37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

అవును వీళ్ళే బెస్ట్!

  • ఎవరేం చేస్తున్నారో తెలుసంటోన్న కాంగ్రెస్ అధిష్టానం

  • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సిఫారసులకు పుల్‌స్టాప్

  • క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకే ఎంపిక

  • గట్టి వాయిస్ ఉన్న మహిళా నేతలు లేరంటున్న మీనాక్షి

  • ఈ కారణంగానే విజయశాంతికి అవకాశం

  • పదవి ఉన్నవారికి మరో పదవి అవసరం లేదని క్లారిటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు ఒకేసారి శాసన మండలిలొకి అడుగుపెడుతున్నారు. గత పదేళ్లలో ఒకేసారి ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. సోమవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్‌ నాయక్, విజయశాంతిలు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం నోటిఫికేషన్‌ వెలువడిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక లాంఛనం కానుంది. ఈ ఐదుగురు అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒక్కరు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లలో అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి ఉండగా.. సీపీఐ నుంచి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రావణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క సామాజిక వర్గాల వారీగా న్యాయం చేయడానికి ఇబ్బంది కలగకుండా, సీనియర్లకు న్యాయం జరిగే విధంగా బ్యాలెన్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. అద్దంకి దయాకర్ చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. నిజానికైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే, అప్పుడు అధిష్టానం.. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దయాకర్‌కు టికెట్‌ కేటాయించలేదు. ఇప్పుడు కూడా సీనియర్ల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత అధిష్టానం అద్దంకి దయాకర్‌ అభ్యర్థిత్వానికి ఓకే చెప్పింది. వాస్తవానికి ఒక ఓసీకి, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని మొదటినుంచీ అనుకున్నప్పటికీ.. ఆ స్థానంలో వేం నరేందర్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరిగింది. చివరి నిమిషం దాకా ఈ రకమైన ప్రచారం జరిగినప్పటికీ.. అధిష్టానం మాత్రం ఫైనల్‌ లిస్టలో నో చెప్పినట్టుగా తెలిసింది. ఇప్పటికే పదవుల్లో కొనసాగుతున్న వారికి కొత్తగా మళ్లీ పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధిష్టానం క్లారిటీగా చెప్పేసింది.

ఇక, విజయశాంతి విషయానికి వస్తే ఇది పూర్తిస్థాయిలో అధిష్టానం ఎంపిక అని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మహిళా నాయకుల కొరత ఉందని.. ముఖ్యంగా ఇటు శాసన మండలిలో, అటు బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే మహిళ కావాలన్న ఉద్దేశ్యంతోనే విజయశాంతికి ఓకే చెప్పినట్టుగా తెలిసింది. ప్రస్తుతం కేబినెట్‌లో మహిళా మంత్రులు ఉన్నప్పటికీ.. వాళ్లు ఆశించిన స్థాయిలో విపక్షాలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు బీసీ కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో క్యాబినెట్‌లోకి కూడా తీసుకునే అవకాశం ఉందని సీనియర్లు అంటున్నారు.

అటు.. శంకర్ నాయక్ విషయానికొస్తే.. పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి.. ఈ విషయంలో కీలకపాత్ర పోషించినట్లుగా భావిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన శంకర్ నాయక్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. చాలాకాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నారు. శంకర్ నాయక్ పేరు ఎప్పుడూ గట్టిగా వినిపించలేదు. అసలు రేసులో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరగలేదు. కానీ, శంకర్ నాయక్ ఎంపిక విషయానికి సంబంధించి జానారెడ్డి అభిప్రాయానికి అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. పార్టీలో మొదటి నుంచీ ఉన్నవాళ్లు.. ముఖ్యంగా కింది స్థాయి నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే.. పార్టీ శ్రేణులకు, ప్రజలకు కూడా మంచి మెసేజ్ వెళుతుందని అధిష్టానం భావించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని శంకర్ నాయక్‌ అభ్యర్థిత్వానికి అధిష్టానం ఓకే చెప్పింది.

మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎంపికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక అంశాన్ని మాత్రం స్పష్టం చేసింది. పైరవీలు సిఫారసుల కన్నా క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న తర్వాతే పదవులు ఇవ్వాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి.. ఢిల్లీలో పైరవీలు చేసుకుంటే చాలు.. టిక్కెట్ వస్తుందన్న భావన చాలా మందిలో ఉందని, ఆ ఆలోచనను రూపు మాపేందుకు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లుగా కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మీనాక్షి నటరాజన్ మార్క్‌ కూడా కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లకే ప్రాధాన్యత ఉంటుందని.. ఇటీవల ఆమె కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతల భేటీలో కామెంట్ చేశారు. దానికి అనుగుణంగానే ఈ ఎంపిక జరిగినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి పదవుల కోసం ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదని, ఎవరు ఏం పని చేస్తున్నారో తమకు తెలుసని అధిష్టానం చెప్పకనే చెప్పిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com