టాలీవుడ్ పెద్దలు దిగొచ్చారు. ప్రకటించినట్లుగానే దిల్‌రాజు మధ్యవర్తిత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. కొంతకాలంగా జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొదటినుంచీ సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తోందని స్పష్టంచేశారు. తమ ప్రమేయం లేకుండా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే అగాథానికి కారణమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయడమే లక్ష్యంగా సమిష్టిగా ముందుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించింది. చర్చలకు వచ్చిన వాళ్లందరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అసెంబ్లీలో చేసిన ప్రకటన అమలవుతుందని నర్మగర్భంగా తేల్చి చెప్పింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇదే సమయంలో సామాజిక బాధ్యతను ఇండస్ట్రీ గుర్తెరగాలని చురకలు అంటించింది.
తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున పలువురు దర్శకులు, నిర్మాతలు, సినీ నటులు పాల్గొన్నారు. నిర్మాతలు సురేష్ బాబు, మురళీమోహన్, కె.ఎల్.నారాయణ, దామోదర్, అల్లుఅరవింద్, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, చిన్న బాబు, డి.వి.వి. దానయ్య, కిరణ్, మైత్రీ రవి, స్రవంతి రవి కిషోర్, నాగబాబు, టి.జి. విశ్వ ప్రసాద్, ప్రసన్న, యు.వి. వంశీ, సుధాకర్ రెడ్డి, వంశీ, సునీల్-అనుపమ్, గోపి గారు, సి.కల్యాణ్, రమేశ్ ప్రసాద్, భరత్ భూషణ్, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వీర శంకర్, త్రివిక్రమ్, పవర్ బాబీ, వేణు శ్రీరామ్, బలగం వేణు, వి. విజయేంద్ర ప్రసాద్, సినీ నటులు నాగార్జున, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, కల్యాణ్ రామ్, శివ బాలాజీ, అడవి శేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని గుర్తు చేశారు.ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయన్న రాఘవేంద్రరావు.. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో నిర్వహించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు.
సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే కూడా ఉంటుందని, పండుగలాగా చేసుకోవడానికి అదో సందర్భమన్నారు. అయితే, సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని చెప్పారు. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్న మురళీమోహన్.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేయాల్సి వస్తోందన్నారు. ఇక, మరో సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి.. తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానన్నారు. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలన్నది తన ఆకాంక్షగా శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీనియర్ నటుడు నాగార్జున కూడా తనదైన శైలిలో స్పందించారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని స్పష్టం చేశారు.
ఇక, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ కల అని అన్నారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి తరలి వచ్చిందని సురేష్‌బాబు గుర్తు చేశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలని, ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి సహా అక్కినేని నాగేశ్వర్‌రావు వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తావించారు.
సినీ పరిశ్రమ ప్రముఖులు చెప్పినవన్నీ సావధానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున టాలీవుడ్‌కు ఏ ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయాలను, సర్కారు ఆలోచనలను పరిశ్రమ పెద్దలకు తెలియజేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని కరాఖండిగా చెప్పేశారు సీఎం రేవంత్. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని తేల్చి చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని సూచించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీకి వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో సినిమా ఇండస్ట్రీ కూడా సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని సూచించారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలన్నారు. అలాగే, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను కూడా ప్రమోట్ చేయాలని టాలీవుడ్ ప్రముఖులకు సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరారు. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.