తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు హాజరవుతారో చెప్పాలని, తాను ఎప్పుడైనా సిద్ధమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, కృష్ణా జలాలపై చర్చకు సంబంధించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు హాజరైనప్పుడే కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి.
కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం వివరాలు బయటకు తీయాలన్నారు రేవంత్ రెడ్డి. ఎవరి హయాంలో ఆ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయో, ఎవరి హయాంలో ప్రాజెక్టులు పూర్తయ్యాయో, తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో అన్ని వివరాలూ చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ను సభకు రావాలని ఆదేశించాలని స్పీకర్‌ను రేవంత్ కోరారు. అసెంబ్లీలో కేసీఆర్ ఉండగానే కృష్ణాజలాలపై చర్చ పెడదామన్నారు. తమ తప్పు ఉందని నిరూపిస్తే ఇదే సభలో కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నాయకులు తాను క్షమాపణ చెబుతానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల కృష్ణా నది నీటి విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీశ్‌రావు.. చంద్రబాబు ముందు మోకరిల్లారని రేవంత్ తీవ్రంగా ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొహం చాటేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రోజా ఇంట్లో కేసీఆర్ ఒక్కపూట రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని అన్నారని.. కానీ, గుండెల్లో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రజలు రాజకీయ భిక్షపెడితే గుండెల మీద తంతారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే నాగార్జున సాగర్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలు వచ్చాయని సీఎం చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏమీ చేయకుండా సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటామని కేసీఆర్ అంగీకరించడం నిజం కాదా అని, అదంతా కమీషన్ల కోసమే చేశారని రేవంత్ నిలదీశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అసలు ప్రాజెక్ట్ పనులే చేపట్టలేదన్నారు. బీఆర్‌ఎస్ ఆ ప్రాజెక్టుపై దృస్టిపెడితే వాళ్ల హయాంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన బీఆర్‌ఎస్ నేతలు.. పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు.