వేసవి కాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగర వాసులను నీటి కష్టాలు వెంటాడటం పరిపాటిగా మారింది. యేటి కేడు భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈసారి కూడా సమ్మర్‌లో నీటి కష్టాలు తప్పేలా లేవన్న చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాదికంటే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. గ్రేటర్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలను తెలంగాణ ప్రభుత్వ భూగర్భ జల వనరులశాఖ విశ్లేషించింది. ఈ విశ్లేషణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. గత యేడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్లు తక్కువకు పడిపోయినట్లు తేలింది. నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో భూగర్భ నీటి జాడలు విశ్లేషించగా.. 33 ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గాయి. 2024 జనవరి కంటే జలాలు అడుగంటిపోగా.. మరో 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు వెల్లడయ్యింది. జనవరి చివరి నాటికి నగరంలో సగటున 9.46 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శివారు ప్రాంతాల్లో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి. మెయిన్ సిటీలో మాత్రం గణనీయంగా తగ్గాయి. 2024 డిసెంబర్, ఈ ఏడాది జనవరి చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 0.58 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గినట్లు గుర్తించారు. రికార్డు స్థాయిలో కూకట్‌పల్లి ప్రాంతంలో 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఆ తర్వాత స్థానంలో 24.71 మీటర్ల లోతుతో మల్కాజిగిరి రెండో స్థానంలో ఉంది. 20.08 మీటర్లతో ఎస్సార్ నగర్ మూడో స్థానంలో ఉంది. ఈ ప్రాంతాలతో పాటుగా.. ఎర్రగడ్డ, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభీపూర్, చెంగిచెర్ల, చాంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, గుండ్ల పోచంపల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లలో పదిమీటర్లు కంటే ఎక్కువ లోతున భూగర్భ జలాలు పడిపోయినట్లు తేలింది. ఫిబ్రవరి నెలలోనే భూగర్భ జలాలు ఇంత లోతులో ఉంటే.. ఎండలు ముదిరితే మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణలు అంటున్నారు. వీటిని బట్టి ఈసారి నగరవాసులకు నీటి కష్టాలు తప్పేలా కనిపించటం లేదని చెబుతున్నారు.