31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 223

శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

శివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోనూ చాలా వరకు ఆలయాలున్నాయి. ఈ క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశo నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాది శివరాత్రి నిర్వహణా అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రధానoగా క్యూ మేనేజ్ మెంట్, మంచి నీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల నుండి మంత్రి సురేఖ వివరాలు సేకరించారు. మహాశివరాత్రి నేపథ్యoలో శైవ క్షేత్రాలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, వరంగల్ డిసి సంధ్యారాణి, ఆర్జేసీ రామకృష్ణ, హైదరాబాద్ డీసీ కృష్ణ ప్రసాద్, జిల్లా అసిస్టెంట్ కమిషర్లు, అన్ని ప్రముఖ శివాలయాల ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మళ్లీ ప్లాట్ల విక్రయానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ – ఈసారి సామాన్యులకూ అందుబాటులో ప్లాట్లు

హైదరాబాద్ సిటీతో పాటు.. నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లను విక్రయించేందుకు మరోసారి హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పలు ప్రాంతాల్లో విలువైన ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేసింది. ప్రధానంగా కోకాపేట, మోకిలా, తొర్రూర్, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌లో భూములను వేలం వేసింది. ఈ వేలంలో కోకాపేటలోని భూములు రికార్డు స్థాయి ధర పలికాయి. కోకాపేటో ఏకంగా ఎకరం భూమి విలువ రూ.100 కోట్లు ధర పలికింది. అయితే, అప్పట్లో తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ వెంచర్ వేసింది. అందులోని కొన్ని పాట్లు అమ్ముడుపోయాయి. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికాయి. అయితే, తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలామంది చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం ఈ లే అవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కోకాపేట తదితర ప్రాంతాల్లో భూములు రికార్డు ధర పలకటం వెనక కుట్ర ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రైవేటు భూములు ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ధరలు పెంచేందుకు ఆన్‌లైన్‌లో అధిక ధరకు కోట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆయా ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలానికి సంబంధించి ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఎండీఏ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్‌పై మార్కెట్‌లో స్తబ్దత నెలకొనడంతో ఆ ప్రభావం వేలంపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు రూ.20 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కొన్ని లే అవుట్లలో ప్లాట్లు విక్రయించగా.. అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు రద్దు చేశారు. ఇలాంటి ప్లాట్లను ఇప్పటివరకు 500 వరకు గుర్తించగా.. వీటిని విక్రయించి రూ.1000 కోట్లు ఆర్జించాలని ఫ్లాన్ చేస్తోంది హెచ్‌ఎండీఏ. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్‌ పుంజుకుంటుండగా.. పూర్తిస్థాయిలో ఊపు వచ్చిన తర్వాత వేలం వేస్తే మంచి డిమాండ్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రధానంగా ప్రభుత్వం వేలం వేసే భూములతో సమస్య ఉండదు. చిక్కులేమీ లేకుండా.. క్లియర్‌ టైటిల్‌తో ఉంటాయి. దీంతో, మార్కెట్‌ ధరకు కొనుగోలు చేసినా నష్టమేమీ లేదనుకుంటారు. అయితే, ప్రభుత్వాలు వేలం వేసే భూములు పరిమితంగా ఉంటాయి. పైగా.. వేలం వేసిన భూములు కొందామన్నా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంటాయి. ప్లాట్ల విస్తీర్ణం పెద్దగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనేందుకు అనువుగా ఉంటాయన్న పేరుంది. అయితే, ఈసారి వేలం ప్రక్రియ నిర్వహిస్తే.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్‌ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మార్చి ఒకటో తేదీన ఈ వేలం ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. హైద‌రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్లాట్ల‌ను వేలం వేయ‌డానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. వంద శాతం చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ప్లాట్ల‌ను కొన్న‌వారు.. సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొంద‌డానికి అవకాశం ఉంటుంది.

వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తు…డిప్యూటీ సీఎం భట్టి

అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడవద్దు

1912 నెంబర్ వినియోగదారులందరికీ చేరాలి

ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి పురస్కారాలు

విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యవసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అన్నారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు, వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అన్నారు.

విద్యుత్ శాఖలో లైన్మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని వారు స్పందించని పక్షంలో ఆపై అధికారికి అలా నాకు కూడా ఫోన్ చేయవచ్చని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. మీకు క్షేత్రస్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం, ఏదైనా అడగవచ్చని అధికారులకు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చాం, మార్చి మొదటి తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గత మూడు సంవత్సరాలుగా సబ్ స్టేషన్ లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.

బాగా పని చేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు సైతం ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అటువంటివారిని గుర్తించాలని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన అవసరమని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన డయల్ 1912 కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ నెంబర్ కు 1912 ఎస్ఎంఎస్ చేయాలని, కరెంటు బిల్లు పైన సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని ఆదేశించారు. ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిబ్బంది సంఖ్య పెంచడం, సాంకేతికంగా అదనపు హంగులు కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్టోర్స్ లో అందుబాటులో ఉన్న సామాగ్రి, రాబోయే రోజుల్లో డిమాండ్కు తగిన విధంగా చేసుకుంటున్న ఏర్పాట్లపై వివిధ విభాగాల్లో ఉన్న సీఈలతో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. గత ఏడాదికి వస్తున్న సమస్యల్లో తేడాలు, ఫిర్యాదులు తగ్గడానికి చేపట్టిన చర్యలను అధికారుల ద్వారా డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి మందకృష్ణ అభినందనలు

సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మందకృష్ణ మాదిగ భేటీ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను అభినందించిన మందకృష్ణ మాదిగ. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ మాదిగ ప్రకటించారు.

హైదరాబాద్, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు మందకృష్ణ మాదిగ వివరించగా…రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

శ్రీశైలం భక్తుల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు

అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా అటవీ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మాసంతానికి సాధించిన ప్రగతి… మిగిలిన రెండు మాసాల్లో అమలుపరచాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఆ శాఖ స్పెషల్ సిఎస్ జి అనంత రాము ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. శైవ క్షేత్రాలు ఎక్కువగా అటవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయని, అటవీ మార్గం ద్వారా ఆ దేవాలయాలకు వెళ్లే భక్తులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాగా ఈ విషయంలో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. భక్తులు ఎవరికీ ఇబ్బంది కలిగించడానికి వీలులేదని, అందుకు తగ్గట్టుగా తక్షణమే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు తగిన స్థాయిలో గ్రీనరీని పెంచాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పలు నగరాలను, పట్టణాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దే విషయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తగు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా దేశంలోని పలు రాష్ట్రాలు కాలుష్య నియంత్రణకు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్లను పరిగణలోకి తీసుకొని లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో కాంటూర్ ట్రెంచెలను పెద్ద ఎత్తున నిర్మించేందుకు ఎన్ ఆర్ జి ఎస్ నిధులను వినియోగించు కోవాలన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఏనుగుల బెడదను నివారించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక నుండి ఏనుగులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఆ ప్రక్రియను వేగవంతం చేసే అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు.

వేసవిలో పొంచి ఉన్న నీటి కష్టాలు

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగర వాసులను నీటి కష్టాలు వెంటాడటం పరిపాటిగా మారింది. యేటి కేడు భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈసారి కూడా సమ్మర్‌లో నీటి కష్టాలు తప్పేలా లేవన్న చర్చ నడుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాదికంటే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. గ్రేటర్‌ పరిధిలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలను తెలంగాణ ప్రభుత్వ భూగర్భ జల వనరులశాఖ విశ్లేషించింది. ఈ విశ్లేషణలో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గత యేడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్లు తక్కువకు పడిపోయినట్లు తేలింది. నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో భూగర్భ నీటి జాడలు విశ్లేషించగా.. 33 ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గాయి. 2024 జనవరి కంటే జలాలు అడుగంటిపోగా.. మరో 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు వెల్లడయ్యింది. జనవరి చివరి నాటికి నగరంలో సగటున 9.46 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శివారు ప్రాంతాల్లో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి. మెయిన్ సిటీలో మాత్రం గణనీయంగా తగ్గాయి. 2024 డిసెంబర్‌, ఈ ఏడాది జనవరి చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 0.58 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గినట్లు గుర్తించారు. రికార్డు స్థాయిలో కూకట్‌పల్లి ప్రాంతంలో 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఆ తర్వాత స్థానంలో 24.71 మీటర్ల లోతుతో మల్కాజిగిరి రెండో స్థానంలో ఉంది. 20.08 మీటర్లతో ఎస్సార్‌ నగర్‌ మూడో స్థానంలో ఉంది. ఈ ప్రాంతాలతో పాటుగా.. ఎర్రగడ్డ, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభీపూర్, చెంగిచెర్ల, చాంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, గుండ్ల పోచంపల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లలో పదిమీటర్లు కంటే ఎక్కువ లోతున భూగర్భ జలాలు పడిపోయినట్లు తేలింది. ఫిబ్రవరి నెలలోనే భూగర్భ జలాలు ఇంత లోతులో ఉంటే.. ఎండలు ముదిరితే మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణలు అంటున్నారు. వీటిని బట్టి ఈసారి నగరవాసులకు నీటి కష్టాలు తప్పేలా కనిపించటం లేదని చెబుతున్నారు.

బ్యాంకుల్లో ఉపయోగించని ఖాతాల్లో 78వేల కోట్ల రూపాయలు

దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు వృథాగా పడి ఉన్నాయి. అంటే ఈ డబ్బుకు హక్కుదారుడు లేడు. కొన్నేళ్లుగా మురిగిపోయిన బ్యాంకు ఖాతాల్లో ఈ అన్‌ క్లెయిమ్డ్‌ మనీ పెద్ద మొత్తంలో నిల్వ ఉంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా క్లెయిమ్ చేయని డబ్బు నిల్వలు పేరుకుపోయాయి. ప్రతి యేటా ఈ అన్‌క్లెయిమ్స్ మనీ పెరిగిపోతూనే ఉంది. ఇలా.. పెరిగిపోయిన ఈ డబ్బు విలువ మొత్తం 78వేల కోట్ల రూపాయలకు చేరింది.

బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ మనీ బ్యాలన్స్‌ భారీగా పేరుకు పోవడంతో ఆర్‌బీఐ స్పెషల్ క్యాంపెయిన్‌ ప్రారంభించింది. దీని ద్వారా అకౌంట్‌ హోల్డర్లను గుర్తించి, వాళ్లకు సంబంధించిన డబ్బులను క్లెయిమ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఓ వెబ్‌ పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆయా బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాదారుల వివరాలు ఆ పోర్టల్‌లో చేర్చింది. బ్యాంకుల వారీగా వివరాలు పొందుపర్చింది. ఆ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయగానే.. ఏదైనా బ్యాంకులో మనకు సంబంధించిన ఖాతాలో అన్‌క్లెయిమ్స్‌ మనీ ఉంటే తెలిసిపోతుంది. మనవే కాదు.. మన తండ్రులు, తాతలు, బంధువులకు సంబంధించిన ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్‌ మనీ ఉన్నా ఆ వివరాలు ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ఈ వివరాలు తెలుసు కోవాలంటే పోర్టల్‌లో అడిగిన వివరాలు మనం ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఏంటీ అన్‌ క్లెయిమ్డ్‌ మనీ ?

చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తుంటారు. కుటుంబసభ్యులకు కూడా కొన్ని సార్లు వాటి వివరాలు తెలియవు. వాళ్లు చనిపోయిన తర్వాత వివరాలు ఎవరికీ తెలియక పోవడంతో మెచ్యూరిటీ అయినా.. ఆ డబ్బులు అలాగే బ్యాంకు అకౌంట్‌లో ఉండిపోతాయి. మరికొంత మంది ఆయా బ్యాంకుల్లోని కొన్ని స్కీముల్లో డబ్బులు కట్టి మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. వాటిగురించి ఇక పట్టించుకోరు, కొందరేమో మర్చిపోతారు. ఇంకొంత మంది అయితే, గతంలో వాడుకున్న బ్యాంకు అకౌంట్లను క్లోజ్‌ చేయకుండా అలాగే వదిలేస్తారు. ఇలాంటి అకౌంట్లలో కొంత డబ్బు బ్యాలన్స్‌ ఉండి ఉంటుంది. ఇదే క్రమంలో ఉద్యోగాలు చేసేవాళ్లు.. కంపెనీలు మారినప్పుడల్లా కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేస్తారు. ఆయా కంపెనీల నిబంధనల ప్రకారం అది అనివార్యమవుతోంది. అలాంటప్పుడు పాత బ్యాంకు అకౌంట్లను చాలా మంది అలాగే వాడకుండా వదిలేస్తుంటారు. వాటిని క్లోజ్‌ చేయకపోవడంతో ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు బ్యాంకు నిల్వల్లో చేరిపోతాయి. అలాగే, కొందరు బ్యాంకుల్లో లాకర్లు తీసుకొని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసి మర్చిపోతుంటారు. ఇలా అనేక రకాలుగా బ్యాంకుల్లో అకౌంట్లు, ఆ అకౌంట్లలో అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ భారీగా పేరుకుపోయాయి. ఇలా బ్యాంకుల్లో ఉపయోగంలో లేని అకౌంట్లలో ఉన్న డబ్బు 78వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది.

ఇటీవలే అన్ని బ్యాంకుల్లోనూ ఇలాంటి అన్‌ క్లెయిమ్డ్‌ సొమ్మునంతా రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్కకట్టింది. ఆ అన్‌ క్లెయిమ్డ్‌ డబ్బలకు సంబంధించిన యజమానుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వివిధ బ్యాంకుల్లో జమ చేసిన ఈ అన్‌క్లెయిమ్డ్‌ డబ్బులు మొత్తం యేటికేడు పెరుగుతూ వస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ డబ్బులు రూ.39,264 కోట్లుగా ఉంటే.. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.48,262 కోట్లకు పెరిగింది. ఇక, ఇప్పుడు ఇది కాస్తా 78 వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది.

ఇలా అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ లెక్కలు తీసిన రిజర్వ్‌ బ్యాంక్‌.. ఏయే రాష్ట్రాల్లో ఇలాంటి సొమ్ము ఎక్కువగా ఉందో గుర్తించింది. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే ఎనిమిది రాష్ట్రాలపై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టింది. కేంద్ర బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం, క్లెయిమ్ చేయని డబ్బుల్లో ఎక్కువ భాగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్‌లోని బ్యాంకుల్లో ఉంది.

అన్‌ క్లెయిమ్డ్‌ మనీ తిరిగి పొందడం ఎలా?

ఈ నేపథ్యంలోనే క్లైయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ డబ్బులు ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా సూచనలు చేసింది. వినియోగదారులు ముందుగా UDGAM పోర్టల్‌ని ఓపెన్‌ చేయాలి. దీని కోసం udgam.rbi.org.in పోర్టల్‌కి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయండి. అప్పుడు బ్యాంకు అకౌంట్‌ హోల్డర్‌ పేరు, బ్యాంక్ పేరు, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి వివరాలను ఎంటర్‌ చేయాలి. ఒకవేళ మీ పేరుతో ఉన్న అకౌంట్‌లో అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ ఉన్నట్లు గమనిస్తే.. సంబంధిత బ్యాంకులో సంప్రదించాలి. బ్యాంకులో మీ వివరాలు ఇవ్వగానే బ్లాక్‌ అయిన ఖాతాను రీ ఓపెన్‌ చేసి మీకు సంబంధించిన అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ను తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే మీ కొత్త బ్యాంక్‌ అకౌంట్‌కు ఆ డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఈ పోర్టల్‌లో కేవలం బ్యాంకుల్లో బ్లాక్ అయిన ఆన్ క్లెయిమ్డ్ మనీ గురించి మాత్రమే కనిపిస్తుంది.

ఒంటరి వ్యూహాలు ఫలిస్తాయా?

  • ఢిల్లీలో ఓడినా… అడుగు ముందుకే…
  • ఒంటరి పోటీలకే కాంగ్రెస్ మొగ్గు
  • ఢిల్లీలో గణనీయంగా పెరిగిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు
  • రెండు సీట్లు గెలుపు అంచుల దాకా వచ్చి చేజారిన వైనం
  • కేజ్రీవాల్‌ ఓటమికి కాంగ్రెస్ తీరే కారణం
  • ఇక బెంగాల్‌ పై రాహుల్ దృష్టి..
  • పాద యాత్రకు సన్నాహాలకు ఆదేశాలు
  • మమతను నియంత్రిస్తే కూటమిపై పట్టు
  • రాహుల్‌ తీరు కాంగ్రెస్ కి కలిసొస్తుందా?

అదీ తెగదు.. ముడీ పడదు అన్నట్లుగా ఉంది.. కాంగ్రెస్ పరిస్థితి..ఢిల్లీ ఎన్నికలలో జీరో సీట్లు సాధించినా ఆ పార్టీ ఇంకా ఏకాకిగానే అడుగుముందుకు వేస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ దృష్టి బెంగాల్‌ పై పడింది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మమతా దీదీని టార్గెట్‌ చేస్తూ ఏకంగా పాదయాత్రను సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయమంటూ ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ అయిపోయాయి. ఇండియా కూటమిలో విపక్షాల జోరు అధికం కావడం, కూటమి బాధ్యతలు తీసుకునేందుకు కాంగ్రెస్ కు ఏ రాష్ట్రంలోనూ గొప్పగా బలం లేకపోవడంతో మిత్రుల ఆధిక్యతను కట్టడి చేసే వ్యూహంతోనే అడుగులేస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ముఖా ముఖీ పోటీ చేసి తాను మునిగి, మిత్రపక్షమైన ఆప్‌ ను కూడా ముంచేసిన కాంగ్రెస్ కూటమిలో ఓ ప్రత్యర్ధిని చావుదెబ్బతీసి అణిగి ఉండేలా చేశామని సంబర పడుతోంది. ఇక ఇండియా కూటమిలో గట్టిగా స్వరం వినిపించే మమతా దీదీని ఇప్పుడు రాహుల్ టార్గెట్‌ చేశారు. బెంగాల్‌ లో కాంగ్రెస్ బలపడి అనుకున్నన్ని సీట్లు గెలిస్తే మమతా దీదీ కచ్చితంగా తమ మాటను ఆమోదించక తప్పదని రాహుల్‌ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రేరణ ఢిల్లీ ఎన్నికల్లో పెరిగిన కాంగ్రెస్ ఓట్లు. అక్కడ, ఓటు బ్యాంకు గణనీయంగా మెరుగు పడిందని భావిస్తున్న కాంగ్రెస్ అదే స్ట్రాటజీని బెంగాల్‌ లోనూ అప్లయ్ చేసే ఉద్దేశంతోనే అక్కడ పాద యాత్రకు అడుగులేస్తోంది. దీనిని బట్టి చూస్తే మిత్రులతో కలవకుండా ఒంటరి పోటీ చేసి ఓటు బ్యాంకును పదిల పరచుకోవడం ద్వారా మిత్ర పక్షాల ఆధిక్యతకు, ఇండియా కూటమిలో పెరుగుతున్న ధిక్కార స్వరాన్ని కంట్రోల్ చేయచ్చని కాంగ్రెస్ భావిస్తోందా?  రాహుల్‌ ఆలోచనలు ఇలాగే ఉన్నాయి.

రెండు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఏఐసిసి యువజన  వ్యవహారాల బాధ్యత నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగిన రాహుల్‌ మీద ఇప్పటికీ ధైర్యంగా బాధ్యతలు చేపట్టి పార్టీని నడిపించలేరన్న విమర్శలున్నాయి. అధికారాన్ని ఏకపక్షంగా కట్టబెట్టినా తాను స్వీకరించనని కాడి దింపేసిన రాహుల్ ఎప్పటికైనా కాంగ్రెస్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడాలని, దీనివల్ల ఎన్నికల్లో ఓడిపోయినా, భవిష్యత్తులో గట్టిగా బలపడుతుందని నమ్ముతున్నారు. తన సన్నిహితులతో తరచుగా చేసే కామెంట్‌ కూడా అదే. అయితే సంకీర్ణ రాజకీయాల అనివార్యత వల్ల యూపీఏ ఏర్పాటు, పదేళ్ల పాటు దేశాన్ని పాలించే అవకాశం కాంగ్రెస్ కు కలిగాయి.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలహీనపడుతుంటే ఇండియాకూటమి లో భాగస్వామ్య పక్షాలు బలపడటం రాహుల్‌ గమనించారు. దీనివల్ల అతిపెద్ద జాతీయ పార్టీ పేరు కోల్పోవడమే కాక కూటమిలో మిత్రపక్షాల ఒత్తిళ్లకు, డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తోంది. కాంగ్రెస్ లాంటి పార్టీకి కూటమిపై ఆధిపత్యం లేకుండా కేవలం భాగస్వామిగా కూటమి రాజకీయాలు నడపడం సుతరామూ ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైనా.. ఒంటరి పోటీలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదని ఆలోచిస్తోంది. అందుకే బెంగాల్‌ లో కాంగ్రెస్ బలోపేతానికి ఆయన నడుం బిగించినట్టుగా ఉంది. ఉత్తరోత్తరా జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఒంటరి పోరే బెటరని రాహుల్‌ గట్టిగా విశ్వసిస్తున్నారు. సంకీర్ణాలను కాదనలేం కానీ అదేదో ప్రీపోల్‌ అలయెన్స్‌ కంటే పోస్ట్‌ పోల్‌ అలయెన్స్‌ పెట్టుకుంటే మంచిదని… ముందే కూటమి ఏర్పటు చేసుకోవడం వల్ల కాంగ్రెస్‌ అసలు శక్తి ఏంటో తెలియకుండా పోతోందని రాహుల్‌ భావిస్తున్నారు. కానీ అధికారం సాధించలేనప్పుడు పార్టీలో ఎందరు మిగులుతారు అన్న లాజిక్‌ కాంగ్రెస్ అధినేత ఆలోచిస్తున్నారో లేదో మరి..

కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన

భారత రాష్ట్ర సమితి అధ్యకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. కెసిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా వృక్షార్చన పోస్టర్ అవిష్కరించారు. ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.

‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టిన తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినానిక విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తున్నారు…

  • తెలంగాణ బిజెపి అధ్యక్ష ఎంపికపై కసరత్తు పూర్తి
  • ఈటెల వైపే అధిష్టానం మొగ్గు
  • త్వరలోనే అధికారిక ప్రకటన
  • తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు
  • వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీపై నో క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి ప్రకటన రావచ్చని నేతలు భావిస్తున్నారు. నిజానికి ఈ అధ్యక్ష ఎన్నిక ఒక నెల ముందుగానే జరగాల్సి ఉండగా జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయాల్లో కొంత జాప్యం జరగడం వల్ల రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా ఆలస్యమైందని నేతలు అంటున్నారు. కొత్త అధ్యక్షుడితోపాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఒక ప్రచార కమిటీ చైర్మన్ ని కూడా నియమించాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలిసింది అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది.

కొత్త అధ్యక్షులు ఎవరు అనే విషయంపై దాదాపుగా ముఖ్య నేతలకు క్లారిటీ వచ్చినట్లుగా తెలిసింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కే ఈ బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. చాలాకాలం నుంచి ఈటల రాజేందర్ పేరు వినిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో కొన్ని అంశాలు తెరపైకి రావడం… ఇతర విభాగాల కారణంగా ఈ ఎన్నిక విషయానికి సంబంధించి అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది..

కచ్చితంగా రానున్న కాలంలో తెలంగాణలో పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్లే నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రజలు బిజెపి పట్ల ఆసక్తి చూపుతున్న రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదనేది కొందరు వాదన. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్ బీసీ కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఉద్యమ నేతకు ఇచ్చామన్న ఇమేజ్ రావడంతో పాటు అన్ని రకాలుగా పార్టీని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లే బాధ్యత వీటిలకు అప్పగించనున్నారు.

సంఘ పరివార్ నుంచి కూడా ఈటలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా తెలిసింది. బిజెపి ఇప్పటికే కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ఈటెలకి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలిసింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com