తెలంగాణకు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ కాషాయ శ్రేణుల మధ్య ఇదే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందస్తు సమాచారమేదీ లేకుండా.. ఉన్నట్టుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్లో లేకపోయినా హస్తిన నుంచి పిలుపు రావడంతో అప్పటికప్పుడు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియపై కసరత్తు చివరి దశకు చేరుకున్న సమయంలో కిషన్ రెడ్డి అధిష్టానంతో భేటీ కావడంతో బీజేపీ నేతలు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత అధిష్టానంలో కూడా తెలంగాణ పట్ల జోష్ పెరిగింది. ఇటు కేడర్‌లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోనూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు పదవులు ఉండటంతో కిషన్ రెడ్డి స్థానంలో మరొకరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న చర్చ కొన్ని నెలలుగా జరుగుతోంది. కానీ, ఎప్పటికప్పుడు లీకులివ్వడం, చర్చలు జరగడం తప్పితే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియ తరచూ వాయిదా పడుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో కమలం పార్టీ అధిష్టానం కొన్ని అంశాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ కీలకంగా మారిన నేపథ్యంలో.. నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న ఆలోచనలో హై కమాండ్ ఉందంటున్నారు. ఇక, బీజేపీ అధ్యక్షుడి రేసులో తెలంగాణ నుంచి చాలామంది నేతలు పోటీలో ఉన్నారు. ప్రధానంగా డీకే అరుణ, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు.. రఘునందన్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది.
తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ నివేదికను పార్టీ అధిష్టానానికి అందించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల్లో, ప్రభుత్వంలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి బీసీ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే నియమించారు. కాంగ్రెస్‌తో పాటు.. బీఆర్ఎస్ కూడా బీసీలను తమవైపు తిప్పుకునే వ్యూహాలను రచిస్తున్నాయి. దీంతో, బీజేపీ కూడా బీసీ కార్డుపైనే ఫోకస్ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ఉగాది లోపే పార్టీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కాబట్టి.. వీలైనంత త్వరగా కొత్త సారథిని ప్రకటిస్తారని చెబుతున్నారు. అటు కిషన్ రెడ్డి సడెన్‌గా ఢీల్లీ వెళ్లటంతో ఇక ప్రకటన దాదాపు ఖాయమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.