సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై ఫోకస్ చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో ఆయనకు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టగా.. లెటెస్ట్‌గా మహదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల కేసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ పెద్దలతో సమావేశం కావడానికి ముందే ఈ సోదాలు జరగడం ఓ విశేషమని చెప్పాలి.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు చాలా రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ కేసుల విచారణకు సీబీఐని రంగంలోకి దింపింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి మాజీ సీఎంకు రూ.508 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణలు. యాప్ యజమానిగా భావిస్తున్న శుభమ్ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్ చిక్కుల్లో పడ్డారనే చెప్పాలి. తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించడమే కాక, బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ చేపట్టింది.
అయితే ఈ కేసులకు తాము భయపడేది లేదని చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భూపేశ్ బఘేల్‌ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం పంజాబ్ రాష్ట్ర ఇంచార్జ్‌గా నియమించిందని.. అప్పటి నుంచి కేంద్రానికి భయం పట్టుకుందని.. అందుకే కేసుల పేరుతో ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు రూ.2,295 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మరోవైపు మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ నెల 10న ఈ సోదాలు జరిగాయి. ఈ సాదోఆల్లో రూ.33 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. మద్యం కుంభకోణంలో లబ్ధిదారులకు రూ.2,100 కోట్ల లాభం చేకూరిందని ఈడీ గుర్తించింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడినట్టు గుర్తించింది.