- కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సవాల్
- కేసీఆర్‌కి విజన్ లేకనే రాష్ట్రం అప్పుల పాలు
కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహేష్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేండ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారని నిలదీశారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో 27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన తెలంగాణకి ధమాకా వంటిదన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని మహేష్‌గౌడ్ చెప్పారు. మీ హయాంలో ఎన్ని వచ్చాయి మా హాయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే అంశంపై చర్చకు సిద్దామా అని పీసీసీ అధ్యక్షుడు కేటీఆర్‌కి సవాల్ విసిరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు వస్తున్నాయని అందులో మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఒకటని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2050 నినాదం రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు. ఇటీవల గాంధీభవన్ వద్ద జరిగిన యూత్ కాంగ్రెస్ నేతల పరస్పర దాడులపై అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామని తర్వరలోనే తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి మద్దతు విషయం సీరియస్‌గా ఆలోచిస్తున్నామని, సాయంత్రంలోపు ఒక నివేదిక వస్తుందని దాన్ని ఢిల్లీకి పంపించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మా పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉన్న మాట వాస్తవమే అని, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటన్నింటిపై కమిటీ రిపోర్ట్ ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు.