35.3 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం – భట్టి

  • స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి
  • త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం
  • జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు కార్యక్రమంలో ప్రగతిపై బుధవారం డిప్యూటీ సీయం జిల్లా కలెక్టర్లతో మంత్రివర్గ సహచరలు ధనసరి సీతక్క, కొండాసురేఖలతో కలసి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలర్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ప్రజా ప్రభుతవం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లకు వివరించారు.  మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం ఉదయం ప్రజాభవన్‌లో మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు.  అందుకుగాను అంది వస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నాం. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు.

మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను డిప్యూటీ సీయం ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లు లో  ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్‌కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక మెగావాట్‌ ఉత్పత్తికి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుంది ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగువేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు.  దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని.. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో భూములపై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్ లైన్ ల ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ దిశగా కలెక్టర్లు పనిచేస్తే గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం స్పష్టంగా ఉందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుంది. చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడంలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇకనుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటిని సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టల తో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయి వీటి పైన సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని ఇంధన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు.

పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుందని కానీ భూమి లభ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములపై అధికారులు దృష్టిపెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని సీతక్క చెప్పారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com