ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యేక చర్చను లేవనెత్తుతున్నాయి. ఉన్నట్టుండి చేస్తున్న ప్రకటనలు ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాలు అవసరమా? దీని వెనుక మర్మమేంటి? అన్న సంశయాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమల దేవస్థానంలో ప్రోటోకాల్ దర్శనం కోసం ఏపీ సర్కారు ఆగమేఘాలమీద ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిసిటీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. వాస్తవానికి ప్రత్యేకంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాయాల్సిన అవసరం లేదు. కానీ, మధ్యాహ్నం ఉత్తర్వులిచ్చి… టీటీడీ చైర్మన్ ప్రకటించిన తర్వాత రాత్రికి చంద్రబాబు ఈ లేఖ విడుదల చేశారు. ఇక.. ఇప్పుడేమో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ముఖ్య అతిథులుగా ప్రోటోకాల్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విన్నపం మేరకు ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు జడ్జిలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే.. రాష్ట్ ప్రభుత్వ ముఖ్య అతిథులుగా ప్రోటోకాల్ ప్రకారం సదుపాయాలు కల్పిస్తారు. జడ్జిల అధికారిక, అనధికారిక పర్యటనల్లో కూడా ఈ సదుపాయం కల్పిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టు జడ్జిలకు ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇకపై ఏపీ హైకోర్టు జడ్జిలకు సమానంగా తెలంగాణ హైకోర్టు జడ్జిలకు కూడా ప్రోటోకాల్ సదుపాయాలు కల్పిస్తారు.
అయితే, ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా.. దేశం నలుమూలల నుంచీ.. ఇంకా చెప్పుకోవాలంటే విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా ప్రతినిధులకు గౌరవార్థం ప్రోటోకాల్ సదుపాయాలు, వాళ్ల సిఫారసు లేఖలతో వచ్చిన భక్తులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి దర్శనం, వసతి ఏర్పాట్లలో ప్రాధాన్యత కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పటినుంచీ కేవలం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను లెక్కలోకి తీసుకోవడం లేదు. అయితే, ఇన్నాళ్లుగా లేని సదుపాయాన్ని ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. వారంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులకు చెందిన నాలుగు సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపైనా ఏపీలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దేవుని సన్నిధిలో దర్శనానికి కూడా తెలంగాణ ప్రాంత నాయకులు డిమాండ్ చేయడం, ఏపీ సీఎం చంద్రబాబు వాళ్ల డిమాండ్లకు తలొగ్గి ఆదేశాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీ హైకోర్టు జడ్జిలతో సమానంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథుల హోదాలో ప్రోటోకాల్ గౌరవ సదుపాయాలు కల్పించడం విశేషం. అలాగే.. ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన ఉత్తర్వుల వెనుక చంద్రబాబు ప్రభుత్వానికి తనదైన లోగుట్టు దాగి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చంద్రబాబు సహా.. ఆంధ్రప్రదేశ్ నేతలందరికీ హైదరాబాద్‌లోనే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాదు.. ఆంధ్రాకు చెందిన చాలామంది నాయకులకు, ప్రముఖులకు, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో బిజినెస్ పార్ట్‌నర్‌షిప్‌లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోవడమే కాదు.. అదే వాస్తవమని సందర్భం వచ్చినప్పుడల్లా బట్టబయలవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సహా.. ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యనాయకులందరికీ హైదరాబాద్‌లో అవినాభావ సంబంధాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇక్కడి ఆస్తులు కాపాడుకోవడం, వ్యాపారాలను నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.