సూర్యాపేట జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సదరు ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ సోకడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను ఆ యువతులు తల్లికి చెప్పారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే, సునీల్ భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు. సునీల్ సహజీవనం చేస్తున్న మహిళకు 19 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు కూడా తల్లితో పాటే ఉంటున్నారు.
ఈ క్రమంలో.. తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు జాటోత్ సునీల్‌కుమార్ తల్లి లేని సమయంలో ఆ ఇద్దరు బాలికలపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరిస్తూ.. ఆ బాలికలు ఇద్దరిపైనా పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల టీచర్ జాటోత్ సునీల్ కుమార్ వైద్య పరీక్షలు చేయించు కోవడంతో హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న బాలికలు.. ఆందోళన చెందారు. తమపైనా అఘాయిత్యానికి పాల్పడిన ఆకృత్యాల గురించి తల్లికి వివరించారు. దీంతో తల్లితో పాటు.. ఆమె ఇద్దరు కూతుళ్లు.. తమపై అకృత్యాలకు పాల్పడ్డ సునీల్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోత్ సునీల్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.