భారత క్రికెట్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన దగ్గర నుంచి టీమ్ ఇండియా పరిస్థితి నానాటికి తీసి కట్టుగా మారింది. అయితే అంతకుముందు ద్రావిడ్ సారథ్యంలో 2023 వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లడం, టీ 20 కప్ గెలవడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంక్ లో నెంబర్ వన్ గా ఉండటం ఇవన్నీ జరిగాయి.
అయితే అదే టీమ్… మహ్మద్ షమీ తప్ప అందరు ఉన్నారు.
అంతవరకూ అద్భుతంగా ఆడినవాళ్ళు ఇప్పుడెందుకు ఆడటం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే కొత్త కోచ్ గంభీర్ వ్యవహార శైలి ఒక్కటే అందుకు కారణమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తను కోచ్ గా వచ్చాక తన వెంట ఒక టీమ్ ని తెచ్చుకున్నాడు. వారిలో బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పాత్రకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను టీమ్ ఇండియా ఆటగాళ్ల బలహీనతలపై ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. అలాగే గంభీర్ కూడా సలహాలు చెప్పడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇతర కోచ్ లు మోర్నీ మార్కెల్, టెన్ డస్కాటే ల పని తీరు ఇంటర్నేషనల్ స్థాయిలో లేదని అంటున్నారు.
అదే ద్రావిడ్ అయితే, ఎవరు ఏ షాట్స్ కి అవుట్ అవుతున్నారో విశ్లేషించి, నెట్స్ లో అవే బాల్స్ వేయించి ప్రాక్టీస్ చేయించేవారు. మార్నింగ్ అందరూ 4 గంటలకు లేవాలంటే
లేవాల్సిందే. అంతేకాకుండా డ్రెసింగ్ రూమ్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది… సరదాగా నవ్వుతూ ఉండేవారు. టెన్షన్ తీసుకునే వారు కాదు.
మరిప్పుడు గంభీర్ వచ్చాక డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంతా మారిపోయిందని అంటున్నారు. కోచ్ ఎప్పుడు మొఖం మాడ్చుకుని ఉండటంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మెలబోర్న్ లో నాలుగో టెస్ట్ ముగిసాక… ఇక నుంచి నేను చెప్పినట్టే ఆడాలని గంభీర్ హుకుం జారీ చేసాడంట. దీంతో మరి కెప్టెన్ మాట వినాలా? లేక కోచ్ మాట వినాలా? అనే అంశంపై ఆటగాళ్లు డైలామాలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే గతి తప్పిన ఆటతో ఉన్నవాళ్లకు, మతి పోతోందని అంటున్నారు. టీమ్ ఇండియాలో ఆటగాళ్ళ పరిస్థితి ఏమీ బాగా లేదనేది అర్థమవుతోంది.
ఒకవేళ ఐదో టెస్ట్ ఓడిపొతే, నైతిక బాధ్యత వహిస్తూ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పడం ఖాయంగా ఉంది. అదే జరిగితే, వరుసగా ఇన్ని వైఫల్యాలకు బాధ్యుడిని చేస్తూ కోచ్ గంభీర్ కి ఉద్వాసన తప్పదని అంటున్నారు.