ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై సుప్రీం సీరియస్
ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్యకర్తలకు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు, ఓడిన పార్టీ నేతలకూ కష్టాలేనా? తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా ఈ ధోరణి బాగా కనిపిస్తోంది. అధికారం మారగానే కక్ష సాధింపు ధోరణులు పెరుగుతున్నాయన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. పాత ప్రభుత్వాల నిర్ణయాలను తిరగతోడటం, అందుకు అధికార్లను బాధ్యులను చేయడం వారిని జైలు పాలు చేయడం పరిపాటయ్యింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలాంటిదే…
8 నెలలుగా విచారణలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం కోర్టు ఇవాళ ఘాటుగా స్పందించింది. కేసును ఇంకెంత కాలం దర్యాప్తు చేస్తారని ప్రభుత్వాన్నినిలదీసింది. ఎన్నాళ్లలో విచారణ పూర్తవుతుందో స్పష్టం చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ అంశంపైనా కోర్టు స్పందించింది. ఇంకెంత కాలం నిర్బంధంలో ఉంచుతారని ప్రశ్నించింది. తొందరగా తేల్చండి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది.
అక్కడా అంతే…
నిజానికి అటు ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తొలినాళ్లలో అయితే మరీ దారుణం.. కనిపించిన వైసీపీ నేతలపై యధేచ్ఛగా దాడులు జరిగాయి. ఈదాడుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగాయి. దాంతో వైసీపీ నేతలందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. పేరున్న పెద్ద పెద్ద నేతలే ఈ ధోరణులను తట్టుకోలేక పోతుంటే ఇక కింద స్థాయి కార్యకర్తలు, కిందిస్థాయి అధికారుల పరిస్థితి ఏంటి? చాలా మంది నేతలు పార్టీ మారిపోడం అధికార పార్టీ తీర్ధం తీసుకోవడం పరిపాటయ్యింది. అంతకన్నా మరో దారి లేదు. సహకరించక తప్పదు. ఏ రోటి కాడ ఆ పాట పాడకపోతే రాజకీయంగా నిలదొక్కుకోడం కష్టం. వారు పార్టీని వీడటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చూస్తుంటే పైకి కనిపించని ఒత్తిళ్ళు, వేధింపులు ఉన్నాయన్నది సుస్పష్టం. ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఇలా పెద్ద తలకాయలన్నింటినీ టీడీపీ గురి పెట్టి రాజకీయం మొదలు పెట్టింది. దాంతో మామూలు కార్యకర్తలు వణుకుతున్నారు.
వైసీపీ నేతలు చాలా మంది ఇప్పటికే రకరకాల కారణాలతో నిర్బంధంలో ఉన్నారు. సంబంధం లేని కేసుల్లో ఇరుక్కుని బయటపడలేక నానా అగచాట్లు పడుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోడానికి ముందస్తు బెయిల్ కోసం హై కోర్టు, చివరకు సుప్రీం కోర్టు దాకా పరుగులు తీయాల్సి వస్తోంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పరిస్థితీ అంతే.. రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు అప్పట్లోనే నానా అగచాట్లు పడ్డాడా ఎంపీ. వైసీపీ నందిగం సురేష్ కు ఎంపీ సీట్ ఇచ్చి గెలపించింది. అయితే ఇప్పుడతడిని ఓ హత్య కేసులో అనమానితుడుగా అరెస్టు చేసిన టీడీపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. బెయిల్ రాక ఆరునెలలుగా నందిగం సురేష్ జైలులోనే ఉన్నాడు. ఇదంతా కాస్త పాపులర్ నేతల పరిస్థితి.
ఇక సోషల్ మీడియా వేధింపుల పేరుతో అరెస్టయిన వారి పరిస్థితి మరీ దారుణం. ఊరు పేరు లేని, సంబంధం లేని సామాన్యులను సైతం తెలుగు దేశం ప్రభుత్వం అరెస్టుల పాల్జేస్తోంది. తెలంగాణలో ఉన్న సుధారాణి దంపతుల కేసు అలాంటిదే. సోషల్ మీడియాతో సంబంధం లేకపోయినా టిడీపీని కించపరుస్తూ కామెంట్లు పెట్టారన్న ఆరోపణలతో వారిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు మొత్తం ఏపీ అంతా తిప్పారు. వారిని బండ బూతులు తిడుతూ, కొడుతూ ఇచ్ఛాపురం నుంచి మొదలు కొని ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, తాము చేయని నేరానికి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆ దంపతులు ఆరోపించారు. ప్రస్తుతానికి బెయిల్ పై విడుదలైనా మళ్లీ ఎప్పుడు పోలీసులు విరుచుకుపడతారో అని వారు భయపడుతున్నారు. ఇక ఇంటూరి కిరణ్ అనే వైసీపీ కార్యకర్త పట్ల మరీ అరాచకంగా వ్యవహరించింది తెలుగు దేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు హయాంలో ఆయనపై మొదలైన వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఈ మధ్యనే అతగాడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో మరో వైసీపీ యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డి ది మరో కేసు. ఈయనను వివేకా హత్య కేసులో సోషల్ మీడియాలో టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టుచేశారు. అయితే ఆ పోస్టులు తాను చేయలేదని, ఫేక్ ఈమెయిల్ ఐడీతో ఎవరో చేశారని సాక్ష్యాలతో బయటపెట్టినా ఆయన్ను జైల్లోనే నిర్బంధించారు. ఇలా బయటకు వెల్లడి కాని వివరాలు ఇంకా చాలానే ఉన్నాయి. సుప్రీం కోర్టు తాజా కామెంట్లతో అయినా ఏపీలో జైళ్లలో మగ్గుతున్న వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియన్లకు ఊరట దొరుకుతుందా? సుప్రీం వ్యాఖ్యల ప్రభావం వీరి కస్టడీపైనా పడుతుందా వేచి చూడాలి.