తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అనేక అంశాలను సభలో ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ పాలన, బీఆర్‌ఎస్ నాయకుల వ్యవహార శైలిని ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అప్పట్లో ఇందిరా గాంధీని ఇందిరమ్మ అని పిలుచుకున్నారని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అని మనస్ఫూర్తిగా పిలిచే వాళ్లని అన్నారు. ఇప్పుడు తనను కూడా రేవంత్ అన్నా అని ప్రజలు ఆత్మీయంగా సంభోదిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు బీఆర్‌ఎస్ హయాంలో సామాన్యులు ముఖ్యమంత్రిని ఏమని సంబోధించాలో కూడా తెలియని పరిస్థితి ఉండేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎక్కడికైనా వెళ్తే… కనీసం గంట ముందు నుంచే ఎక్కడికక్కడ అన్నీ బంద్ చేసేవాళ్లని, కనీసం కేసీఆర్‌ను కలవాలంటే కూడా సాధ్యపడేది కాదన్నారు. కేసీఆర్‌ను కనీసం దగ్గర నుంచి చూసే అవకాశం కూడా దొరికేది కాదన్నారు. అప్పుడు సీఎం అంటే అలా ఉండేదేమో కానీ.. ఇప్పుడు మాత్రం రేవంత్ అన్న వచ్చాడంటూ ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పులు, తప్పులు చేసి ప్రజలను మోసం చేశారని, ముంచేశారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా బీఆర్‌ఎస్ నేతల కళ్లల్లో మెరుపు కనిపిస్తోందన్నారు. పైశాచికత్వంలో బీఆర్‌ఎస్ నేతలు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.