30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

రూ.300 కోట్ల స్కామ్‌లో తెలంగాణ డీజీపీ, సీఎస్‌ – యూట్యూబర్‌ సంచలన ఆరోపణలు

  • మెట్రో ఎండీ సహా మరో ఆరుగురు ఐఏఎస్‌లకూ వాటా

  • రూ.50వేల కోట్ల స్కామ్‌ను ప్రోత్సహించిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు

  • మెట్రోలో బెట్టింగ్‌ యాప్స్‌ యాడ్‌ల కుంభకోణం

  • యూట్యూబర్‌ అన్వేష్‌ సంచలన ప్రెజెంటేషన్‌

తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌లపై ఓ యూట్యూబర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. చిన్నా చితకా ఆరోపణలు కాదు.. ఏకంగా వీళ్లిద్దరూ కలిసి రూ.300 కోట్లు కొల్లగొట్టారట. వీళ్లకు తోడు.. మరో ఆరుగురు ఐఏఎస్‌లకూ ఈ మూడు వందల కోట్ల రూపాయల్లో వాటా ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపించాడు. నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తోన్న అన్వేష్‌ ఈ దిమ్మదిరిగే ప్రెజెంటేషన్‌ ఇచ్చాడు. అసలు వీళ్లు చేసిన తప్పేంటి? ఏ అంశంలో వీళ్లు తమ అధికారాన్ని వాడుకున్నారు? వీళ్లు ఇచ్చిన గ్రీన్‌ సిగ్నల్‌తో ఎన్ని వేల కోట్లు ప్రజల నుంచి దోపిడీకి గురయ్యాయి? ఫలితంగా వీళ్లకేం ముట్టింది? అంటూ యూట్యూబర్‌ అన్వేష్‌ చెప్పిన విషయాలు చూద్దాం…

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో రైలులో బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న విషయం బయటకు వచ్చింది. దీనిపై న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. దీంతో, మెట్రోలోనూ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ జరుగుతోందన్న విషయం బట్టబయలయ్యింది. దీనిపై కోర్టు కన్నెర్ర జేసింది. అయితే, మెట్రోలో ఈ యాప్‌ల ప్రమోషన్‌ యాడ్స్‌ నిలిపేశామని సింపుల్‌గా న్యాయస్థానానికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని, దీని వెనుక చాలా పెద్ద తతంగమే ఉందని యూట్యూబర్‌ అన్వేష్‌ ఆరోపించాడు. మెట్రో అడ్వర్‌టైజింగ్‌ క్లియరెన్స్‌ కమిటీలో ఉన్న ఎనిమిది మందికి ఇందులో భాగస్వామ్యం ఉందని, వారిలో కీలక పాత్ర డీజీపీ జితేందర్‌ది అని పేర్కొన్నాడు.

ఓ వైట్‌ కలర్‌ చార్ట్‌లో ఈ వివరాలన్నీ రాసుకొని.. ఆ చార్ట్‌ను గోడకు అతికించుకొని.. అన్వేష్‌.. తన యూట్యూబ్‌ వీడియో రికార్డ్‌ చేశాడు. యూట్యూబర్‌ అన్వేష్‌ ఆరోపించినట్లు…

ఆ కమిటీలో ఉన్న వాళ్ల పేర్లు చూస్తే…

  1. ఎన్‌వీఎస్‌ రెడ్డి, మెట్రో ఎండీ
  2. శాంతికుమారి, చీఫ్ సెక్రెటరీ
  3. దాన కిషోర్‌, ఐఏఎస్‌
  4. రామకృష్ణ, ఐఏఎస్‌
  5. వికాస్‌ రాజ్‌, ఐఏఎస్‌
  6. ఇమామ్‌, ఐఏఎస్‌
  7. అహ్మద్‌, ఐఏఎస్‌
  8. డాక్టర్‌ జితేందర్‌, డీజీపీ

పై జాబితాలో ఉన్న వాళ్లందరికీ ఈ రూ.300 కోట్లలో వాటా ఉందన్నాడు అన్వేష్‌. ఎందుకంటే.. వీళ్లు ఇచ్చిన అనుమతుల వల్ల ఒక్క ఫెయిర్‌ ప్లే అనే బెట్టింగ్ యాప్‌ నిర్వాహకులే.. 13వేల కోట్లు ప్రజల నుంచి, యువకుల నుంచి దోచుకున్నారని ఆరోపించాడు. అలాగే, వీళ్లు మెట్రోలో అడ్వర్‌టైజ్‌ చేసిన మరో రెండు యాప్‌లు ఐఎక్స్‌ బెట్‌, ట్రిపుల్‌ సెవెన్‌ బెట్‌ యాప్‌లు కూడా వేల కోట్ల రూపాయలు బెట్టింగ్‌ల పేరుతో ప్రజల నుంచి దోచుకున్నాయని, వాటికి ప్రతిఫలంగానే.. వీరికి రూ.300 కోట్లు ముట్టాయని సెన్సేషనల్‌ ఎలిగేషన్స్‌ చేశాడు. ఈ మూడు యాప్‌లు కలిపి మొత్తం రూ.50వేల కోట్లు కొల్లగొట్టాయని పేర్కొన్నాడు.

అంతేకాదు.. ఈ యాప్‌లపై గత యేడాదే ముంబైలో కేసులు అయ్యాయని, రూ.319 కోట్లు సీజ్‌చేశారని ఈ విషయం కూడా ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు తెలియకుండా ఉన్నాయా? అని ప్రశ్నించాడు. ఇవన్నీ నిషేధిత యాప్‌లని, ఐదేళ్లుగా ఈ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారని అన్వేష్‌ తన యూట్యూబ్‌ వీడియోలో వెల్లడించాడు. ఇది మొత్తం రూ.50వేల కోట్ల స్కామ్‌ అని ఆగ్రహం వ్యక్తం చేసిన అన్వేష్‌.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా మీరు చదివిన చదువులు ఇవేనా? అంటూ ప్రశ్నించాడు. కామన్‌ యూట్యూబర్‌గా తనకు ఉన్న నాలెడ్జ్‌ ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు లేకపోవడం సిగ్గచేటంటూ వ్యాఖ్యానించాడు.

ఐఏఎస్‌లకు అవగాహన లేదా?, ఐపీఎస్‌లకు అవగాహన లేదా? అని ప్రశ్నించిన అన్వేష్‌.. వీళ్లంతా కలిసి దేశాన్ని ముంచుతున్నారంటూ మండిపడ్డాడు. ఇక, హైకోర్టు కన్నెర్ర జేయడంతో బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ గురించి ఐదుగురు అధికారులతో సిట్‌ నియమించారు. అయితే, ఆ సిట్‌పైనా అన్వేష్‌ విమర్శలు గుప్పించాడు. అసలు దొంగే పెద్ద సారు డీజీపీ జితేందర్‌ అయితే, ఆయన దగ్గర పనిచేసే చిన్న చిన్న ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేశాడని.. ఇక, వాళ్లు.. తమ బాస్‌పై ఎలా రిపోర్ట్‌ ఇస్తారని ప్రశ్నించాడు. కోర్టును మభ్యపెట్టేందుకే సిట్‌ వేశారని అన్వేష్‌ వ్యాఖ్యానించాడు.

ఇక, అన్వేష్ చేసిన ఈ యూట్యూబ్‌ ప్రెజెంటేషన్‌ తీవ్ర సంచలనంగా మారింది. కొన్ని అంశాల్లో అవగాహన లేకపోవడం స్పష్టంగా అర్థమయ్యింది. ఐఏఎస్‌ అధికారి దాన కిషోర్‌ పేరును గోడకు అంటించిన కాగితంలో చూసి చదువుతూ దాన కృష్ణ అని అన్నాడు. అలాగే, రామకృష్ణ అని మరో ఐఏఎస్‌ గురించి చెప్పాడు. అంటే.. ఆయన కొత్త సీఎస్‌ రామకృష్ణారావును ఉద్దేశించి పేర్కొన్నాడా? లేదంటే రామకృష్ణ అనే మరో ఐఏఎస్‌ ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రజా ప్రతినిధి అంటారు కదా.. ఈ కేసు వేశారు… అంటూ తన యూట్యూబ్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు అన్వేష్‌.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com