తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. ఈసారైనా తెలంగాణ ముఖ్యనేతల హస్తిన పర్యటనలో క్లారిటీ వస్తుందని అందరూ భావించినా.. ఈసారి కూడా నిరాశే ఎదురయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పిలుపుతోనే వీళ్లంతా ఢిల్లీ వెళ్లారు. అయితే, ప్రభత్వ, పార్టీ ప్రతినిధులను పిలవడంతో, కేబినెట్ విస్తరణ ఉంటుందేమోనని, ఫైనల్ లిస్ట్‌తో ఈనేతలంతా తిరిగి వస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. కేబినెట్‌తో ఎవరిని ఉంచాలో, ఎవరిని తొలగించాలో, కొత్తగా ఎవరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలో వంటి అంశాలపై అధిష్టానానిదే తుది నిర్ణయమని రేవంత్ స్పష్టం చేశారు. తాను కొత్తగా ఎవరినీ సిఫారసు చేయలేదని కూడా ముఖ్యమంత్రి మీడియా చిట్‌చాట్‌లో కుండబద్దలు కొట్టారు.
ఇదే క్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తమ ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదన్నారు. తాను ఎప్పటికప్పడు రాహుల్ తో ఫోన్ లో మాట్లాడి రాష్ట్ర విషయాలు వివరిస్తున్నానని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలకు సంబంధించి అన్ని అంశాలూ అధిష్టానం దృష్టిలో ఉంటాయని రేవంత్ చెప్పారు. తాను వ్యక్తిగత నిర్ణయాలేమీ తీసుకోనని, పార్టీ అధిష్టానం, అలాగే, తమ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పార్టీ తమకు అప్పగించిన పనిని పూర్తిచేయడమే లక్ష్యమని, పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల వ్యవహారంలో చట్టం ప్రకారం ముందుకు వెళతామన్నారు. విపక్ష నేతలను త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు దాదాపు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో కులగణన అంత ఆషామాషీగా చేసింది కాదన్న రేవంత్‌రెడ్డి.. ఎంతో పకడ్భందీగా సర్వే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కులగణన సర్వే చేశామన్నారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్‌లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయ్యిందన్నారు సీఎం రేవంత్. కులగణనతో బిసిలు ఐదున్నర శాతం పెరిగారని, బిసిలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని సిఎం వివరించారు. పిసిసి కార్యవర్గం కూర్పు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఈ విషయంలో వీలైనంత తొందరలోనే ప్రకటన ఉంటుందన్నారు.