9, 0, 5, 2, 1, 5, 7, 0, 0.. ఇదేదో మొబైల్ నెంబర్ అనుకుంటే మీరు ఖచ్చితంగా పోరపాటు పడినట్టే. ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చేసిన అత్యద్భుతమైన స్కోర్. మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా ఓడింది. చివరి వరకు కనీసం డ్రా కోసమైనా ప్రయత్నిస్తారనుకుంటే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఏదో అత్యవసరమైన పని ఉన్నట్టు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. ఒంటరిగా చివరి వరకు పోరాడిన యశస్వి జైశ్వాల్ కూడా వివాదస్పదమైన నిర్ణయంతో ఔటై పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది. ఆస్ట్రేలియా ఏకంగా 184 పరుగులతో విజయం సాధించింది. ఈ దారుణ ఓటమితో WTC ర్యాంకింగ్స్‌లో తన మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది టీమిండియా. అదే విధంగా ఫైనల్ బెర్త్‌పై ఆశలను కూడా వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది.
కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తాడనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగానే క్రీజులోకి వచ్చి 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే 40 బాల్స్ మాత్రం ఆడి గత ఇన్నింగ్స్‌ల కంటే కాసేపు ఎక్కువగా క్రీజులో ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలో నేనున్నానంటూ వచ్చి చివరి వరకు పోరాడే అలవాటు ఉన్న కోహ్లీ కూడా కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. అది కూడా ఎప్పుడూ ఎలా ఔట్ అవుతాడో.. అలానే హాఫ్ సైడ్ బంతిని ఫేస్ చేయలేక పెవిలియన్ చేరాడు. ఇక కేఎల్ రాహుల్ అయితే డకౌట్.. జడేజా కూడా నిరాశపరిచాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఫాలో ఆన్ ముప్పు తప్పించిన నితీష్ రెడ్డి అయితే కేవలం ఒక పరుగుకే ఔట్ అయిపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన వాషింగ్టన్ సుందర్ కూడా కేవలం 5 పరుగులకే ఔట్ అయపోయాడు. ఇక బౌలింగ్ మ్యాజిక్ చేసిన బుమ్రా, సిరాజ్ డకౌట్ అవ్వడంతో ఆసీస్ డగౌట్‌లో సెలబ్రేషన్స్.. మన డగౌడ్‌లో నిరాశ, నిస్పృహలు.
నిజానికి స్వదేశంలో కివీస్ చేతిలో వైట్‌వాష్‌తో టీమిండియా పతనం ప్రారంభమవ్వగా.. దానిని విదేశంలో కూడా అప్రతిహతంగా కొనసాగిస్తోంది రోహిత్ సేన. టెస్టుల్లో మనల్ని కొట్టేవారు లేరనే స్థాయి నుంచి ఇంతటి పతనాన్ని అస్సలు ఎవ్వరూ ఊహించి ఉండరు. కాలరేగరేసి గెలిచే దగ్గరి నుంచి ఫాలో ఆన్ తప్పించుకుంటేనే సెలబ్రేషన్స్ చేసుకునే స్థాయికి దిగజారిపోయింది టీమిండియా. మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓటమితో WTC ఫైనల్స్ ఆశలు మరింత గల్లంతయ్యాయి. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకోగా.. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా తన ఆశలను మరింత పదిలం చేసుకుంది. సిడ్నీ టెస్ట్‌లో కూడా ఇదే సీన్ రీపిట్ అయితే మాత్రం టీమిండియా WTCపై ఆశలు ఇక పూర్తిగా వదులుకోవాల్సిందే.
సిడ్నీ టెస్ట్‌లో అయినా టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారడం ఖాయం. అంతేకాదు అత్యంత అవమానకరమైన పరిస్థితిలో టీమిండియా సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుంది. ఇది వారి చరిత్రపైనే ఓ మచ్చగా మారిపోవడం ఖాయం.