కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారని నాడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేపెట్టి ఆమోదింప చేసినందుకు బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవంగా మీ అభినందనలు రాహుల్ గాంధీకి అందించాలని అన్నారు. ఆయన ఆలోచనల మేరకే కులగణన చేసి బీసీ జనాభా ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 50 శాతాని కి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి… ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి… అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందని అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని అందుకే ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామన్నారు. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేయడమే కాకుండా ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణమని సీయం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నామని తెలిపారు. ఇంతవరకూ జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదని జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుందన్నారు. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చామని చెప్పారు. ఈ లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే ఉన్నారని ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదన్నారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్ లో పడవద్దని ముఖ్యమంత్రి బీసీ సంఘాలకు సూచించారు. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే… పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు… మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా అని బీసీ సంఘం నేతలకు సీయం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.