37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

టీపీసీసీలో చోటు దక్కేదెవరికో?

– తగ్గనున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్లు
– మారనున్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌

అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పూర్తిస్థాయి కార్యవర్గం నియామకానికి ముహూర్తం కుదిరిందని చెబుతున్నారు. అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. వచ్చే సంక్రాంతి పర్వదినం నాటికి ఈ కొత్త కార్యవర్గం నియామక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ఈ సారి టీపీసీసీలో ముగ్గురుకార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ సహా కొత్త కార్యవర్గాన్ని ఖరారు చేసేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆశావహుల జాబితా, పార్టీ అభివృద్ధికి తోడ్పడేవాళ్ల జాబితా అధిష్టానం ముందుకు చేరిందని చెబుతున్నారు. ఫైనల్‌గా రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యనాయకులతో సంప్రదింపుల తర్వాత కార్యవర్గం నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానిక సంక్రాంతి నాటికి తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ కార్యవర్గంతో గాంధీ భవన్‌లో కొలువుదీరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌గౌడ్‌ను నియమించి ఇటీవలే వందరోజులు పూర్తయ్యింది. ఆ సందర్భంగా ఏఐసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఇటీవల కొంత కసరత్తు చేసిందంటున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన సమయంలో ఏకంగా ఐదుగురికి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. జగ్గారెడ్డికి.. ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి దాదాపు ఖరారైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ దగ్గర జగ్గారెడ్డికి.. మంచి ఆర్గనైజర్‌ అన్న పేరుంది. జగ్గారెడ్డి ఆర్గనైజింగ్‌ స్కిల్‌ను పార్టీకి ఉపయోగించుకోవాలంటూ రాహుల్‌గాంధీ చేసిన సూచన మేరకే ప్రచార కమిటీ చైర్మన్‌ పోస్టును ఆయనకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇక, ఈసారి నియమించే పీసీసీ ఫుల్‌ టీమ్‌ నియామకంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ముగ్గురికి మాత్రమే అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వారిలోనూ రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలన్న ప్రతిపాదన ఉన్నట్లు.. ఏఐసీసీ ఆల్‌రెడీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. వంశీచంద్‌రెడ్డిని ఏఐసీసీలోనే కొనసాగిస్తే ఈ రేసులో రోహిన్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉంటారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్‌లను నియమించేందుకే ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు.. టీపీసీసీ అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో.. ఆ వర్గం నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించే అవకాశం లేదంటున్నారు. అలాగే, ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించాలా? వద్దా? అన్న విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న అజారుద్దీన్‌నే మళ్లీ నియమించాలా? అన్న ప్రతిపాదన కూడా వచ్చింది. లేదంటే.. నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్‌ఖాన్‌ను టీపీసీసీలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా నడుస్తోంది. ఒకవేళ ముస్లిం సామాజిక వర్గం నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఒకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఫిరోజ్‌ఖాన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీపీసీసీ నియామకంతో పాటు..పనిలో పనిగా కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మార్పు కూడా ఉంటుందన్న చర్చ కాంగ్రెస్‌ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. మరికొన్ని రాష్ట్రాల ఇంచార్జ్‌లను మార్చే ప్రతిపాదనలపైనా చర్చలు నడుస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ పైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. అదే జరిగితే వివిధ రాష్ట్రాల ఇంచార్జ్‌లు, కార్యదర్శులను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఇప్పుడున్న దీపాదాస్ మున్షీ స్థానంలో మరొకరు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా వచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సహజంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను డీల్‌ చేసేందుకు ఆ స్థాయి వ్యక్తులను ఆ రాష్ట్రాలకు ఇన్‌చార్జిలుగా నియమిస్తారు. ఇదే కోణంలో ఈ సారి తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భగేల్‌ గానీ, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను గానీ నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఈ ఇద్దరి పేర్లను తెలంగాణ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో భూపేశ్‌ భగేల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రానికి మరో ఏఐసీసీ కార్యదర్శి పోస్టు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com