24.1 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

తెలంగాణలో మొదలైన కరెంట్ కోతలు

వేసవికి ముందే కరెంటుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. ఎండలు ఇప్పటికే మండిపోతుండటం, కరెంటు వినియోగం పెరిగి పోవడంతో తెలంగాణ వ్యాప్తంగా కరెంటు కోతలు మొదలయ్యాయి. అయితే, ఇవి అనధికారిక కోతలని చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కరెంటు కోతలు మొదలైపోయాయి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యుత్‌ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దాదాపు ప్రతిరోజూ మెయిన్ టెయిన్స్ పేరిట ఒక్కో ఏరియాలో మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈమేరకు విద్యుత్‌ అధికారులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. చెట్ల నరికివేత, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు అంటూ కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. అయితే ఇది మెయింటెనెన్స్‌ కాకపోవచ్చునని, కరెంటుకు డిమాండ్‌ పెరిగి వాస్తవంగా చేస్తున్న కోతల్లో భాగమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ఈ అనధికార కోతలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట స్థాయిలో 36 డిగ్రీల వరకూ ఉష్నోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ వేసవి మాదిరిగానే కనిపిస్తోంది. మొన్నటి జనవరి చివరి వారంలోనే మార్చి, ఏప్రిల్ నెలల్లో మాదిరిగా కరెంటుకు అధిక డిమాండ్ నమోదైంది. అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, యాసంగి పంటల సాగు పుంజుకోవడంతో విద్యుత్ డిమాండ్ మరింత ఎక్కువవుతోంది. గత యేడాది మార్చిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటగా.. ఈసారి జనవరి 31 నాటికే 15,205 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యింది. గత యేడాది జనవరిలో విద్యుత్ పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే 10 శాతం ఎక్కువగా నమోదయ్యింది. ఇప్పటివరకు సదరన్ డిస్కం పరిధిలో అత్యధికంగా పీక్ డిమాండ్ 8,679 మెగావాట్లు కాగా.. ఈసారి 9,589 మెగావాట్లకు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3,018 మెగావాట్లు కాగా.. ఈయేడు 3,334 మెగావాట్లుగా నమోదైంది. ఇక వేసవి వచ్చేసరికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సదరన్ డిస్కంలో 10 వేల మెగావాట్లు, గ్రేటర్ పరిధిలో 5 వేల మెగావాట్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా 270 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజు రోజుకూ కరెంటు వాడకం పెరిగిపోతోంది. ఇందులో 90 మిలియన్‌ యూనిట్లకుపైగా తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తుండగా, సింగరేణి 26 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 129 మిలియన్‌ యూనిట్లు, నేషనల్ పవర్ ఎక్చేంజీ నుంచి 42 మిలియన్ యూనిట్లు, ఇలా రోజువారిగా 287 మిలియన్‌ యూనిట్ల దాకా సేకరిస్తున్నారు. ఈ కరెంటుతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇక, ఫిబ్రవరిలో యావరేజ్ గా రోజూ 300 ఎంయూలకు పైగా విద్యుత్ వినియోగం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి నాటికి అది 320 నుంచి 330 ఎంయూలకు చేరవచ్చని చెబుతున్నారు. మరోవైపు.. ఈ సంవత్సరం యాసంగి సాగు జోరందుకుంది. వానాకాలంలో లేటుగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలాలతో బోర్లు రీచార్జ్ అయి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగు వైపునకు మొగ్గు చూపుతున్నారు. నీళ్లు తక్కువగా ఉన్నవాళ్లు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌లో పంటల సాగు 60 లక్షల ఎకరాలకు చేరువ కాగా, అది 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com