35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 224

ఎవరీ రామరాజ్యం రాఘవ రెడ్డి? చిలుకూరు వివాదమేంటి?

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడిపై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చ కుడు రంగరాజన్‌పై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌పై దాడిచేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. రంగరాజన్‌పై దాడిచేసిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన వీర రాఘవ రెడ్డిగా గుర్తించారు. వీర రాఘవ రెడ్డి తాను స్థాపించిన రామరాజ్యం సంస్థలో సభ్యులను చేర్పించాలని, తమకు ఆర్థిక సాయం చేయాలని రంగ రాజన్‌ను డిమాండ్ చేయగా, దానికి ఆయన నిరాకరించారు. దీంతో, వీర రాఘవ రెడ్డి, ఆయనతో వచ్చిన అనుచరులు చిలుకూరు అర్చుకుడు రంగరాజన్‌పై దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నా మని, అరెస్ట్ అయిన వారిలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారిని గుర్తించా మన్నారు. తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యులను చేర్పించడంతో పాటు.. తమ సంస్థకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు వీరరాఘవరెడ్డి రంగరాజన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, రంగరాజన్‌ దీనికి
నిరాకరించడంతో అనుచరులతో కలిసి వచ్చి దాడికి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో పోలీసులు మొత్తం 22 మందిని గుర్తించారు. వారిలో 17 మంది నిందితుల ఆచూకీ తెలిసిందన్నారు. వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వాళ్లు 17 మంది ఉన్నారని డీసీపీ చెప్పారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అందరినీ అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

ఏపీకి చెందిన వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించారు. తాను స్థాపించిన రామరాజ్యం సంస్థను బలోపేతం చేసేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రామరాజ్యంలో చేరిన వారికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు. ఇందులో చేరిన వారికి నెలవారీగా రూ.20వేల జీతం ఇస్తానని సభ్యులకు వివరించి వారికి నియమ నిబంధనల గురించి వివరించారు. ఇటీవల తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించి రామ రాజ్యం విధి విధానాల గురించి సభ్యులకు హితబోధ చేశారు. ప్రత్యేకంగా రామరాజ్యంలో చేరిన వారికి డ్రెస్‌కోడ్ ఉండాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన యాప్రాల్‌లో రామరాజ్యం సభ్యులంతా సమావేశమయ్యారు. రామరాజ్యంలో సభ్యులుగా ఉన్నవాళ్లందరూ తమ సంస్థ బ్యానర్‌ పెట్టుకొని ఫొటోలు, వీడియోలు దిగారు. వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.

ఇక, ఈ నెల 7వ తేదీన రామరాజ్యం సభ్యులు దాదాపు 25 మంది బృందం.. వీరరాఘవరెడ్డి నాయకత్వంలో ప్రత్యేకంగా నల్లదుస్తులు ధరించి చిలుకూరు ఆలయం సమీపంలోని అర్చకుడు రంగరాజన్ నివాసానికి వెళ్లారు. వాళ్ల ఇంట్లోనే రంగరాజన్‌ను భయభ్రాంతులకు గురిచేశారు. శుక్రవారం ఉదయం వీళ్లంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. వీరరాఘవరెడ్డి తదితరులు చిలుకూరు బాలాజీ దేవాలయం బాధ్యతలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకో బోయిన రంగరాజన్ కుమారుడిని సైతం కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్‌ను ప్రశ్నించారు. ఊరికే కోర్టుల్లో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు గడువు ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే ఇక తాము రాబోమని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు.

2040 నాటికి రామరాజ్యం ఏర్పాటు చేస్తానని వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరి ట ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేశాడు. అదే పేరుతో వెబ్‌సైట్ కూడా ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరుగుతూ రామరాజ్య స్థాపనపై ప్రచారం చేస్తున్నాడు. తనకు 5వేల మంది సైన్యం కావాలని ప్రకటన జారీ చేశాడు. తన సైన్యంలో చేరేవారికి భగవద్గీత వచ్చి ఉండాలని, ఐదు కిలోమీటర్లు నడవ గలగాలని, రెండు కిలోమీటర్లు పరుగెత్త గలగాలని నియమాలు పెట్టాడు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా వీర రాఘవ రెడ్డి పనిచేశాడు. జైహింద్, జై విశ్వ మానవ వేదిక పేరుతో 2016లో ఓ గ్రూపును సైతం ఏర్పాటు చేశాడు. తర్వాత దాన్ని మూసివేసి గోరక్షణ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు సైన్యాన్ని వాడుకున్నాడు. 2015లో అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో వీరరాఘవరెడ్డిపై ఓ కేసు కూడా నమోదైంది. గత కొంత కాలంగా వీరరాఘవరెడ్డి మణికొండలో నివాసం ఉంటున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అరాచకాలు సహించేది లేదు…శ్రీధర్ బాబు

రంగరాజన్ పై దాడి అమానవీయ చర్య అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను ఈ రోజు పరామర్శించిన జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

సౌందర్య రాజన్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డిలు దాడి ఘటనను అడిగి తెలుసుకున్నారు. రాముని పేరుతో దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

రామరాజ్యం పేర అరాచకాలు సాగిస్తే సహించేది లేదని… చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని మంత్రి శ్రీధర్ బాబు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయిందని…పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్ నిర్ధారణ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ 95429 08025 నెంబర్ తో ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలెర్ట్ ప్రకటించారు.

ప్రజలు కొన్ని రోజులు పాటు  చికెన్ తినడం తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి.

కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్..పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు.

ఈ ప్రాంతాల్లో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా.. వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆయా పౌల్ట్రీల నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), క్రోడిగుడ్లను కాల్చి వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 75 శాతం కోళ్లను కాల్చి వేసిన పౌల్ట్రీ యజమానులు…గడచిన ఐదు, ఆరు రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏయే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయింది సమాచారం తెలుసుకోవాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. ఇంకా మిగిలిన ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ లు రావాల్సి ఉంది.

రైల్వే జోన్‌ సరే… కేకే లైన్ సంగతేంటి?

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది.. అలాగే, కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, కొత్త రైల్వే జోన్ ప్రకటన తర్వాత ఓ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేలైన్‌ మొత్తాన్ని విశాఖపట్నం జోన్‌ కింందకు తీసుకువచ్చిన కేంద్రం.. అత్యంత కీలకమైన, విశాఖనుంచే రాకపోకలు సాగించే కేకే లైన్‌ విషయంలో మాత్రం ట్విస్ట్‌ చూపించింది. కేకే లైన్‌ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌ పరిధిలోకి బదలాయించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఈ అంశం గురించి అవగాహన ఉన్న వాళ్లందరిలో తీవ్ర చర్చను లేవనెత్తింది. రైల్వేజోన్‌ను కేటాయించినట్లే కేటాయించి.. అత్యంత కీలకమైన, లాభదాయకమైన కేకే లైన్‌ను మాత్రం రాయగడ డివిజన్‌లో కలపడం సరైన నిర్ణయం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అసలు ఏంటీ కేకే లైన్‌?

అరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అనేది అందరికీ తెలిసిన విషయమే. అరకు వెళ్లే యాత్రికులకు రైలు ప్రయాణం మధురానుభూతిని అందిస్తుంది. పర్యాటకులను ఫిదా చేస్తుంది. విశాఖ నుంచి అరకు దాకా.. కొండలు, గుట్టలు, లోయలన్నీ దాటుకుని ఎటుచూసినా అడవి కనిపించే మార్గంలో టన్నెల్స్ గుండా సాగిపోయే ప్రయాణం అరకు పర్యటనలో ప్రత్యేకంగా నిలుస్తుంది. విశాఖపట్నం నుంచి మొదలయ్యే ఈ పర్యాటక రైలుమార్గం దాదాపు 120 కిలోమీటర్ల దాకా సాగిపోతుంది. ఈ రూట్‌లో నడిచే రైలుకు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయడం వల్ల టూరిస్టులకు మరిచిపోలేని అనుభూతిని మిగల్చడంతో పాటు.. అందరినీ ఆకర్షిస్తోంది. ఈ రైలు మార్గం ఇన్నాళ్ల పాటు వాల్తేరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఉండేది.

విశాఖ డివిజన్‌కు ఆర్థికంగా నష్టం :

ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేయడమే కాదు.. రూట్‌ మ్యాప్‌ కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని రైలుమార్గం మొత్తం విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తెచ్చింది. అయితే, విశాఖ నుంచే రాకపోకలు సాగించే కీలకమైన కేకే లైన్‌ను మాత్రం తూర్పు కోస్తా పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్చేసింది. కొత్తవలస – కిరండోల్‌ లైన్‌లో భాగమైన అరకు రైల్వే స్టేషన్‌పై తెలుగువాళ్లకు ఎంతో ఎమోషనల్ టచ్ ఉంటుంది. అంతే కాదు.. కేకే లైన్ ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్‌కి అత్యధిక ఆదాయం వస్తుంది. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేసినా, రాష్ట్రం మొత్తం ఈ జోన్‌ పరిధిలోకి తెచ్చినా.. కీలకమైన కేకే లైన్‌ లేకపోవడమంటే.. కొత్త రైల్వేజోన్‌లో ఉన్న విశాఖ డివిజన్‌కు మాత్రం ఆర్థికంగా నష్టమే అంటున్నారు.

కేకే లైన్‌ ద్వారా బహుముఖ ప్రయోజనాలు :

కొత్తవలస – కిరండోల్‌ రైల్వే లైన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కలుపుతూ సాగిపోతుంది. మొత్తం 446 కిలోమీటర్ల మేర ఈ కేకే లైన్‌ విస్తరించి ఉంది. ఈ మార్గంలో 58 ప్రాంతాల్లో కొండలను తొలిచి గుహల్లోంచి రైలు మార్గం నిర్మించారు. ఈ లైన్‌లో 48 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఛత్తీస్‌ గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి, విశాఖ పోర్టు దాకా కేకే లైన్‌ ద్వారానే నిత్యం 10 నుంచి 12 వ్యాగన్ల ఐరన్‌ ఓర్‌ రవాణా జరుగుతుంది. ఈ ఐరన్‌ ఓర్‌ రవాణా వల్ల ప్రతియేటా దాదాపు రూ.10కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇక, గూడ్స్‌ రైళ్లు మాత్రమే కాకుండా.. విశాఖ నుంచి మూడు, రాయగడ నుంచి మరో మూడు ప్యాసింజర్‌ రైళ్లు ఈ కేకే లైన్‌లో నిత్యం నడుస్తాయి. ఇలా.. కేకే లైన్‌ ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందశ్వరి ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, అరకు రైల్వే స్టేషన్‌ను, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ను కోరుతూ అరకు ఎంపీ తనుజారాణి కూడా వినతి పత్రం అందజేశారు. మరోవైపు వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా కేకే లైన్‌ను విశాఖపట్నం డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెర‌గాలి…చంద్రబాబు

ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో ఈ రోజు జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వివిధ శాఖ‌ల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్సు జ‌రుగుతున్న క్ర‌మం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాల‌న్నారు. ఫైళ్లు ఎక్క‌డ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నే దానిపైన కార్య‌ద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకుని, ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం చేయాల‌ని సూచించారు.

ఫైళ్ల‌లో ఆర్థిక‌, ఆర్థికేత‌ర అనే రెండు ర‌కాల ఫైళ్లుంటాయ‌ని, ఆర్థికేత‌ర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి ప‌రిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండ‌కూడ‌ద‌న్నారు. ఆర్థిక ప‌ర‌మైన ఫైళ్లయితే ఆయా శాఖ‌ల్లోని బ‌డ్జెట్ త‌దిత‌ర అంశాల‌ను సమీక్షించుకుని ఫైళ్లను త్వ‌రిత‌గ‌తిన స‌మీక్షించాలన్నారు. కొన్ని శాఖ‌ల్లో కొంత‌మంది అధికారులు త‌మ వ‌ద్ద ఫైళ్ల‌ను ఆరు నెల‌లు, సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంచుకుంటున్నార‌ని ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో స‌గ‌టున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియ‌రెన్సు అవుతున్నాయ‌ని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మ‌రికొన్ని శాఖ‌ల్లో ఫైళ్లు ఆల‌స్యం అవుతున్నాయ‌ని చెప్పారు.

సభ్య సమాజం వీరినుంచి ఏం నేర్చుకోవాలి?

  • డార్క్ హ్యూమర్ పేరుతో చెత్తవాగుడు
  • రణ్‌ వీర్ అలహాబాదియాపై కేసు నమోదు
  • ఇండియాస్ గాట్‌ టాలెంట్‌ షోలో పాల్గొన్నఅందరిపైనా
  • పార్లమెంటుకు చేరిన వ్యవహారం
  • ముంబై, ఒడిషాలలో కేసుల వెల్లువ
  • సారీ చెప్పిన రణ్‌ వీర్ అల్ఘా బాదియా
  • సీరియస్ గా పరిగణించిన శివసేన ఎంపీ

డార్క్ హ్యూమర్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్లు వేస్తున్న వెకిలి వేషాలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం సంస్కారం లేకుండా వావి వరసలు లేకుండా జోకులు, హాస్యం పేరుతో వారు చేస్తున్న కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా, అసభ్యకరంగా ఉంటున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం. అయినా ఇన్‌ ఫ్లుయెన్షర్ల తీరు మారటం లేదు. ఈసారి రణ్‌వీర్ అల్హాబాదియా అనే ఇన్‌ ఫ్లుయెన్షర్ అదే రకపు చవకబారు జోకులేసినందుకు అస్సాం పోలీసులు అతగాడిపై ఎఫ్‌ ఐ ఆర్ నమోదు చేశారు.

ఇండియాస్ గాట్‌ టాలెంట్‌ అనే రోస్ట్ షోలో డార్క్ హ్యూమర్ పేరుతో వేసిన ఓ జోకు ఇప్పుడు అతగాడు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు కారణమవుతోంది. 31 ఏళ్ల రణ్‌ వీర్ ఓ పోడ్ కాస్టర్, యూ ట్యూబర్ కూడా. పేరొందిన ఇన్‌ ఫ్లుయెన్సర్… రణ్‌ వీర్ ఆ వెంటనే సారీ చెప్పినా ఈ వివాదం ముదిరి పార్లమెంటు దాకా వెళ్లి ఇప్పుడు అతడి పీకకు చుట్టుకుంటోంది.

షోలో పాల్గొన్న టీమ్‌ అందరిపైనా కేసులు

ఇండియాస్ గాట్ టాలెంట్‌ షోలో జడ్జిలుగా వ్యవహరించిన ఆశీష్ చంచలానీ, హాస్య చతురత పండించే జస్ ప్రీత్ సింగ్‌, మఖీజా, రైనా, ఇంకా ఇతరులపైనా అసభ్యతను ప్రమోట్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదైంది.

వివాదాస్పదమైన కామెంట్..

ఈ టీమ్‌ లో ఉన్న రణవీర్‌ ఓ కంటెస్టెంట్‌ పై తల్లి దండ్రుల సెక్స్ కార్యకలాపాలను రోజూ చూస్తూ ఊరుకోడమేనా? నీవుకూడా పేరెంట్స్ తో సెక్స్ లో పాల్గొని వారి దుకాణం బంద్ చేసేదేమైనా ఉందా అంటూ అత్యంత అసభ్యకరంగా కామెంట్‌ చేశాడు. ఇది వివాదంగా మారింది. వస్తున్నవ్యతిరేకతను చూసి ఆవెంటనే రణ్‌ వీర్ సారీ చెప్పాడు. జోకు వేయాలన్న ఆతృతతో అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పాడు. జరిగిన ఘటనను సమర్ధించుకునే ఉద్దేశం నాకు లేదు. నా ప్లాట్‌ ఫామ్ ఈరకమైన రచ్చకు దారి తీస్తుందని ఊహించలేదు. జడ్జిమెంట్‌ లో విచక్షణ కోల్పోయాను. అలా అని ఉండాల్సింది కాదంటూ రణ్ వీర్ వివరణ ఇచ్చాడు.

వెల్లువెత్తిన వ్యతిరేకత..

ఇది వైరల్‌ గా మారి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అనేకమంది ఎంపీల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అల్హా బాదియాను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ముందుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసే అంశం పరిశీలిస్తున్నారు. రణ్‌ వీర్ కు కోట్లాది మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆ షోలో పలువురు ఎంపీలు కూడా గతంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ రణ్‌ వీర్ కు అవార్డు కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి సామాజిక బాధ్యత లేకుండా ఇంత అసభ్యకరంగా ఇలాంటి జోకులేయడం దిగజారుతున్న నైతిక విలువలకు నిదర్శనం. దీనిపై తప్పనిసరిగా ఎథిక్స్ కమిటీ ముందు అతనిని హాజరు పరచాల్సిందేనన్నారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. సమాచార, ఐటి మంత్రిత్వ శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలైన తాను దీనిని ఉపేక్షించేది లేదని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.

ఫిర్యాదుల వెల్లువ

ఈ షోలో పాల్గొన్న టీమ్ అందరిపైనా అటు ముంబైలోనూ, ఇటు అస్సాం లోనూ కూడా కేసులు నమోదయ్యాయి.ముంబైలో రణ్‌ వీర్ పై కుప్పలుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రణ్‌ వీర్‌ కు 4.5 మిలియన్ల ఇన్‌స్టా గ్రామ్ సబ్ స్క్రైబర్లు,1.05 కోట్ల మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. రణ్‌ వీర్‌ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అభ్యంతరం తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్చ ఉంది కదాని ఇలా లిమిట్స్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దెబ్బకు ఇదే షోలో పాల్గొనేందుకు అనుమతులిచ్చిన వారంతా వెనక్కు తగ్గారు. తాము రాబోవడం లేదని స్టాండప్ కామెడియన్లు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలని సింగర్ బి. ప్రాక్ అన్నారు.

తీరు మారని ఇన్‌ ఫ్లుయెన్షర్లు..

సోషల్‌ మీడియాలో పోడ్ కాస్టర్లు, ఇన్‌ ఫ్లుయెన్సర్లను కోట్లాది మంది ఫాలో అవుతూ ఉంటారు.. వారు చేసే ప్రతీ కామెంట్‌, ప్రతీ వాక్యం, ప్రతీ షో ఎంతో జాగ్రత్తగా చేయాలి. కానీ డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ పేరుతో ఈ దారుణమైన కల్చర్ పెడధోరణలు పడుతోంది.గతంలో ఓ ఐఏఎస్ కుమారుడైన హనుమంతు అనే ఇన్‌ ఫ్లుయెన్సర్ ఇలాంటి అసభ్యకరమైన చెత్త వాగుడే చేశాడు. తండ్రీ,కూతుర్ల అనుబంధానికి  సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఓ వీడియోలో ముక్కుపచ్చలారని ఆ పాపకి, తండ్రికి మధ్య అసహజ బంధం కల్పించి సభ్య సమాజం నివ్వెరపోయేలా అత్యంత జుగుప్పాకరమైన కామెంట్లు చేయడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. హన్మంతుపై కేసు బుక్ చేయడం నిందితుడిని కటకటాల పాల్జేయడం జరిగాయి. అలాగే స్టాండప్ కమెడియన్ మునావర్‌ ఫారుఖీ కూడా ఇలాంటి ఘాటైన, మోటైన జోకులు వేయడంలో సిద్ధహస్తుడు. ఆయన హైదరాబాద్‌ షోను బీజేపి నేతలు అడ్డుకోవడంతో ఆయన ఈవెంట్‌ కాన్సిల్‌ చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.

ఇదేం హాస్యం?

కోట్లాది మంది చూసే ప్రజాదరణ కలిగిన షోస్ లో హాస్యం పేరుతో, డార్క్ హ్యూమర్ పేరుతో ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేస్తే ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో  సోషల్‌ మీడియా ఇన్ ఫ్లుయెన్సరందరూ ఆలోచించుకోవాలి. డిగ్రేడెడ్, చవక బారు హాస్యం.. వారిలో విశృంఖల, అనైతిక ఆలోచనలకు నిదర్శనం కాదా? వీరినుంచి సభ్యసమాజం ఏం నేర్చుకోవాలి? సైబర్‌ చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లనే ఇలాంటి దుష్ట సంస్కృతి పెచ్చరిల్లుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

కుంభమేళ వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వాహనంలో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు ఉన్నారని ప్రాథమిక సమాచారం.

హైదరాబాద్ నాచారానికి చెందిన భక్తులు కొద్దిరోజుల క్రితం కుంభమేళాకు పయనమయ్యారు. ఆ మినీ బస్సులో 14 మంది ప్రయాణిస్తున్నారు. కుంభమేళ ప్రయాగరాజ్(అలహాబాద్) నుండి తిరుగు ప్రయాణంలో మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 గంటల పది నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుంది.

వంతెనపై లారీని తప్పించబోయిన యాత్రికుల టెంపో ట్రావెలర్ అదుపు తప్పిందని స్థానికులు చెపుతుండగా… లారీ అదుపు తప్పటం వల్లే టెంపో ట్రావెలర్ ప్రమాదానికి గురైందనే వాదన ఉంది.

టెంపో ట్రావెలర్ లో ఏడుగురు మృతి చెందారని సమాచారం. మరో ఆరుగురికి గాయాలైనట్టు తెలుస్తున్నాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ట్రీట్మెంట్ జరుగుతోందని… వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పారిస్‌లో ఫుల్ బిజీగా ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పారిస్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నారనే చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు పారిస్‌ వెళ్లిన ప్రధాని కీలకమైన దేశాధినేతలను కలుస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ముచ్చటించారు. పారిస్‌లో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహిస్తున్నారు మోదీ. భారత్, ఈయూ దేశాలు డెవలప్‌మెంట్‌తో పాటు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు ఏఐ విషయంలో జాయింట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు.

ఈ మధ్య డీప్‌సీక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అలాంటి సమయంలో ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పారిస్‌లో మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి ఇండియన్ కమ్యూనిటీ మోడీకి ఘనస్వాగతం లికారు. ఇక ఈ పర్యటనలో ఇండియా-ఫ్రాన్స్ సీఈఓ ఫోరమ్‌తో మోదీ భేటీ కానున్నారు. అంతేకాదు భారత్-ఫ్రాన్స్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి.

హమాస్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్.. లేదంటే నరకమే..

బందీల విడుదల ఆలస్యం చేస్తాం.. ఎందుకంటే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. ఇది హమాస్ చేసిన ప్రకటన. అయితే దీనికి ఇజ్రాయెల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. శనివారం నాటికి హమాస్‌ ఇజ్రాయెల్ బంధీలను రిలీజ్ చేయాల్సిందే. లేదంటే హమాస్ ఎప్పుడూ చూడని దాడులను చూడాల్సి వస్తుంది అంటూ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.

హమాస్ బంధీలను విడుదల చేయడం ఆలస్యం చేస్తామనడం దారుణమైన చర్య.. కానీ శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బందీలను విడుదల చేయాల్సిందే.. లేదంటే వారు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో మాట్లాడుతా.. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోవాలని పిలుపునిస్తా.. ఇది హమాస్‌కు ట్రంప్ ఇచ్చిన అల్టిమేట్ వార్నింగ్.

హమాస్‌ చేతిలో బందీలు ఉన్నారు కాబట్టే ఇజ్రాయెల్ ఇన్నాళ్లు కాస్త ఆచితూచి అడుగులు వేసింది. లేదంటే గాజా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇప్పుడా బాధ్యతను ట్రంప్‌ భుజానికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికా సంగతి అటుంచండి.. ఇజ్రాయెల్‌పై ఈగ వాలినా ఊరుకునేది లేదని చెప్తున్నారు. ఓ వైపు గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వచ్చే సమయంలో గాజాను స్వాధీనం చేసుకుంటామన్నారు. అవసరమైతే అమెరికా దళాలు అక్కడ దిగుతాయన్నారు. గాజాను పునర్మిస్తామంటూనే అక్కడికి పాలస్తీనియులు రావొద్దని చెబుతున్నారు. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే మిడిల్ ఈస్ట్‌లో ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.

ఇక యూకే వంతు.. అక్రమ వలసదారులకు చెక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అక్రమ వలసదారులకు చెక్ పెడుతున్నారు. అక్రమంగా వచ్చే వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి సొంత ఖర్చులతో వారి వారి సొంత దేశాలకు అమెరికా యుద్ధ విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పుడిదే విధానాన్ని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతోంది యూనైటెడ్ కింగ్‌డమ్. దేశంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారో లెక్క తెలుస్తూ అరెస్ట్‌ల పర్వం మొదలు పెట్టింది.

అక్రమ వలసదారులను గుర్తించేందుకు ముఖ్యంగా ఇండియన్‌ రెస్టారెంట్స్‌పై ఫోకస్ చేసింది యూకే. జనవరిలో 828 ప్రాంతాల్లో తనిఖీలు చేసి 609 మందిని అరెస్ట్ చేశారు బ్రిటన్ పోలీసులు. తనిఖీల విషయంలో గతేడాది జనవరితో పోలిస్తే 48 శాతం ఎక్కువ. ఇక అరెస్టుల విషయానికి వస్తే ఏకంగా 73 శాతం అధికం. ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కార్‌ వాష్‌ సెంటర్లపై ఫోకస్ చేశారు అధికారులు. అంతేకాదు ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో ఏకంగా ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి.. అందులో నలుగురిని ఇండియాకు కూడా పంపించివేశారు.

ఇకపై బ్రిటన్‌లో అక్రమవలసదారులకు చెక్ పెడతామన్నారు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్. దీని కోసం# ఏకంగా ఓ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లు భద్రతా సిబ్బందికి మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. అంతేకాదు అక్రమ వలసదారులను పనిలో పెట్టుకునే యజమానులపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది యూకే. అక్రమంగా చొరబడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. అదే సమయంలో ఇలా రావడం.. ఇక్కడ పనులు చేయడం దేశ రక్షణకు, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు అక్కడి అధికారులు. గతేడాది ఇంగ్లిస్‌ ఛానల్ దాటి 38 వేలకు పైగా మంది బ్రిటన్‌లోకి వచ్చారని.. ఈ ప్రయాణ సమయంలో 70 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు 4 వేల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com