24.1 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

బ్యాంకుల్లో ఉపయోగించని ఖాతాల్లో 78వేల కోట్ల రూపాయలు

దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు వృథాగా పడి ఉన్నాయి. అంటే ఈ డబ్బుకు హక్కుదారుడు లేడు. కొన్నేళ్లుగా మురిగిపోయిన బ్యాంకు ఖాతాల్లో ఈ అన్‌ క్లెయిమ్డ్‌ మనీ పెద్ద మొత్తంలో నిల్వ ఉంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా క్లెయిమ్ చేయని డబ్బు నిల్వలు పేరుకుపోయాయి. ప్రతి యేటా ఈ అన్‌క్లెయిమ్స్ మనీ పెరిగిపోతూనే ఉంది. ఇలా.. పెరిగిపోయిన ఈ డబ్బు విలువ మొత్తం 78వేల కోట్ల రూపాయలకు చేరింది.

బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ మనీ బ్యాలన్స్‌ భారీగా పేరుకు పోవడంతో ఆర్‌బీఐ స్పెషల్ క్యాంపెయిన్‌ ప్రారంభించింది. దీని ద్వారా అకౌంట్‌ హోల్డర్లను గుర్తించి, వాళ్లకు సంబంధించిన డబ్బులను క్లెయిమ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఓ వెబ్‌ పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆయా బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ ఖాతాదారుల వివరాలు ఆ పోర్టల్‌లో చేర్చింది. బ్యాంకుల వారీగా వివరాలు పొందుపర్చింది. ఆ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయగానే.. ఏదైనా బ్యాంకులో మనకు సంబంధించిన ఖాతాలో అన్‌క్లెయిమ్స్‌ మనీ ఉంటే తెలిసిపోతుంది. మనవే కాదు.. మన తండ్రులు, తాతలు, బంధువులకు సంబంధించిన ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్‌ మనీ ఉన్నా ఆ వివరాలు ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ఈ వివరాలు తెలుసు కోవాలంటే పోర్టల్‌లో అడిగిన వివరాలు మనం ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఏంటీ అన్‌ క్లెయిమ్డ్‌ మనీ ?

చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తుంటారు. కుటుంబసభ్యులకు కూడా కొన్ని సార్లు వాటి వివరాలు తెలియవు. వాళ్లు చనిపోయిన తర్వాత వివరాలు ఎవరికీ తెలియక పోవడంతో మెచ్యూరిటీ అయినా.. ఆ డబ్బులు అలాగే బ్యాంకు అకౌంట్‌లో ఉండిపోతాయి. మరికొంత మంది ఆయా బ్యాంకుల్లోని కొన్ని స్కీముల్లో డబ్బులు కట్టి మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. వాటిగురించి ఇక పట్టించుకోరు, కొందరేమో మర్చిపోతారు. ఇంకొంత మంది అయితే, గతంలో వాడుకున్న బ్యాంకు అకౌంట్లను క్లోజ్‌ చేయకుండా అలాగే వదిలేస్తారు. ఇలాంటి అకౌంట్లలో కొంత డబ్బు బ్యాలన్స్‌ ఉండి ఉంటుంది. ఇదే క్రమంలో ఉద్యోగాలు చేసేవాళ్లు.. కంపెనీలు మారినప్పుడల్లా కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేస్తారు. ఆయా కంపెనీల నిబంధనల ప్రకారం అది అనివార్యమవుతోంది. అలాంటప్పుడు పాత బ్యాంకు అకౌంట్లను చాలా మంది అలాగే వాడకుండా వదిలేస్తుంటారు. వాటిని క్లోజ్‌ చేయకపోవడంతో ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు బ్యాంకు నిల్వల్లో చేరిపోతాయి. అలాగే, కొందరు బ్యాంకుల్లో లాకర్లు తీసుకొని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసి మర్చిపోతుంటారు. ఇలా అనేక రకాలుగా బ్యాంకుల్లో అకౌంట్లు, ఆ అకౌంట్లలో అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ భారీగా పేరుకుపోయాయి. ఇలా బ్యాంకుల్లో ఉపయోగంలో లేని అకౌంట్లలో ఉన్న డబ్బు 78వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది.

ఇటీవలే అన్ని బ్యాంకుల్లోనూ ఇలాంటి అన్‌ క్లెయిమ్డ్‌ సొమ్మునంతా రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్కకట్టింది. ఆ అన్‌ క్లెయిమ్డ్‌ డబ్బలకు సంబంధించిన యజమానుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వివిధ బ్యాంకుల్లో జమ చేసిన ఈ అన్‌క్లెయిమ్డ్‌ డబ్బులు మొత్తం యేటికేడు పెరుగుతూ వస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ డబ్బులు రూ.39,264 కోట్లుగా ఉంటే.. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.48,262 కోట్లకు పెరిగింది. ఇక, ఇప్పుడు ఇది కాస్తా 78 వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది.

ఇలా అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ లెక్కలు తీసిన రిజర్వ్‌ బ్యాంక్‌.. ఏయే రాష్ట్రాల్లో ఇలాంటి సొమ్ము ఎక్కువగా ఉందో గుర్తించింది. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే ఎనిమిది రాష్ట్రాలపై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టింది. కేంద్ర బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం, క్లెయిమ్ చేయని డబ్బుల్లో ఎక్కువ భాగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్‌లోని బ్యాంకుల్లో ఉంది.

అన్‌ క్లెయిమ్డ్‌ మనీ తిరిగి పొందడం ఎలా?

ఈ నేపథ్యంలోనే క్లైయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ డబ్బులు ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా సూచనలు చేసింది. వినియోగదారులు ముందుగా UDGAM పోర్టల్‌ని ఓపెన్‌ చేయాలి. దీని కోసం udgam.rbi.org.in పోర్టల్‌కి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయండి. అప్పుడు బ్యాంకు అకౌంట్‌ హోల్డర్‌ పేరు, బ్యాంక్ పేరు, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి వివరాలను ఎంటర్‌ చేయాలి. ఒకవేళ మీ పేరుతో ఉన్న అకౌంట్‌లో అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ ఉన్నట్లు గమనిస్తే.. సంబంధిత బ్యాంకులో సంప్రదించాలి. బ్యాంకులో మీ వివరాలు ఇవ్వగానే బ్లాక్‌ అయిన ఖాతాను రీ ఓపెన్‌ చేసి మీకు సంబంధించిన అన్‌ క్లెయిమ్డ్‌ బ్యాలన్స్‌ను తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే మీ కొత్త బ్యాంక్‌ అకౌంట్‌కు ఆ డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఈ పోర్టల్‌లో కేవలం బ్యాంకుల్లో బ్లాక్ అయిన ఆన్ క్లెయిమ్డ్ మనీ గురించి మాత్రమే కనిపిస్తుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com