32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

తెలంగాణలో దూసుకుపోతున్న మహిళా ఓటర్లు

తెలంగాణలో స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలోని ఓటర్ల లెక్కలు కూడా వెల్లడించింది ఎన్నికల కమిషన్‌. దీంతో, ఎన్నికల వేడి మొదలైనట్లేనన్న చర్చ రాష్ట్రమంతటా సాగుతోంది.అసలు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కాకముందే ఎన్నికల సంఘం మాత్రం ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధకిఆరి సుదర్శన్‌రెడ్డి.. తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గత యేడాది అక్టోబబర్‌లో ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించారు.

ఈ ఓటర్ల జాబితా పరిశీలిస్తే.. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,66,41,489 కాగా, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. ఇక యువ ఓటర్ల సంఖ్య చూస్తే.. 5,45,026 మంది ఉండగా.. సీనియర్ సిటిజన్లు 2,22,091 మంది, ఓవర్సీస్ ఓటర్లు 3,591 మంది, దివ్యాంగులు 5,26,993 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎనికల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి వివరించారు.

ఎన్నికల కమిషన్‌ తాజాగా రిలీజ్‌ చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్ల హవా కొనసాగుతోంది.పురుషుల కంటే 2,26,246 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 1,55,444 అధికంగా ఉంది. ఏడాదిలో 70,802 మంది మహిళా ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో ఏటా మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతున్నట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ కొత్త ఓటర్ల జాబితా ప్రచురణలో భాగంగా గత ఏడాది అక్టోబరు 29న ముసాయిదాను ప్రచురించి ఓటర్ల సవరణ, కొత్తగా నమోదుకు నవంబరు 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాలు, సవరణల అనంతరం తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు.

కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్న వాళ్లకు త్వరలోనే ఎపిక్‌ కార్డులను పోస్టు ద్వారా పంపిస్తామని సీఈవో తెలిపారు. అయితే, ఓటర్ల నమోదు, సవరణ నిరంతరం జరిగే ప్రక్రియ అని ఎన్నికల ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా గానీ, స్థానికంగా ఉన్న బీఎల్‌వో, ఏఈఆర్‌వో, ఈఆర్‌వోల వద్ద గానీ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కోరారు.

ఇక, రాష్ట్రంలో సర్వీసు ఓటర్ల సంఖ్య 15,872 మంది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 46,24,192 మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లున్నారు. కుత్బుల్లాపూర్‌ 7,34,155 ఓటర్లతో రెండో స్థానంలో ఉంది. అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 1,54,134 మంది ఓటర్లున్నారు. దీంతోపాటు ఆశ్వరావుపేట, వైరా, బాన్సువాడ, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో 2 లక్షలలోపు మాత్రమే ఓటర్లున్నారు. ఈ ఓటర్ల జాబితా సవరణల్లో భాగంగా హైదరాబాద్‌లో అత్యధికంగా 12,502 మంది, సంగారెడ్డిలో 9,219 మంది ఓటర్లను తొలగించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా 831 మంది ఓటర్లను తొలగించారు. కొత్త ఓటర్లుగా అత్యధికంగా రంగారెడ్డిలో 18,161 మంది, హైదరాబాద్‌లో 14,157 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 13,086 మంది నమోదు చేసుకున్నారు. అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో 1,378 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com