తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాణహాని ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. కేసీఆర్‌కు తన కుటుంబ సభ్యులతోనే ప్రాణహాని ఉందన్నారు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్.. కుటుంబసభ్యులకు దూరంగా పోలీసుల పహారా మధ్య ఉంటున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త చెప్పినట్లుగా ఉందని కొందరు అజ్ఞానంగా మాట్లాడారని సీఎం ఎద్దేవా చేశారు. వాళ్లు తమ అజ్ఞానాన్ని విజ్ఞానంగా భావిస్తున్నారని, అలాగే, వాళ్ల తెలివి తక్కువ తనాన్నే గొప్పతనంగా ఫీలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, ఆ వివరాలనే గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని చెప్పారు. గబీఆర్‌ఎస్ సర్కారు మహిళా గవర్నర్‌ను అవహేళన చేసిందని రేవంత్ ఆరోపించారు. ఇక, 2022లో బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగించారని గుర్తుచేశారు. ఇక, 2023లో న్యాయస్థానం కఠినంగా ఆదేశాలివ్వడంతో విధిలేని పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగాన్ని చేర్చారని రేవంత్ పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తి సొంత ఆస్తి కాదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
కేసీఆర్ గత ఎన్నికల తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరై.. రూ.57 లక్షల జీతం తీసుకున్నారని గణాంకాలు వెల్లడించారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్.. రూ.57,84,124 జీతభత్యాలు తీసుకున్నారని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ.. తెలంగాణ ప్రజలను మాత్రం వారి ఖర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని విమర్శించారు. కేసీఆర్.. సభకు రాక పోవడంతో పాటు.. వాళ్ల పార్టీ నాయకులను ఇలా తయారు చేసి పంపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజాశ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కానీ, బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం.. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు బుద్ధి చెప్పినట్లే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారికి గుండు సున్నానే మిగులుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.