32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ఢిల్లీ టూర్‌ విమర్శలపై రేవంత్‌ దిమ్మదిరిగే కౌంటర్‌

తన ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టారు. తాను ఢిల్లీ వెళ్లడం అందరికీ తెలిసిందేనని, ఢిల్లీ పర్యటనలతో తానేమీ దుబారా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వారన్న విషయం వాళ్లకు తెలియదా? అని ప్రశ్నించారు.

ప్రధానిని తాను కలవడంలో రాజకీయం ఏముంటుందన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని కాబట్టి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం తప్పనిసరి అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తున్నానని చెప్పారు. ప్రధానమంత్రిని గౌరవించే విజ్ఞత తమదన్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రధాని మోదీని కలిశానని.. అందరు కేంద్ర మంత్రులను కలిశానని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు వస్తే.. తాను కాంగ్రెస్‌ పార్టీ నాయకుడినని, ఆయన బీజేపీ నాయకుడని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అవసరమైతే బీజేపీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డిన ఢిల్లీ తీసుకెళ్తామని, తాను ఒక్క ప్రధానమంత్రిని మాత్రమే కలవలేదని, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని నాలుగు సార్లు కలిశానని, అలాగే, బండి సంజయ్‌ను కలిశానని, నిర్మలా సీతారామన్‌, అమిత్‌ షా వంటి కీలక మంత్రులను కూడా కలుస్తూనే ఉన్నామన్నారు. ఢిల్లీ వెళ్లి ఊరికే తిరిగి రాలేదని.. ఢిల్లీ వెళ్లి సాధించింది ఎంతో ఉందన్నారు. గోళీలు ఆడుకోవటానికి నేనేం ఢిల్లీ వెళ్లటం లేదని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల కోసం.. రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు, పనుల కోసం వెళ్లినట్లు స్పష్టం చేశారు. మీలా ఢిల్లీకి వెళ్లి కేసుల మాఫీ గురించి.. చీకట్లో కాళ్లు పట్టుకోవటానికి వెళ్లలేదంటూ కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి చురకలు అంటించారు రేవంత్‌ రెడ్డి.

అలాగే, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిసి హ్యాండ్ లూం ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చానని.. వరంగల్ లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ పెండింగ్ నిధులను తీసుకొచ్చానని.. జహీరాబాద్ నిమ్స్ కు రూ.1200 కోట్లు తీసుకొచ్చిన విషయాన్ని సభలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లటం వల్లే కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించానని.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ దిశగా వెళుతున్నాం అని.. మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్‌ రెడ్డి వివరించారు.

అంతేకాదు.. ఢిల్లీ వెళ్లిన తర్వాతే వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది నిజం కాదా? రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు టెండర్ల వరకు వచ్చింది నిజం కాదా? అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను సూటిగా ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. రూ.4 వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పులు తీసుకొచ్చింది నేనే కదా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ల్యాండ్స్ ను సాధించింది నేనే కదా.. పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి సాధించలేనిది నేను సాధించాను కదా.. అని చెప్పుకొచ్చారు. 160 ఎకరాల ఆర్మీ భూములను తెలంగాణకు అప్పగించారని.. దీనికి కృతజ్ణత చెబితే తప్పేంటీ అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించిన వాళ్లు ఎవరికైనా అభినందనలు చెబుతామని అన్నారు. భారత్ సమ్మిట్ కు 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని.. తెలంగాణ రైజింగ్ కోసం ఇదంతా చేస్తున్నామని.. వీటికి కేంద్రం నుంచి చాలా అనుమతులు రావాల్సి ఉందని.. దీని కోసమే ఢిల్లీ వెళుతున్నట్లు రేవంత్‌ వివరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com