తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కోళ్లకు వింత వ్యాధి సోకుతోంది. అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కోళ్లకు వింత వైరస్ సోకింది. వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.
ఈ పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. కోళ్లకు సోకుతున్న అంతుచిక్కిన వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ పశు సంవర్థక శాఖ అలర్ట్ అయ్యింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని.. పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్ళను దూరంగా పూడ్చిపెట్టాలని సూచించారు. వైరస్ సోకిన కోళ్ళ తరలింపులో కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది.