37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తాను నిండా మునిగి ఆప్‌ను ముంచిన కాంగ్రెస్..

  • ఏకపక్ష ధోరణితో కూటమికి బీటలు
  • ఆప్‌ ను వెంటాడి విమర్శలు చేసిన రాహుల్
  • ఇక ఇండియా కూటమిలో ఆప్‌ ప్రభావం నిల్‌
  • ముక్కోణపు పోటీతో ముంచేసింది
  • బీజేపి గెలుపుకు హస్తం పరోక్ష సహకారం
  • రొట్టెముక్క కోసం కొట్టుకున్న కోతుల్లా రెండు పార్టీలు
  • ఆప్‌ ను కోలుకోలేని దెబ్బ తీయడమే కాంగ్రెస్ లక్ష్యం?

ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్‌ అధినేతలు కుంభమేళాలో పవిత్రస్నానాలు చేశారో లేదో కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నిండా మునిగారు. తాను నిండా మునగడమే కాక ఒకప్పటి మిత్రపక్షాన్ని కూడా కాంగ్రెస్ కసికొద్దీ ముంచేసింది. తన కన్ను పోయినా పర్లేదు.. ఎదుటివాడివి రెండు కళ్లూ పోవాలని తీవ్ర మనస్తత్వమే కాంగ్రెస్ కొంపముంచింది. వరుస పరాజయాలు వెంటాడి.. పార్టీ అవసాన దశకు చేరుకున్నా..పార్టీ ఇమేజ్ పెంచడానికి,ప్రజల్లో ఓటు బ్యాంకును కాపాడుకోడానికి కాంగ్రెస్ దగ్గర ప్రణాళికలేలేవని అర్ధమైపోయింది. పార్టీలో నిత్య అసమ్మతి,కేడర్ ను కాపాడుకోలేని తనం,నేతలను తయారు చేసుకోలేని తనం కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నాయి. ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కంచుకోట. కానీ ఆ ఢిల్లీ కంచుకోటను బద్దలు కొట్టింది ఆప్‌.. కాలక్రమంలో ఆ రెండుపార్టీలు మారిన అనివార్యతలో మిత్రపక్షాలయ్యాయి. బీజేపి ప్రభ తట్టుకోడానికి ఇండియాకూటమి ఏర్పాటైంది.

కూటమిలో లుకలుకలు :

హర్యానా ఎన్నికలలో ఇండియాకూటమిలో అనైక్యత బాహాటంగా బయటపడింది. ఆప్‌ ను తమ నియంత్రణలో ఉంచుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్.. కానీ కాంగ్రెస్ స్తబ్దత, నైరాశ్యం, మూస ఆలోచనలు, కూటమి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ వచ్చాయి. ఇండియాకూటమి ని ఎవరు లీడ్‌ చేయాలన్నది ఇప్పటికీ ఒక వివాదాస్పద అంశమే.చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు వరుస ఓటమిలు చవిచూసినా 20 ఏళ్లు అధికారానికి దూరమైపోయినా ఆ పార్టీ తీరు మారటం లేదు. హర్యానా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్‌ మధ్య పొత్తు కలసి రాలేదు. అప్పటినుంచి ఎడమొఖం, పెడమొఖంగా ఉన్న రెండు పార్టీలు ఢిల్లీ ఎన్నికల నాటికి పూర్తిగా ఎవరికి వారే యమునా తీరే అయిపోయాయి.కేజ్రీకి కలిసొచ్చే నియోజక వర్గాల్లో ముక్కోణపు పోటీకి తెరలేపింది కాంగ్రెస్. సాక్షాత్తూ కేజ్రీవాల్ను ఓడించి కసి తీర్చుకుంది. ఓపక్క బీజేపి రోడ్‌ మ్యాప్ ఆప్ ను ట్రిమ్ చేసేయడం మొదలు పెడితే మరోవైపు కాంగ్రెస్ సైలెంట్‌ గా ఆప్‌ గాలి తీసేసింది.

పాత పగలు.. వెంటాడాయా? :

గతంలో ఢిల్లీ గద్దె కేరాఫ్‌ కాంగ్రెస్ గా ఉండేది. కానీ కేజ్రీవాల్‌ రాకతో కాంగ్రెస్ ఇమేజ్ క్రమంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఓటు బ్యాంకు అంతా కేజ్రీవాల్‌ కు మళ్లింది.2013లో ఆప్‌ 28 సీట్లు గెలుచుకుని 29 శాతం ఓట్‌ షేర్ సాధిస్తే కాంగ్రెస్ ఖాతాలో 8 సీట్లు జారిపోయాయి. అదికాస్తా 2015 నాటికి 15 శాతం ఓట్ షేర్ నష్టపోయింది. ఈ ఓట్లన్నీ ఆప్‌ ఖాతాలో పడిపోయాయి. బహుశా ఈ అసంతృప్తి కాంగ్రెస్ లో ఉండి ఉండొచ్చు. ఓపక్క కళ్ల ముందు బీజేపి బలపడుతున్నా.. తాను లేనిదే కూటమి ఉండరాదన్న కాంగ్రెస్ స్వార్ధ ఆలోచనలు ఢిల్లీ గద్దెను ఇండియా కూటమికి దూరం చేశాయి..కేజ్రీవాల్‌ పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా రాహుల్ ప్రచార సరళి సాగిపోయింది. ఆప్‌ తన ఏకాగ్రతనంతా బీజేపిపై కేంద్రీకృతం చేస్తే కాంగ్రెస్ ఆప్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చింది. ఈక్రమంలో ప్రధాన శతృవును మరిచిపోయింది.ఎలాగూ ఓడిపోతాం.. బురద జల్లేస్తే పోలా అన్న రీతిలోనే ఆప్ పట్ల వ్యవహరించింది. ఏ ప్రభుత్వమైనా పదేళ్లు అధికారంలో ఉంటే వ్యతిరేకత సహజమే.. ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ కలిసొస్తే కేజ్రీవాల్‌ సునాయాసంగా అధిగమించేవారు. శత్రువును ఓడించాలంటే ఒక్కోసారి మొఖమాటానికైనా స్పర్ధలను పక్కన పెట్టాలి. కానీ తనకు దక్కనిది ఎదుటి వాడికీ దక్కరాదన్న కాంగ్రెస్ ధోరణి ఆప్‌ కు నష్టం కలిగించింది.

కాంగ్రెస్ పగకి కారణముందా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్కసీటు రాకుండా ఆప్‌ వ్యూహం పని చేసింది.ఫలితం ఢిల్లీలో ఏడు ఎంపీ స్థానాలు బీజేపి ఎగరేసుకుపోయింది. ఈకారణాలన్నింటితో ఇద్దరూ ఈగోలకు పోయి వేర్వేరుగా పోటీ చేశారు.

మిత్రధర్మం పాటించి ఉంటే..

శత్రువును తుదముట్టించడం లక్ష్యం కావాల్సి ఉండగా ఒకరినొకరు బాహాటంగానే వేటేసుకున్నారు. కాంగ్రెస్ పరిస్థితులకు తలొగ్గి కనీసం పది సీట్లయినా పొత్తులో పోటీ చేసి ఉంటే ఆప్‌ సునాయాసంగా గట్టెక్కేది. కాంగ్రెస్ ఆప్‌ కుచేసిన డ్యామేజీ ఫలితం రెండు సీట్లలో ఓపెన్ గా కనిపించింది.కౌంటింగ్‌ ట్యాలీ ఫలితాల్లో రెండు సీట్లలో కాంగ్రెస్ దాదాపు గెలుపు అంచుల వరకూ వెళ్లింది. రెండు సీట్లు ఖాయమవుతాయని అంతా భావించారు. కానీ బీజేపి స్వీప్ చేయడంతో అది సాధ్యపడలేదు. ఇలా అనేక నియోజక వర్గాల్లో ఫలితాలు తారుమారయ్యేందుకు కాంగ్రెస్ పరోక్షంగా కారణమైంది. చాలా చోట్ల హోరా హోరీ పోటీలకు కూడా కాంగ్రెస్సే కారణం.. లేదంటే కనీసం మెజారిటీకి అవసమైన 36 స్థానాలైనా ఆప్‌ గెలుచుకుని కాంగ్రెస్ కు ఒకటో రెండు సీట్లు గెలిచేందుకు దోహదపడేది.కానీ కాంగ్రెస్ శతృశేషం ఉంచరాదన్న ఆలోచనతోనే ఆప్‌ ను దెబ్బేసిందా?

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com