తెలంగాణలో గ్రూప్ -3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గడిచిన యేడాది నవంబర్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను కూడా టీజీపీఎస్సీ కాసేపటి క్రితం విడుదల చేసింది. వీటితో పాటు.. గ్రూప్-3 పరీక్ష తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. వీటన్నింటినీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో 1,365 గ్రూప్-3 ఉద్యోగాలకు గానూ నవంబర్లో పరీక్షలు జరిగాయి. వీటికోసం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా పరీక్షలు జరిగాయి. అయితే, ఈ పరీక్షలకు కేవలం 50.24శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 10, 11 తేదీల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. అలాగే, ఇవాళ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈనెల 17వ తేదీన, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను ఈనెల 19వ తేదీన ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.