- ఎన్నికల కోసం విజయ్ సన్నాహాలు
- టీవీకే బహిరంగ సభలకు పోటెత్తుతున్న జనం
- పదునైన విమర్శలు, ఆకట్టుకునే మాటతీరు
- విజయ్ సభలకు పోటెత్తుతున్న జనం
- మోడీ,స్టాలిన్ లను నేరుగా సంభోధిస్తూ విమర్శలు
- బీజేపి,డీఎంకే ఒకటేనంటూ ఎద్దేవా
- రాష్ట్ర సమస్యలపై సంపూర్ణ అవగాహనతో స్పీచ్
- కీలక అంశాలలో పార్టీ వైఖరి పై స్పష్టత
- సామాజిక న్యాయం, ముస్లిం,మహిళా ఓటు బ్యాంకు పై దృష్టి
- ఎంజీఆర్, జయలలిత బాటలో గెలుపు సాధిస్తారా?
నటుడు విజయ్ తమిళనాడులో ట్రెండ్ సెట్టర్ పొలిటీషియన్ గా మారతాడా? ఆయన ఉద్వేగ భరిత ప్రసంగాలు, ఆగ్రహ పూరిత విమర్శలు తమిళనాడు యువతను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడమంటే ఒక విధంగా సాహసం చేయడమే. తలపతి విజయ్ ఆ సాహసం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలతో దీటుగా తలపడుతున్నారు.
తాజాగా జరిగిన బహిరంగ సభలో విజయ్ ప్రసంగం రాజకీయాల లోతు తెలిసిన అనుభవమున్న నేతలాగే సాగింది. బీజేపిని, డీఎంకేని ఏక కాలంలో ఒకే గాటన కట్టి తూటాల్లాంటి విమర్శలతో చెలరేగిపోయారు. డీఎంకే ఇండియా బ్లాక్ లో ఉంటూ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నా, తెర వెనుక మాత్రం బీజేపితో అంటకాగుతోందని మోడీ, స్టాలిన్ ఒకరు పాట పాడితే, మరొకరు డాన్స్ చేస్తున్నట్లుగా ఉందనీ ఎద్దేవా చేశారు.
సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) తొలి జనరల్ కౌన్సిల్ మీటింగ్ లోనే ఆయన వాగ్బాణాలు ఆకర్షించేవిలా ఉన్నాయి. డీలిమిటేషన్ పైనా, హిందీని బలవంతంగా రుద్దడం పైనా,మహిళలపై అన్యాయాలపైనా, కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్లాన్ పైనా విజయ్ ఎంతో పరిణతితో మాట్లాడారు.తన సమావేశాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ అడ్డంకులు కల్పిస్తున్నారని అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని విరుచుకుపడ్డారు. గాలిని అడ్డుకుంటే అది పెను తుఫానులా మారుతుందంటూ స్టాలిన్ ను హెచ్చరించారు విజయ్.
ప్రధాని మోడీని నేరుగా సంబోధిస్తూ తమిళనాడుతో ఆటలాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. వేర్పాటు వాద శక్తులను అంగీకరించబోమని,పరమత సహనంతో, సామాజిక న్యాయంతో, సోదర భావంతో తమ రాష్ట్రం అడుగులు వేస్తుందని అన్నారు. స్టాలిన్ ద్విభాషా సిద్ధాంతాన్ని అమలు చేయాలని, తమిళభాష, ఆంగ్లం తప్పనిసరిగా టీచింగ్ సబ్జెక్టులుగా ఉంచాలనీ విజయ్ డిమాండ్ చేశారు.
వక్ఫ్ చట్టాల మార్పులపై అభ్యంతరం
వక్ఫ్ చట్టాలకు కేంద్రం చేసిన సవరణలను కూడా విజయ్ తప్పుబట్టారు. ముస్లిం సోదరులకు అన్యాయం చేసేలా ఉన్నా సవరణలు తక్షణం నిలిపివేయాలని అసలు వక్ఫ్ బిల్లునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విజయ్.కేంద్రం చేసిన సవరణలు పైకి పారదర్శకంగా కనిపిస్తున్నా ఆ చట్టాలు ముస్లింలకు అన్యాయం చేసేవిగానే ఉన్నాయన్నారు.
మహిళా ఓటు బ్యాంకు పై దృష్టి
తమిళనాడులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విజయ్ తమ పార్టీ సమావేశంలో విమర్శించారు. వారిపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని,నేరాలు పెరుగుతున్నాయని, అన్నింటిలోనూ మహిళలే బలవుతున్నారని విజయ్ వాపోయారు.
స్టాలిన్ ప్రభుత్వం పాలన ఘోరంగా ఉందని, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, దీనికి పరిష్కారం తమ పార్టీని గెలిపించడమేనని విజయ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు తమ పార్టీకి డీఎంకేకి మధ్య మాత్రమే జరగబోతున్నాయని అన్నారు. స్టాలిన్ తన ధైర్యాన్ని పాలనలో, చేతల్లో చూపాలని తనను నియంత్రించేందుకు కాదని తలపతి ఆవేశంగా ఎద్దేవా చేశారు. విజయ్ దూకుడు చూస్తుంటే పక్కా ప్లానింగ్ తోనే ముందుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది.
విజయ్ తీరు ఇప్పటి వరకూ అయితే తమిళనాడు ప్రజలను ఆకట్టుకుంటోందనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా, జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇసకేస్తే రాలనంతగా యువత ఆయన మీటింగులకు వస్తున్నారు. ఇవన్నీ ఆయన్ని గెలిపిస్తాయా? అంటే చెప్పలేం. ఎందుకంటే తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. ప్రసంగాలకు, బహిరంగసభలకు వచ్చే జనం అంతా ఓట్లేస్తారని అనుకోలేం. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలకు కూడా జనం పోటెత్తేవారు. కానీ ఆయన రెండుసార్లూ ఘోర ఓటమిని చవిచూశారు. మూడోసారి కూటమితో జట్టు కట్టాక మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలకు వచ్చిన జనాన్ని చూస్తే గెలుపు వైసీపీదే అని అంతా అనుకున్నారు. కానీ ప్రజా తీర్పు మరో రకంగా ఉంది. అలాగే తమిళ రాజకీయాలను కూడా ఊహించలేం. గతంలో నటుడు కమల్ హాసన్ సభలకు కూడా జనం బానే పోటెత్తేవారు. కానీ ఆయన కూడా ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా నిలిచిపోయారు. ఇక నటుడు రజనీకాంత్ కు కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఆయన ఎంట్రీకన్నా ముందే రాజకీయాలకు వీడ్కోలు పలికేశారు.
రాజకీయాల్లో రాణించడం అన్నది అంత సులభం కాదు. గతంలో ఎంజీఆర్, జయలలిత లాంటి పేరున్న అగ్రతారాగణం మాత్రమే ఆ కష్ట నష్టాలను నిలిచి, గెలిచి చూపించారు. ఇప్పుడు తలపతి విజయ్ కూడా అదే విజయాన్ని సొంతం చేసుకుంటారా? ఏమో చూడాలి.