కోనసీమలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణోత్సవం, రథోత్సవం కన్నుల పండువగా జరిగాయి. ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా గ్రామాన్ని మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దేశంలోని నవ నారసింహ పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ఒకటి. ఈ స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చేశారు.
సువాసనలు వెదజల్లే పుష్పాల పందిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యహవచనం, మాంగల్యధారణ, తలంబ్రాలు, ఘట్టాలు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య పచ్చని కోనసీమ అంతర్వేదిలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది.
అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణం స్వయంగా చూస్తే కష్టాలు తొలగి శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం చూడాలన్నా అదృష్టం ఉండాలని అర్చక స్వాములు చెబుతుంటారు. అలాగే, కల్యాణోత్సవంలో భాగంగా జరిగిన రథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసకేస్తే రాలనంతగా జనం రథోత్సవం సమయంలో వీధుల్లో పోటె్త్తారు.