజేపి స్వీప్ చేయడంతో అది సాధ్యపడలేదు. ఇలా అనేక నియోజక వర్గాల్లో ఫలితాలు తారుమారయ్యేందుకు కాంగ్రెస్ పరోక్షంగా కారణమైంది. చాలా చోట్ల హోరా హోరీ పోటీలకు కూడా కాంగ్రెస్సే కారణం.. లేదంటే కనీసం మెజారిటీకి అవసమైన 36 స్థానాలైనా ఆప్‌ గెలుచుకుని కాంగ్రెస్ కు ఒకటో రెండు సీట్లు గెలిచేందుకు దోహదపడేది.కానీ కాంగ్రెస్ శతృశేషం ఉంచరాదన్న ఆలోచనతోనే ఆప్‌ ను దెబ్బేసిందా?

కేజ్రీవాల్‌ ను కాటేసిన యమున

  • కాలుష్యం కట్టడిపై కేజ్రీ పూటకో మాట

  • యమున ప్రక్షాళన చేయలేక మాటలదాడి

  • ప్రత్యర్ధుల దృష్టి మళ్లించడానికి సంచలన ఆరోపణలు

  • ఆధారాలు ఇవ్వాలన్న ఈసీ

  • యమునా నీటినే తాను తాగుతున్నానన్నమోడీ

  • అదే నీటిని తాగి చూపించిన హర్యానా సీఎం

  • వీడియో వార్ తో సీన్ పతాక స్థాయికి

  • యమునా నది క్లీనింగ్ ఎప్పుడంటూ రాహుల్ ప్రశ్నలు

  • కేజ్రీ ఏదో చేయబోతే ఇంకేదో అయ్యిందా?

కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తానంటూ అధికారం చేపట్టిన ఆప్‌ ఆ పని చేయకపోగా అదే కాలుష్యానికి బలయ్యిందా? ఆప్‌ ఓటమి తీరు చూస్తే అదే అనిపిస్తుంది. ఢిల్లీ ప్రజలకు రక్షిత మంచినీరు అందిస్తామన్న కేజ్రీవాల్‌ అందుకు యమునా నదిని ప్రక్షాళన చేస్తామని రెండోసారి గెలిచినప్పుడు వాగ్దానం చేశారు. ఢిల్లీలో మామూలు మనుషులు బతికి బట్టకట్టలేనంతగా కాలుష్యం వెంటాడుతోంది.దీనికోసం మొదటిసారి గెలిచినప్పుడు సరి, బేసి విధానం లాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేజ్రీవాల్‌ రెండోసారి మాత్రం కాలుష్య నియంత్రణకు ఏమీ చేయలేకపోయారు.వాయు కాలుష్యానికి తోడు .. నీటి కాలుష్యం పెరిగిపోయింది.

దెబ్బ తీసిన ఎదురు దాడి వ్యూహం :

యమునానది ఢిల్లీ ప్రజలకు తాగు నీటి వనరు. ఆ నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పిన కేజ్రీవాల్‌ ఆ తర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు.అవినీతి ఆరోపణలు వెంటాడుతుంటే ప్రజల దృష్టి మళ్లించడానికి యమునా నదిలో బీజేపి నేతలు విషం కలిపారంటూ ఎదురు దాడికి దిగారు. సంచలనమైన ఈ ఆరోపణలు ఆ తర్వాత ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్ దానిపై వివరణ కోరింది. ఆధారాలతో బయటపెట్టకపోతే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించింది. అటు మోడీ అదే యమునా నీటిని తాను తాగుతున్నానంటూ చాలా సైలెంట్‌ గా గాలి తీసేశారు. మరోవైపు యమునా నది ప్రక్షాళన సంగతేంటి అంటూ రాహుల్ వెంటపడటం మొదలు పెట్టారు. పైగా యమునా నదిలో బోటు విహారం కూడా చేసిన రాహుల్ కేజ్రీవాల్‌ పై విమర్శల పదును పెంచారు. ఎక్కడి చెత్త అక్కడే. యమునా నది మురికి కూపంలా మారిందన్నారు.ఆ పాపమంతా కేజ్రీవాల్‌ దే అని తిట్టిపోశారు.
ఈసీ నోటీసులకు స్పందించిన కేజ్రీవాల్ అందుకు రిప్లయ్ గా 13 పేజీల డాక్యుమెంట్లను జత చేసి పంపారు.అందులో ఫిల్టర్ ప్లాంట్లలో అమ్మెనియా కాలుష్యం అసాధారణ స్థాయిలో కనిపించిందని ఆధారాలతో చూపారు. మరి విషం సంగతేంటి అంటూ బీజేపి నేతలు సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.

యమున నది ఆరంభమైన హర్యానాలో బీజేపి నేతలు విషం కలిపారని మరోసారి కేజ్రీవాల్‌ దూకుడు పెంచారు. ఈసారి హర్యానా సీఎం నవాబ్ సైనీ స్వయంగా యమునా నదికి వెళ్లి ఆ నీటిని నోట్లో పోసుకుని ఆ వీడియో షేర్ చేశారు. అయితే సైనీ నీరు తాగలేదని, తిరిగి ఉమ్మేశారని కేజ్రీవాల్‌ మరో వీడియో షేర్ చేశారు. అయితే అది నకిలీదని తేలిపోయింది. ఇలా పోటా పోటీ వీడియో వార్‌ కేజ్రీవాల్‌ ను పలుచన చేసింది. మరోవైపు రాహుల్ కేజ్రీపై దూకుడు పెంచారు. యమునా నదిలో స్నానం ఎప్పుడు? దాని ప్రక్షాళన ఎప్పుడంటూ కేజ్రీవాల్‌ను మాటల తూటాలతో వెంటాడారు. యమున దాకా ఎందుకు ఢిల్లీ ట్యాప్ వాటర్ తాగండి.. ఇద్దరం ఆస్పత్రిలో కలుద్దాం అంటూ ఘాటైన సెటైర్ వేశారు. ఇలా కేజ్రీవాల్‌ ఎదురు దాడి వ్యూహం అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.

సొంత నేతలు వారించలేదు :

అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆప్‌ ను సహచర నేతలైనా వారించలేదు. కనీసం ఇతర నేతలైనా ఆప్ అధినేతను కట్టడి చేయకుండా కేజ్రీవాల్ ఏదంటే దానిని సమర్ధించడంతో ఆప్‌ తనకు తానే డ్యామేజీ చేసేసుకుంది.చివరికి
యమున కాలుష్యభూతం కేజ్రీవాల్‌ ను కాటేసింది.

తెలంగాణలో మొదలైన కరెంట్ కోతలు

వేసవికి ముందే కరెంటుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. ఎండలు ఇప్పటికే మండిపోతుండటం, కరెంటు వినియోగం పెరిగి పోవడంతో తెలంగాణ వ్యాప్తంగా కరెంటు కోతలు మొదలయ్యాయి. అయితే, ఇవి అనధికారిక కోతలని చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కరెంటు కోతలు మొదలైపోయాయి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యుత్‌ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దాదాపు ప్రతిరోజూ మెయిన్ టెయిన్స్ పేరిట ఒక్కో ఏరియాలో మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈమేరకు విద్యుత్‌ అధికారులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. చెట్ల నరికివేత, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు అంటూ కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. అయితే ఇది మెయింటెనెన్స్‌ కాకపోవచ్చునని, కరెంటుకు డిమాండ్‌ పెరిగి వాస్తవంగా చేస్తున్న కోతల్లో భాగమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ఈ అనధికార కోతలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట స్థాయిలో 36 డిగ్రీల వరకూ ఉష్నోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ వేసవి మాదిరిగానే కనిపిస్తోంది. మొన్నటి జనవరి చివరి వారంలోనే మార్చి, ఏప్రిల్ నెలల్లో మాదిరిగా కరెంటుకు అధిక డిమాండ్ నమోదైంది. అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, యాసంగి పంటల సాగు పుంజుకోవడంతో విద్యుత్ డిమాండ్ మరింత ఎక్కువవుతోంది. గత యేడాది మార్చిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటగా.. ఈసారి జనవరి 31 నాటికే 15,205 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యింది. గత యేడాది జనవరిలో విద్యుత్ పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే 10 శాతం ఎక్కువగా నమోదయ్యింది. ఇప్పటివరకు సదరన్ డిస్కం పరిధిలో అత్యధికంగా పీక్ డిమాండ్ 8,679 మెగావాట్లు కాగా.. ఈసారి 9,589 మెగావాట్లకు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3,018 మెగావాట్లు కాగా.. ఈయేడు 3,334 మెగావాట్లుగా నమోదైంది. ఇక వేసవి వచ్చేసరికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సదరన్ డిస్కంలో 10 వేల మెగావాట్లు, గ్రేటర్ పరిధిలో 5 వేల మెగావాట్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా 270 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజు రోజుకూ కరెంటు వాడకం పెరిగిపోతోంది. ఇందులో 90 మిలియన్‌ యూనిట్లకుపైగా తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తుండగా, సింగరేణి 26 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 129 మిలియన్‌ యూనిట్లు, నేషనల్ పవర్ ఎక్చేంజీ నుంచి 42 మిలియన్ యూనిట్లు, ఇలా రోజువారిగా 287 మిలియన్‌ యూనిట్ల దాకా సేకరిస్తున్నారు. ఈ కరెంటుతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇక, ఫిబ్రవరిలో యావరేజ్ గా రోజూ 300 ఎంయూలకు పైగా విద్యుత్ వినియోగం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి నాటికి అది 320 నుంచి 330 ఎంయూలకు చేరవచ్చని చెబుతున్నారు. మరోవైపు.. ఈ సంవత్సరం యాసంగి సాగు జోరందుకుంది. వానాకాలంలో లేటుగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలాలతో బోర్లు రీచార్జ్ అయి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగు వైపునకు మొగ్గు చూపుతున్నారు. నీళ్లు తక్కువగా ఉన్నవాళ్లు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌లో పంటల సాగు 60 లక్షల ఎకరాలకు చేరువ కాగా, అది 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందంటున్నారు.

అంతర్వేదిలో కన్నుల పండువగా కల్యాణం, రథోత్సవం

కోనసీమలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవం, రథోత్సవం కన్నుల పండువగా జరిగాయి. ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా గ్రామాన్ని మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

దేశంలోని నవ నారసింహ పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ఒకటి. ఈ స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చేశారు.

సువాసనలు వెదజల్లే పుష్పాల పందిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యహవచనం, మాంగల్యధారణ, తలంబ్రాలు, ఘట్టాలు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య పచ్చని కోనసీమ అంతర్వేదిలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది.

అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణం స్వయంగా చూస్తే కష్టాలు తొలగి శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం చూడాలన్నా అదృష్టం ఉండాలని అర్చక స్వాములు చెబుతుంటారు. అలాగే, కల్యాణోత్సవంలో భాగంగా జరిగిన రథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసకేస్తే రాలనంతగా జనం రథోత్సవం సమయంలో వీధుల్లో పోటె్త్తారు.

తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

తిరుమలలో ఈనెల 12వ తేదీన జరగనున్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల కోసం రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు. అనంతరం.. అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం సదుపాయాలు, అటవీ శాఖల ఏర్పాట్లపైనా అదనపు ఈవో సమీక్షించారు.

అధిక బరువు ఉన్నవాళ్లు, ఆస్తమాతో బాధపడే వాళ్లను, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లను, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులను, వృద్ధులను, అలాగే.. పదేళ్లలోపు చిన్నారులను కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతించబోమని ఆయన తెలియజేశారు. కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులను ఈ తీర్థానికి అనుమతిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఈఈ సుబ్రహ్మణ్యం, విజిఓ సురేంద్ర, డీఎఫ్ఓ శ్రీనివాసులు, తిరుమల పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు

కేబినెట్‌ విస్తరణ ఇప్పట్లో లేనట్టే….

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. ఈసారైనా తెలంగాణ ముఖ్యనేతల హస్తిన పర్యటనలో క్లారిటీ వస్తుందని అందరూ భావించినా.. ఈసారి కూడా నిరాశే ఎదురయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పిలుపుతోనే వీళ్లంతా ఢిల్లీ వెళ్లారు. అయితే, ప్రభత్వ, పార్టీ ప్రతినిధులను పిలవడంతో, కేబినెట్‌ విస్తరణ ఉంటుందేమోనని, ఫైనల్‌ లిస్ట్‌తో ఈనేతలంతా తిరిగి వస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. కేబినెట్‌తో ఎవరిని ఉంచాలో, ఎవరిని తొలగించాలో, కొత్తగా ఎవరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలో వంటి అంశాలపై అధిష్టానానిదే తుది నిర్ణయమని రేవంత్‌ స్పష్టం చేశారు. తాను కొత్తగా ఎవరినీ సిఫారసు చేయలేదని కూడా ముఖ్యమంత్రి మీడియా చిట్‌చాట్‌లో కుండబద్దలు కొట్టారు.

ఇదే క్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని, తమ ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరలేదన్నారు. తాను ఎప్పటికప్పడు రాహుల్ తో ఫోన్ లో మాట్లాడి రాష్ట్ర విషయాలు వివరిస్తున్నానని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలకు సంబంధించి అన్ని అంశాలూ అధిష్టానం దృష్టిలో ఉంటాయని రేవంత్‌ చెప్పారు. తాను వ్యక్తిగత నిర్ణయాలేమీ తీసుకోనని, పార్టీ అధిష్టానం, అలాగే, తమ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పార్టీ తమకు అప్పగించిన పనిని పూర్తిచేయడమే లక్ష్యమని, పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల వ్యవహారంలో చట్టం ప్రకారం ముందుకు వెళతామన్నారు. విపక్ష నేతలను త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు దాదాపు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో కులగణన అంత ఆషామాషీగా చేసింది కాదన్న రేవంత్‌రెడ్డి.. ఎంతో పకడ్భందీగా సర్వే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కులగణన సర్వే చేశామన్నారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్‌లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయ్యిందన్నారు సీఎం రేవంత్‌. కులగణనతో బిసిలు ఐదున్నర శాతం పెరిగారని, బిసిలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని సిఎం వివరించారు. పిసిసి కార్యవర్గం కూర్పు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఈ విషయంలో వీలైనంత తొందరలోనే ప్రకటన ఉంటుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధిష్టానం సీక్రెట్‌ మీటింగ్‌?

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం సీక్రెట్‌ మీటింగ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కేసీ వేణుగోపాల్ ఈ రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఢిల్లీలో ఉన్న సమయంలోనే వీళ్లను కాదని కేసీ వేణుగోపాల్‌ ఈ సీక్రెట్‌ మీటింగ్‌ పెట్టినట్లు సమాచరాం బయటకు వచ్చింది. వాస్తవానికి ఢిల్లీ టూర్‌లో ఈ ముగ్గురు ముఖ్యనేతలతో పాటు.. మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే, కేసీ వేణుగోపాల్‌ ఈ ముగ్గురు ముఖ్యనేతలను కాకుండా.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో రహస్యంగా సమావేశమైన విషయం బయటకు వచ్చింది.

రేవంత్‌రెడ్డి పాలన, ప్రజల్లో పార్టీపై నెలకొన్న అభిప్రాయం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పథకాల అమలు తీరు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌ వైఫల్యాలపైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో కాంగ్రెస్‌పార్టీలో కలకలం చెలరేగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ కూడా ఢిల్లీలో ఉన్న సమయంలోనే మరో నేతతో అధిష్టానం ప్రతినిధి కేసీ వేణుగోపాల్ రహస్యంగా భేటీ కావడం వెనుక మతలబు ఏంటన్న చర్చ జరుగుతోంది.

వాస్తవానికి ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన అంశం సంచలనంగా మారింది. అలాగే, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్‌ మల్లన్న కూడా పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ రెండు అంశాలను సద్దు మణిగేలా చేసేందుకు ఢిల్లీ వెళ్లేముందు సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్‌పీ సమావేశంలో ప్రయత్నించారు. ఆ సమస్యలకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీళ్లంతా ఢిల్లీ వెళ్లిన తర్వాత బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖ్యనేతలతో కాకుండా మరో మంత్రితో కేసీ వేణుగోపాల్ రహస్య చర్చలు జరపడంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com