31.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

డీలిమిటేషన్‌ పై జగన్… బాబు,పవన్లు ఎటువైపు…?

  • 22న ఐక్యకార్యాచరణకు సమావేశం… స్టాలిన్ బాటన నడిచేదెవరు?
  • డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయంపై పోరు మొదలు పెట్టిన స్టాలిన్‌
  • దక్షిణాది రాష్ట్రాల సమైక్య పోరు నిలబడుతుందా?
  • పవన్ కల్యాణ్‌ స్టాండ్‌ పై సర్వత్రా ఆసక్తి
  • చంద్రబాబు కేంద్రానికి తలొగ్గారనే భావన
  • వైసీపీ కలిసొస్తుందా… మేం తటస్ధం అంటుందా?
  • జేఏసీ సమావేశానికి జగన్ వెళతారా…?

భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా రాష్ట్రం తర్వాత రాష్ట్రం గెలుచుకుంటూ  జైత్ర యాత్ర కొనసాగించాలన్న ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే బీహార్‌ పై పవర్ ప్లే మొదలు పెట్టిన బీజేపి వచ్చే ఏడాది  తమిళనాడుకు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టింది. అమిత్‌ షా బీహార్ తర్వాత తమిళనాడు, బెంగాల్‌ రాష్ట్రాల పై  పక్కా ప్లాన్ తో ముందు కెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బహుశా ఇది గమనించే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ జాగ్రత్త పడుతున్నట్లుగా ఇటీవల ఆయన స్టేట్‌ మెంట్లు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానులు చూపే సవతి తల్లి ప్రేమ మీద గతంలోనూ ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ అవి ఒక ఆర్గనైజ్డ్ గా, నిరంతరంగా జరగలేదు. ఇప్పుడు డీ లిమిటేషన్ పుణ్యమాని మళ్లీ ఆ చర్చ తెరపైకి వచ్చింది. నియోజక వర్గాల పునర్విభజన జరిపేసి ఆపై వన్ నేషన్‌, వన్‌ ఎలక్షన్ కు వెళ్లాలని ప్రధాని మోడీ సహా బీజేపి నేతలంతా పట్టుదలతో ఉన్నారు. ఇది గమనించారు కాబట్టే బహుశా స్టాలిన్‌ అందరికన్నా ముందు గళమెత్తారు. వాస్తవానికి నియోజక వర్గాల పునర్విభజన అంశాన్ని 2031లో మాత్రమే మొదలు పెడతారన్న అంచనాలున్నాయి. అయితే కేంద్రం వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఈ టర్మ్ లోనే అది జరిగే అవకాశాలు బలపడుతున్నాయి.

గత కొంత కాలంగా కేంద్రం పెత్తనం సహించేది లేదని, ఆదాయంలో తమదే పెద్ద చేయి అయినా కేంద్రానికి కడుతున్న పన్నులకు తమకు కేటాయిస్తున్న నిధులకు పొంతనే లేదని వివక్ష రాజ్యమేలుతోందని స్టాలిన్‌ విమర్శిస్తున్నారు. ఇది అక్షర సత్యం. మొన్న బడ్జెట్‌ లో కేంద్రం బీహార్ కు జరిపిన కేటాయింపులు చూస్తే బీజేపి ప్రాధాన్యతలు తెలుస్తాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే స్టాలిన్‌ కూడా ఎదురు దాడి వ్యూహంతో ముందుకెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా బడ్జెట్‌ ప్రతులపై రూపాయి చిహ్నాన్ని తమిళ భాషలో ముద్రించారు. రూపాయి హిందీ అక్షర చిహ్నం కావడంతో  అసలా చిహ్నన్నే ప్రచురణకు నిరాకరించిన వ్యక్తి స్టాలిన్‌. ఇవే కాదు గత కొంత కాలంగా కూడా హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదని తెగేసి చెప్పిన వ్యక్తి స్టాలిన్. ఇలా గత కొంత కాలంగా స్టాలిన్‌ కేంద్రంపై సమర భేరి మోగిస్తున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ సైతం తమిళంలో రాసేందుకు అనుమతించాలని ఉద్యమాలే చేసిన రాష్ట్రం తమిళనాడు. అందరూ కలసి చేసే సమైక్య ఉద్యమాలతోనే సాధించుకున్నారు. జల్లికట్టు దగ్గర నుంచి రెండో అధికార భాషగా హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదని నిక్కచ్చిగా చెప్పిన రాష్ట్రం తమిళనాడు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ వల్ల జరిగే నష్టాన్ని ముందే అంచనా వేసి ఉద్యమిస్తున్న వ్యక్తి స్టాలిన్.

 బీజేపి ముందు చూపు…

జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేస్తున్నారు. జనాభా లెక్కలు తీస్తే దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా ఎక్కువ. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసినందున ఒకరు లేదా ఇద్దరు సంతానానికే పరిమిత మవ్వాలన్న కేంద్రం సూచనలు దశాబ్ధాల పాటు పాటించాయి. మరో వైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ నియమం అసలు పాటించలేదు. యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే అసలు ఇలాంటి ఆదేశాలను పాటించే ఆస్కారమే ఉండదు. కాబట్టి ఉత్తరాదిన జనాబా ఎక్కువ. ఆ ప్రాతిపదికన అక్కడ పార్లమెంటు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి. పార్లమెంటులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యసభలో బీజేపికి సొంతంగా మెజారిటీ ఉండాలి. బీజేపికి ఆ పరిస్థితి లేదు. గతంలో మిత్రపక్షాల సహకారంతో కాలం గడిపింది. కానీ తమ బ్రాండ్‌ నిర్ణయాలు తీసుకోవాలంటే సొంత మెజారిటీ ఉండాల్సిందే. అందుకే ప్లాన్ ప్రకారం బీజేపి అడుగులేస్తోంది. పార్లమెంటు ఉభయ, సభల భవనాలను కొత్త భవనంలో కాస్త విశాలంగా నిర్మించారు. రాజ్యసభలో ఎక్కువమంది సభ్యులు పెరుగుతారన్న అంచనాలతోనే ఆ సభను మరింత పెద్దదిగా కట్టించారు. బీజేపి ఇంత ముందు చూపుతో అడుగులేస్తోంది. అంతరార్ధాన్ని గ్రహించిన స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సమైక్య నినాదంతో ఉద్యమం ప్రారంభించినట్లే.

ఈనెల 22న చెన్నైలో జరిగే సమావేశంలో తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. ఈ పోరాటానికి మద్దతు తెలపాలని అన్ని పార్టీలనూ కోరారు. దీనికి తెలంగాణ నుంచి బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించాయి. కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఈ సమావేశానికి రానున్నారు. బీఆర్‌ ఎస్ మొదట్నుంచి ఇదే అంశంపై పోరాడుతోంది కాబట్టి ఆ పార్టీ హాజరవుతోంది. రేవంత్‌ కూడా సానుకూలంగా స్పందించినా, అధిష్టానం ఆదేశాలను బట్టి చేస్తామన్నారు. అయితే అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఉద్యమానికి కాంగ్రెస్ జై కొడుతుందేమో చూడాలి. ఇక వైసీపీ మొదట్నుంచి తటస్థ ధోరణితోనే అడుగులేస్తోంది. డీ లిమిటేషన్ పై ఇప్పటి దాకా వైసీపీ ఏమీ మాట్లాడినట్లు లేదు. మరిప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 టీడీపీ, జనసేన దొందూ దొందే…

ప్రస్తుతానికైతే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్టాలిన్ తో శృతి కలుపుతున్నారు. కానీ ఏపీ నుంచి ఇప్పటి వరకూ ఒక్కరు కూడా   మాట్లాడలేదు. డీలిమిటేషన్ పై ఉత్సాహం ప్రదర్శిస్తున్న పార్టీ లేవీ ఫెడరల్‌ సమాఖ్య, ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. బీజేపి పాలనకు ఏకపక్షంగా జై కొడుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపికి మద్దతుగానే వ్యవహరించిందనే విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్‌, చంద్రబాబులు అధికారంలోకి వచ్చాక అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీపడిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన నేత పవన్ కల్యాణ్‌ అయితే గతంలో దక్షిణాది రాష్ట్రాల కోసం ఆమరణ నిరాహారదీక్షకు సైతం రెడీ అంటూ ఉద్రేక పూరిత ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారు. తాను పూరించే శంఖారావం కనువిప్పు కావాలని, అన్ని దక్షిణాది రాష్ట్రాలు తనతో కలసి నడవాలని వైజాగ్‌ రామకృష్ణ బీచ్‌ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. తీరా అక్కడకి పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నా పవన్ మాత్రం అడ్రస్ లేరు. ఇలా ప్రతీసారీ ఆయన ఉత్త పిలుపులతో సరిపెట్టారు. కానీ ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా ఆయన కేంద్రాన్ని నిలదీయడం లేదు సరికదా కేంద్రం ఏది చెపితే దానికి వంతపాడుతున్నారు.

టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబుది కూడా అదే ధోరణి. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు మోడీ మో చేతి నీళ్లు వై సీపీ తాగుతోందనేవారు. తాము బీజేపి సహకారంతో అధికారంలోకి వచ్చాక ఆయన అసలు బాహ్య వేదికలపై బీజేపి గురించి విమర్శలు చేయకపోగా బీజేపీ నాయకులు కూడా సిగ్గుపడేలా మోడీ, అమిత్‌ షా, బీజేపీలను పొగుడుతున్నారు. ఇప్పటికే విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ఏ రంగంలోనూ నిలదొక్కు కోలేదు. పోలవరం నిర్మాణం ఇప్పటికీ ఒక మిధ్య గానే కనపడుతోంది. స్టేటస్ గాలికి పోయింది. రైల్వే జోన్‌ కేటాయింపు కూడా న్యాయ బద్ధంగా జరగనేలేదు. కేంద్రం నిర్ణయం మనకన్నా ఒరిస్సాకే ఎక్కువ మేలు చేసేలా ఉంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా పైకి మూత పడదు అని చెబుతున్నా..మహా అయితే వాయిదా పడుతుంది కానీ,కేంద్రం  డిజిన్వెస్ట్ మెంట్‌ నిర్ణయాన్ని తప్పించుకోలేదన్నది నగ్న సత్నం. మరి ఈ పరిస్థితుల్లో ఏపీ తరపున రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేదెవరు? ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత కేంద్రంలో తెలుగు రాష్ట్రాల మాటే చెల్లుబాటు కావట్లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలోనూ మన రాష్ట్రానికి ప్రోరేటా ప్రకారం ఎంపీల సంఖ్య పెరగకపోతే బార్గైనింగ్‌ పవర్‌ ఇంకా క్షీణించి పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవల్సి వస్తుందనే భయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com