34.2 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

మారతారా… మిమ్మల్నే మార్చేయమంటారా…!

  • దానం, మహిపాల్ రెడ్డి లపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.
  • లక్ష్మణ రేఖ దాటారంటున్న నేతలు.
  • బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కొత్త సమస్యలు.
  • దావోస్ నుంచి వచ్చిన రేవంత్ కు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు.
  • త్వరలో సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కానీ ఆస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే సహించే ప్రసక్తే లేదు… ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ పాటించని వారిపై యాక్షన్ తీసుకునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇక దానిని అమలు చేయడం ప్రారంభిస్తామని ఆయన సీనియర్ నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. ఇటీవల కాలంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించిన కొంత మంది ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాటుతున్నట్లుగా రేవంత్ రెడ్డికి నివేదికలు అందాయి.  గ్రామ సభలకు కొంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం మరి కొంతమంది తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించినట్లుగా ఇంటిలిజెన్స్‌ వర్గాలు సీఎం దృష్టికి తీసుకువచ్చాయి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మహిపాల్ రెడ్డిలు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.  గత కొంత కాలంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరచు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడటమే కాకుండా పలు సందర్భాల్లో కెసిఆర్,  కేటీఆర్‌లకు అనుకూలంగా మాట్లాడిన తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగాలనే అభిప్రాయంతో ఆయన ఉంటే దానం నాగేందర్ ప్రతిరోజు దీన్ని వివాదం చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని అధికారులు సైతం అంటున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు దానం నాగేందర్. తాను కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేసేందుకే దానం నాగేందర్ ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ లైను క్రాస్‌ చేసే వారిపై యాక్షన్ ఉంటుందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి కొందరు సీనియర్ల వద్ద కామెంట్స్ చేసినట్టుగా తెలిసింది.

ఇక పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విషయానికొస్తే.. కెసిఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పు లేదని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని నిబంధన ఎక్కడ లేదని ఆయన చేసిన కామెంట్స్ ను పార్టీ సీరియస్ గా పరిగణిస్తోంది. స్థానికంగా కూడా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడంలేదని జిల్లా నాయకులు ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్ నుంచి వచ్చిన మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగానే వ్యవహరిస్తున్నట్లుగా పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఈ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మరి కొంతమంది ఎమ్మెల్యేలు కలిపి దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు ఈ రకమైన వివాదాల్లో ఉన్నట్టుగా నిఘావర్గాల నివేదికలు సీయం రేవంత్‌రెడ్డికి అందాయి. త్వరలోనే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులందరికీ భవిష్యత్‌ దిశానిర్దేశం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com