ప్రకృతిని దోపిడీ చేసి , ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని పౌరహక్కుల సంఘం నేత , ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఛత్తీస్ ఘడ్ బస్తర్ లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసులని అడవి నుండి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. ఆదివాసులకు భూమిపై హక్కును రాజ్యాంగం కల్పించిందని… ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ ఘడ్ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు.
కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందాని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని మాట్లాడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి , రాజ్యాంగానికి విఘాతమన్నారు. కేంద్ర ప్రభుత్వం అదివాసులతో చర్చలు జరపాలని, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లు అన్ని ప్రభుత్వ హత్యలే అని, ఆపరేషన్ కగార్ హత్యాకాండను వెంటనే నిపిలివేసి చర్చలు జరపలన్నారు. ఆదివాసీ ప్రజలకు సంఘీభావంగా పౌర సమాజం అండగా నిలవాలని హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.