– డెలివరీకి అడిక్ట్ అవుతోన్న జనం
– డిసెంబర్ 6 ఫాదర్స్ డే అత్యంత బిజీ డే
– వరుసగా 9వ యేడాది బిర్యానీకే ఫుడ్‌లవర్స్ వోట్
– 2024 రిపోర్ట్ రిలీజ్ చేసిన జొమాటో
జనం ఇన్‌స్టంట్‌కు అలవాటు పడిపోతున్నారు. ప్రతీదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఇంట్లోకి అవసరమైన వస్తువులైనా, నిత్యం ఉపయోగించే సరుకులైనా, చివరకు వంట చేయడం బద్దకం అనిపిస్తే ఆహార పదార్ధాలైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. యాప్‌లలో తమకు ఇష్టమైనవి వెతుక్కొని ఆర్డర్ ఇస్తున్నారు.
గతంలో వీకెండ్స్‌లో సరదాగా బయటకు వెళ్లి హోటల్స్‌లో భోజనం చేసేవాళ్లు. ఇంట్లో వంట చేయకున్నా.. హోటల్‌కెళ్లి పని కానిచ్చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఇంట్లోంచి కదలకుండా నచ్చిన, మెచ్చిన వాటిని ఆర్డర్‌ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఫలితంగా టైమ్ కలిసొస్తుందని, ట్రాఫిక్ బాదరబందీ తప్పుతోందని అంటున్నారు. ప్రధానంగా ఫుడ్ డెలివరీలో స్విగ్గీ, జొమాటో దూసుకెళ్తున్నాయి. అవి పాపులర్ అవుతున్నాయి.
ఈ యేడాది అంటే…2024లో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ మెయిన్ పాయింట్స్‌ను రిలీజ్ చేసింది. ప్రతి యేడాది మాదిరిగానే ఈయేడాది హైలైట్స్ ప్రకటించింది. ఫుడ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయలతో పాటు ప్రజలు ఏయే ఆహార పదార్థాలు ఎక్కువగా తిన్నారో అన్న డేటాను కూడా జొమాటో షేర్ చేసింది. వీటిలో ఈ యేడాది హైలైట్ ఏంటంటే.. బెంగళూరుకు చెందిన ఒకే ఒక వ్యక్తి 2024 త్తంలో ఐదు లక్షల రూపాయల విలువైన ఫుడ్ జొమాటోలో ఆర్డర్ చేశాడు.
జొమాటో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం అనమ్ అనే వ్యక్తి 2024లో జొమాటో నుంచి రూ.5,13,733 ఖర్చు చేశాడు. అంతేకాదు.. 2024లో జొమాటో ద్వారా 1 కోటి కంటే ఎక్కువ టేబుల్స్ రిజర్వ్ చేసుకున్నారట. ఇక, డిసెంబర్ 6న ఫాదర్స్ డే సందర్భంగా తమకు భారీగా ఆర్డర్లు వచ్చాయని జొమాటో తెలిపింది. ఆ ఒక్క రోజే 84,866 మంది తమ తండ్రులతో కలిసి లంచ్ లేదా డిన్నర్‌ను ఎంజాయ్ చేశారని, జొమాటోలో ఆర్డర్లు తెప్పించుకున్నారని వెల్లడించింది. ఇది మాత్రమే కాదు జొమాటో నగరాలకు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. బడ్జెట్ పరంగా ఆర్డర్‌లలో ఢిల్లీ ముందంజలో ఉందని తెలిపింది. బడ్జెట్‌కు అనుకూలమైన ఆహారం విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. జొమాటో ద్వారా ఢిల్లీ వాసులు తమ ఆహార బిల్లులపై ఈయేడాది రూ.195 కోట్లు ఆదా చేసుకున్నారట. ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై వరసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.
ఇక, ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా బిర్యానీ మన దేశంలో అత్యంత ఇష్టమైన వంటకంగా మారిందని జొమాటో రిలీజ్ చేసిన రిపోర్ట్ చెబుతోంది. జొమాటో కస్టమర్లు 2024లో 9,13,99,110 ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేశారు. జొమాటోలో బిర్యానీ తర్వాత, పిజ్జాలు ఎక్కువగా ఆర్డర్ చేశారని వెల్లడించింది. అలాగే 77,76,725 టీ ఆర్డర్‌లు బుక్ అయినట్లు.. ఇక కాఫీ అయితే 74,32,856 ఆర్డర్స్ బుక్ అయినట్లు వెల్లడించింది.