కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, వేద పండితులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమంయలో వెయ్యి కోట్ల రూపాయలతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని కవిత చెప్పారు. అదే ప్రణాళికతో.. లేదంటే మరింత మెరుగైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల ఇలవేల్పు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే కొండగట్టు క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని కవిత చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరారు. కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని, కొండగట్టులోని రోడ్డును డెవలప్ చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు కల్వకుంట్ల కవిత. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. రూ.25 కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ఆమె చెప్పారు. దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు.