- ఢిల్లీలో ఓడినా… అడుగు ముందుకే…
- ఒంటరి పోటీలకే కాంగ్రెస్ మొగ్గు
- ఢిల్లీలో గణనీయంగా పెరిగిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు
- రెండు సీట్లు గెలుపు అంచుల దాకా వచ్చి చేజారిన వైనం
- కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ తీరే కారణం
- ఇక బెంగాల్ పై రాహుల్ దృష్టి..
- పాద యాత్రకు సన్నాహాలకు ఆదేశాలు
- మమతను నియంత్రిస్తే కూటమిపై పట్టు
- రాహుల్ తీరు కాంగ్రెస్ కి కలిసొస్తుందా?
అదీ తెగదు.. ముడీ పడదు అన్నట్లుగా ఉంది.. కాంగ్రెస్ పరిస్థితి..ఢిల్లీ ఎన్నికలలో జీరో సీట్లు సాధించినా ఆ పార్టీ ఇంకా ఏకాకిగానే అడుగుముందుకు వేస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ దృష్టి బెంగాల్ పై పడింది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మమతా దీదీని టార్గెట్ చేస్తూ ఏకంగా పాదయాత్రను సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయమంటూ ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ అయిపోయాయి. ఇండియా కూటమిలో విపక్షాల జోరు అధికం కావడం, కూటమి బాధ్యతలు తీసుకునేందుకు కాంగ్రెస్ కు ఏ రాష్ట్రంలోనూ గొప్పగా బలం లేకపోవడంతో మిత్రుల ఆధిక్యతను కట్టడి చేసే వ్యూహంతోనే అడుగులేస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ముఖా ముఖీ పోటీ చేసి తాను మునిగి, మిత్రపక్షమైన ఆప్ ను కూడా ముంచేసిన కాంగ్రెస్ కూటమిలో ఓ ప్రత్యర్ధిని చావుదెబ్బతీసి అణిగి ఉండేలా చేశామని సంబర పడుతోంది. ఇక ఇండియా కూటమిలో గట్టిగా స్వరం వినిపించే మమతా దీదీని ఇప్పుడు రాహుల్ టార్గెట్ చేశారు. బెంగాల్ లో కాంగ్రెస్ బలపడి అనుకున్నన్ని సీట్లు గెలిస్తే మమతా దీదీ కచ్చితంగా తమ మాటను ఆమోదించక తప్పదని రాహుల్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రేరణ ఢిల్లీ ఎన్నికల్లో పెరిగిన కాంగ్రెస్ ఓట్లు. అక్కడ, ఓటు బ్యాంకు గణనీయంగా మెరుగు పడిందని భావిస్తున్న కాంగ్రెస్ అదే స్ట్రాటజీని బెంగాల్ లోనూ అప్లయ్ చేసే ఉద్దేశంతోనే అక్కడ పాద యాత్రకు అడుగులేస్తోంది. దీనిని బట్టి చూస్తే మిత్రులతో కలవకుండా ఒంటరి పోటీ చేసి ఓటు బ్యాంకును పదిల పరచుకోవడం ద్వారా మిత్ర పక్షాల ఆధిక్యతకు, ఇండియా కూటమిలో పెరుగుతున్న ధిక్కార స్వరాన్ని కంట్రోల్ చేయచ్చని కాంగ్రెస్ భావిస్తోందా? రాహుల్ ఆలోచనలు ఇలాగే ఉన్నాయి.
రెండు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఏఐసిసి యువజన వ్యవహారాల బాధ్యత నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన రాహుల్ మీద ఇప్పటికీ ధైర్యంగా బాధ్యతలు చేపట్టి పార్టీని నడిపించలేరన్న విమర్శలున్నాయి. అధికారాన్ని ఏకపక్షంగా కట్టబెట్టినా తాను స్వీకరించనని కాడి దింపేసిన రాహుల్ ఎప్పటికైనా కాంగ్రెస్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడాలని, దీనివల్ల ఎన్నికల్లో ఓడిపోయినా, భవిష్యత్తులో గట్టిగా బలపడుతుందని నమ్ముతున్నారు. తన సన్నిహితులతో తరచుగా చేసే కామెంట్ కూడా అదే. అయితే సంకీర్ణ రాజకీయాల అనివార్యత వల్ల యూపీఏ ఏర్పాటు, పదేళ్ల పాటు దేశాన్ని పాలించే అవకాశం కాంగ్రెస్ కు కలిగాయి.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలహీనపడుతుంటే ఇండియాకూటమి లో భాగస్వామ్య పక్షాలు బలపడటం రాహుల్ గమనించారు. దీనివల్ల అతిపెద్ద జాతీయ పార్టీ పేరు కోల్పోవడమే కాక కూటమిలో మిత్రపక్షాల ఒత్తిళ్లకు, డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తోంది. కాంగ్రెస్ లాంటి పార్టీకి కూటమిపై ఆధిపత్యం లేకుండా కేవలం భాగస్వామిగా కూటమి రాజకీయాలు నడపడం సుతరామూ ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైనా.. ఒంటరి పోటీలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదని ఆలోచిస్తోంది. అందుకే బెంగాల్ లో కాంగ్రెస్ బలోపేతానికి ఆయన నడుం బిగించినట్టుగా ఉంది. ఉత్తరోత్తరా జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఒంటరి పోరే బెటరని రాహుల్ గట్టిగా విశ్వసిస్తున్నారు. సంకీర్ణాలను కాదనలేం కానీ అదేదో ప్రీపోల్ అలయెన్స్ కంటే పోస్ట్ పోల్ అలయెన్స్ పెట్టుకుంటే మంచిదని… ముందే కూటమి ఏర్పటు చేసుకోవడం వల్ల కాంగ్రెస్ అసలు శక్తి ఏంటో తెలియకుండా పోతోందని రాహుల్ భావిస్తున్నారు. కానీ అధికారం సాధించలేనప్పుడు పార్టీలో ఎందరు మిగులుతారు అన్న లాజిక్ కాంగ్రెస్ అధినేత ఆలోచిస్తున్నారో లేదో మరి..